ETV Bharat / state

inspirational story: ఆ ఊరుపేరు రాజులగూడ.. ఆ ఊళ్లో ఉండేవారెవరో తెలుసా..?

author img

By

Published : Nov 7, 2021, 5:17 PM IST

inspirational story
inspirational story

'పుట్టిన ఊరినీ, ఉంటున్న ఇంటినీ పొలాలనూ అన్నిటినీ వదిలేసుకుని వచ్చిన వారికి నిలువ నీడనిచ్చేదెవరు...’ కుమురం భీం జిల్లా జైనూర్‌ మండలం రాజులగూడ గ్రామానికి చెందిన ఆత్రం యాదవ్‌రావ్‌ మనసుని తొలిచేసిన ప్రశ్న ఇది. అందుకే, తనే ముందడుగు వేసి, అలాంటి వాళ్లు తన మూడెకరాల పొలంలో ఇళ్లు కట్టుకుని ఉండేందుకు ఏర్పాట్లు చెయ్యడం మొదలుపెట్టాడు. అలా... చేతబడులు చేస్తున్నారంటూ ఊరి నుంచి తరిమేయబడ్డ వారికోసం ఏర్పడిన గ్రామమే రాజులగూడ.

సైన్సు, టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ మారుమూల పల్లెలూ గిరిజన తండాల్లో మూఢనమ్మకాల జాడ్యం కొనసాగుతూనే ఉంది. కొన్ని గ్రామాల్లో అది మరీ శృతి మించి ఊళ్లో ఎవరైనా అనారోగ్యం పాలైనా హఠాత్తుగా మరణించినా, ఆఖరికి పశువులు జబ్బుపడినా ఫలానా కుటుంబం చేతబడులు చెయ్యడం, మంత్రాలు వెయ్యడం వల్లనే అని ప్రచారం అయిపోతుంది. అప్పట్నుంచీ నింద పడిన ఆ కుటుంబాన్ని వివక్షతో చూడటం మొదలుపెడతారు. కొన్నిచోట్ల ఊరి నుంచీ వెలి వేస్తుంటారు. ‘కానీ పుట్టిన ఊరినీ ఉంటున్న ఇంటినీ పొలాలనూ అన్నిటినీ వదిలేసుకుని వచ్చిన వారికి నిలువ నీడనిచ్చేదెవరు...’ కుమురం భీం జిల్లా జైనూర్‌ మండలం రాజులగూడ గ్రామానికి చెందిన ఆత్రం యాదవ్‌రావ్‌ మనసుని తొలిచేసిన ప్రశ్న ఇది. అందుకే, తనే ముందడుగు వేసి, అలాంటి వాళ్లు తన మూడెకరాల పొలంలో ఇళ్లు కట్టుకుని ఉండేందుకు ఏర్పాట్లు చెయ్యడం మొదలుపెట్టాడు. అలా... చేతబడులు చేస్తున్నారంటూ ఊరి నుంచి తరిమేయబడ్డ వారికోసం ఏర్పడిన గ్రామమే రాజులగూడ.

వారికోసం ఊరినే సృష్టించాడు!
వారికోసం ఊరినే సృష్టించాడు!

ప్రస్తుతం ఇక్కడ పద్నాలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. ‘నాకున్న మూడు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ భార్యా ఇద్దరు పిల్లలతో హాయిగా బతికేవాడిని. కానీ ఆరునెలల కిందట నా జీవితమే తలకిందులైపోయింది. మంత్రాలు వేస్తున్నానంటూ 42 గూడాలకు చెందిన పెద్దమనుషులు పంచాయతీ నిర్వహించి నన్ను గ్రామం నుంచి వెలివేశారు. ఎటు పోవాలో తెలియలేదు. అప్పుడే రాజులగూడ గుర్తొచ్చి ఇక్కడికొచ్చా. యాదవ్‌రావ్‌ స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ఇంటిని కట్టుకునేందుకు రేకుల్నీ ఉచితంగా ఇచ్చారు. ఇక్కడుంటూ నేనూ నా భార్యా కూలికెళ్లి కడుపు నింపుకుంటున్నాం’ ఇదీ ధనోరా గ్రామానికి చెందిన షెడ్మకీ నాందేవ్‌ పరిస్థితి. ఇలా ఈ ఊళ్లో ఉండే ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. కొందరు వృద్ధాప్యంలో కన్న బిడ్డల్నీ ఇంటినీ పొలాన్నీ వదిలి కేవలం పింఛనుతో ఇక్కడ బతుకు వెళ్లదీస్తున్నవారున్నారు. కంచన్‌పల్లికి చెందిన కనక శ్యాంరావ్‌ తొమ్మిదేళ్ల క్రితం ఎనభైఏళ్ల వయసులో భార్యతో ఇక్కడికొచ్చి తలదాచుకున్నాడు. పెద్దగా ఆస్తులు లేకపోయినా తనకున్నదాన్లో సాటి వారికి ఆశ్రయాన్ని కల్పిస్తున్న యాదవ్‌రావుని నిజంగా మెచ్చుకోవాల్సిందే కదూ...

ఇదీ చూడండి: Farmers Problems: అన్నదాతల అరిగోసలు.. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.