ETV Bharat / state

ఆరోగ్యం కోసం ఆర్గానిక్ వైపు.. యువ జంట కొత్త ఆలోచన

author img

By

Published : Mar 20, 2023, 6:04 PM IST

Softeare couple organic farming: ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... తరచూ అనారోగ్యానికి గురవుతున్న కుటుంబసభ్యులను చూసి పరిష్కారం దిశగా వెతికారు ఆ జంట. సేంద్రీయ వ్యవసాయంతోనే ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలమని గ్రహించి ఆ దిశగా అడుగులు ముందుకు వేసి విజయం సాధించారు. తాము పొందిన సత్ఫాలితాల్ని మరో నలుగురికి అందించాలని సేంద్రీయ వ్యవసాయమే ఉపాధిగా మలుచుకున్నారు. వారే కుమురం భీం జిల్లాకు చెందిన సునంద, రవి కుమార్. మరి, ఆర్గానిక్‌ సేద్యంలో ఎలాంటి మెళకువలు పాటించి వారు ఈ విజయం సాధించారో తెలుసుకుందాం పదండి.

couple doing organic forming in komurambheem district telangana
ఆరోగ్యం కోసం ఆర్గానిక్ వైపు.. యువ జంట కొత్త ఆలోచన

ఆరోగ్యం కోసం ఆర్గానిక్ వైపు.. యువ జంట కొత్త ఆలోచన

Softeare couple organic farming: ఈ ఇద్దరూ ఉన్నతమైన చదువులు చదివి.. కెరీర్‌లో చక్కగా స్థిరపడ్డారు. కానీ వారి కుటుంబాన్ని ఆనారోగ్య సమస్యలు వెంటాడుతునే వచ్చాయి. దీనికి తీసుకునే ఆహారమే ప్రధాన కారణమని భావించి.. పూర్తిగా ఆర్గానిక్‌ పద్ధతికి మారారు. తమకు జరిగిన మేలు అందరికి జరగాలని ఏకంగా సేంద్రీయసేద్యం ప్రారంభించి మంచి లాభాలతో ముందుకు వెళ్తున్నారు ఈ యువ జంట.

వీరు పేర్లు మాదాను రవికుమార్, సునంద. కుమురం భీం జిల్లా కౌటాల మండలం విజయ నగరం గ్రామానికి చెందిన వారు. రవికుమార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి, సునంద ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి లెక్చరర్‌గానూ పని చేసింది. కొవిడ్ పరిస్థితుల అనంతరం పిల్లలు, కుటుంబసభ్యులు తరచు అనారోగ్యం పాలవడంతో సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపారు.

మనం ఆహారాన్ని మనమే పండించాలి
మనం తినే తిండిని మనమే పండించుకోవాలని నిర్ణయించుకుని.. మొదట హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సేంద్రీయ వ్యవసాయం చేయాలని అనుకున్నారు. కానీ కొవిడ్ తదనంతర పరిస్థితులు వల్ల సొంత ఊర్లోనే చేయాలని భావించారు. అలా రవి కుమార్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ భార్య సునందతో కలిసి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. భర్త ప్రోత్సాహంతో సునంద 8ఎకరాల్లో సాగు మొదలు పెట్టింది. నీటి వసతి తక్కువ ఉన్నా సంప్రదాయ పంటలకు బదులుగా దేశీ రకం వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. చిక్కుడు, టొమాటో, గోబీ, క్యారెట్, మినుములు, ఆముదం, నువ్వులు, కుసుమలు ఒక్కో రకం పంటను అర ఎకరం చొప్పున వేసి పంట పండించారు. కృష్ణ వ్రీహి నల్ల బియ్యం, మాసిల్లే సాంబా రకం వరి, కుజు పటాలియం ఇంద్రాణి, జిరాపూర్, ఇలా 7 రకాల వరి కూడా పండిస్తున్నారు.

