Women services for handicapped: కుమారుని కోసం ఉద్యోగాన్ని వదిలేసింది.. ఎందరికో అమ్మగా మారింది!

author img

By

Published : Sep 11, 2021, 12:26 PM IST

Updated : Sep 11, 2021, 3:34 PM IST

women services for handicapped, women resigned job for son

తొలి సంతానం కూతురు. రెండో సంతానంగా పండంటి కుమారుడు పుట్టాడు. ఆ దంపతులిద్దరికీ పట్టరాని ఆనందం. బోసినవ్వుల చిన్నారిని చూసి ఆ తల్లి మురిసిపోయింది. బాబుకు మూడేళ్లు నిండినా ఎదుగుదల కనిపించకపోవడం తల్లి గమనించింది. వైద్యులను సంప్రదించగా... బాబులో మానసిక ఎదుగుదల ఉండదన్న వైద్యుల మాటలతో వారిద్దరూ బోరుమన్నారు. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేదు. చివరకు కన్నపేగును కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశారు. అప్పటినుంచి 20 ఏళ్లు పైబడ్డ కొడుకును చంటిపిల్లాడిలా సాకుతున్నారు. అంతేకాదు తనలాంటి కష్టం మరే తల్లికీ రానీయొద్దన్న సంకల్పంతో శారీరక, మానసిక ఎదుగుదల లేని అభ్యాగుల పాలిట ఆశాదీపంగా(women services for handicapped) మారారు.

అభాగ్యుల పాలిట అమ్మ

ఖమ్మం జిల్లా గ్రామీణం మండలంలోని పెద్దతండాకు చెందిన నల్లగట్టు ప్రమీల, నాగేశ్వరరావు దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు. ప్రమీల ప్రభుత్వ ఉద్యోగి. వైద్యశాఖలో ఏఎన్ఎంగా పనిచేసేది. నాగేశ్వరరావు ఆర్టీసీ డ్రైవర్. పెద్దకుమారుడు ప్రవీణ్‌కు మూడేళ్ల వయసు వచ్చినా శారీరక, మానసిక ఎదుగుదల కనిపించలేదు. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఫలితం లేదు. ప్రవీణ్ నడవలేడని వైద్యులు తేల్చిచెప్పారు. మూడు చక్రాల కుర్చీకే పరిమితమైన కొడుకును చూసుకోవడం కోసం ఉద్యోగాన్ని వదిలేశారు. 20 ఏళ్లు నిండినా ఇంకా చంటిపిల్లాడిలా సపర్యలు చేస్తున్నారు.

తన కుమారుడిలాగా ఎంతో మంది చిన్నారులు ఉంటారనీ, వారి కన్నవారి పరిస్థితి, ఇంకా తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితిని ఆలోచించిన ప్రమీల.. తన కుమారుడిలాంటి వారికి అండగా ఉండేందుకు 2001లో పెద్దతండాలో మెఫీ మానసిక వికలాంగుల కేంద్రాన్ని(women services for handicapped) ఏర్పాటు చేశారు. ప్రారంభంలో 11 మందికి సేవలు అందించగా... ప్రస్తుతం దాదాపు 60 మంది అభాగ్యులకు మెఫీ కేంద్రం ఆశాదీపంగా మారింది. మానసిక, శారీరక ఎదుగుదల లేని చిన్నారులు, యుక్త వయసు వారికి అన్నీ తానై ప్రమీల సేవలు అందిస్తున్నారు. వారందరికీ స్నానం చేయించడం, భోజనం తినిపించడం, ఆలనాపాలనా చూస్తున్నారు. ఇలా 20 ఏళ్లుగా మెఫీ కేంద్రంలో మానసిక వికలాంగులకు సేవలు చేస్తున్నారు ప్రమీల.

శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారికి మనం చెప్పిన విషయం అర్థం కావాలన్నా, చేస్తున్న పని తెలియాలన్నా వారికి ప్రత్యేక శిక్షణ తీసుకుంటేనే సాధ్యం. అందుకే హైదరాబాద్‌లోని ఎన్ఐఎంహెచ్ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఆ శిక్షణ ద్వారా మెఫీ కేంద్రంలో అభాగ్యుల బాగోగులు చూస్తున్నాను. నేను నేర్చుకున్న శిక్షణతో చాలామంది దివ్యాంగులు కొంతవరకు సాధారణ స్థితికి తీసుకురాగలిగాను. ఇప్పటివరకు దాదాపు 20 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ఇక రెండు దశాబ్దాలుగా మానసిక, శారీరక వికలాంగులకు మెఫీ కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నాం. మా కుటుంబం మొత్తం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నా కూతురు ప్రియాంక, రెండో కొడుకు అన్వేశ్‌కు ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. వారిద్దరూ మెఫీ కేంద్రంలో మానసిక వికలాంగులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

-ప్రమీల, మెఫీ వికలాంగుల కేంద్రం నిర్వాహకురాలు

ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ప్రమీల మాత్రం వెనకడుకు వేయడం లేదు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారైనప్పటికీ రెండు దశాబ్దాలుగా సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. భర్తకు వచ్చే జీతంలో సగానికిపైగా మెఫీ కేంద్రానికే కేటాయిస్తున్నారు. అప్పుడప్పుడూ దాతలు ఇచ్చిన విరాళాలు, పుట్టినరోజు, శుభకార్యాల రోజుల్లో ఇతరులు అందించే భోజనం అందిస్తున్నారు. తన చివరి శ్వాస వరకు ఈ అభాగ్యులకు సేవ చేస్తానని.. ప్రభుత్వం చేయూతనిస్తే మరిన్ని సేవలు కొనసాగిస్తానని ప్రమీల చెబుతున్నారు.

ఇదీ చదవండి: MURDER: భార్యను దూషించాడని... బండరాయితో కొట్టి చంపేశాడు!

Last Updated :Sep 11, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.