మనం తినే ఆహార పదార్థాల వల్లనే అనారోగ్యాలు అనేవి వస్తున్నాయి. 2018లో అనారోగ్య సమస్యలు వచ్చాయి. అప్పుడు మేము సేంద్రీయ పద్దతిలో పండిన కూరగాయలను మిగతా వస్తువులను తెప్పించుకున్నాము. అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు మా దరిచేరలేదు. అందుకే కొద్దిమందికైనా మంచి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం వైపు వచ్చాము. ఆహారమే ఆరోగ్యం..మంచి ఆహారం తింటేనే మనిషి మంచిగ ఉంటారు-మాదాను రవికుమార్

ఆర్గానిక్​లో ఆరోగ్యం
సేంద్రీయ వ్యవసాయ ఆహారం తినడంతో కుటుంబంలో ఆనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టాయంటున్నారు ఈ వీరిద్దరూ. వాళ్ల అబ్బాయి చాలాకాలంగా కంటి చూపు సమస్యతో బాధ పడుతుండేవాడు. చిన్న వయసులోనే అద్దాలు రావడం వారిని తీవ్రంగా కలచివేసింది. సేంద్రీయ ఆహారానికి మారాక ఆ సమస్య పూర్తిగా నయమైందని.. ఇంతకంటే ఏం కావాలంటున్నారు సునంద. రసాయనికి ఎరువుల అవసరం లేకుండా పంటలు పండించాలనేది లక్ష్యమంటున్నారు సునంద. ఇందుకోసం సీనియర్ రైతు శాస్త్రవేత్త చింతల వెంకట రెడ్డి సూచనలతో మట్టి, ఆముదం, కొబ్బరి పీచులతో సేంద్రీయ ఎరువులు తయారు చేస్తూ వాటినే పంటలకు వాడుతున్నారు. ఈ సేంద్రీయ పంటల విశేషాలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అర్దర్లు వస్తున్నాయంటున్నారు సునంద.

భావితరాలకు మంచి భూమిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం వైపు నా కెరీర్​ను ఎంచుకోవాల్సి వచ్చింది. మినుములు, సోయాబీన్స్ వాటిని కూడా సీడ్​కు ఇచ్చాము. దేశవాలి వడ్లను కూడా సీడ్​కు ఇచ్చాము. దేశవాలి సీడ్స్​ను ప్రమోట్ చేస్తూ, రైతులను వాటిని పండించుకోమని చెబుతూ మార్కెట్ చేస్తున్నాము. మా అబ్బాయికి సేంద్రీయ పదార్థాలు తినటం వల్ల తనకున్న సైట్ పోయింది. ఆరోగ్యం కంటే గొప్ప ఆస్తి వారికి ఏమి ఇవ్వగలం.అందరూ కూడాల తమకు కావాల్సిన వాటిని సేంద్రీయ పద్దతిలో పండించుకోవాలి. మట్టిలేకపోతే మనుగడే లేదు. మట్టిలోనే ఏ విత్తనమైనా పెరుగుతుంది. మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు మట్టిలోనే ఉన్నాయి. లోపలి మట్టిని తీసుకొని మొక్కలకు పిచికారి చేసినప్పుడు అవి చాలా బలంగా ఆరోగ్యంగా ఎదుగుతాయి. సునంద నాచురల్ ఫామ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ సేంద్రీయ వ్యవసాయం గురించి తెలియజేస్తున్నాము- మాదాను సునంద

సేంద్రీయ వ్యవసాయంతో ప్రస్తుతం నెలకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం వస్తుందని రవాణా సౌకర్యం మెరుగైతే మరింత వృద్ధి సాధించవచ్చని అంటున్నారు వీరిద్దరూ. మరోవైపు ఆసక్తి ఉన్నవారికి సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యవంతమైన సమాజానికి తమవంతు కృషి చేస్తున్నట్లు ఈ జంట చెబుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.