ETV Bharat / state

తెలంగాణలో టీడీపీ ఎక్కడుందన్న వారికి ఈ సభే సమాధానం : చంద్రబాబు

author img

By

Published : Dec 21, 2022, 9:34 PM IST

Updated : Dec 22, 2022, 8:36 AM IST

TDP Chief Chandrababu at public meeting in Khammam: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని క్రియాశీలకంగా చేయాలని తాను కోరుతున్నానన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని ఖమ్మం సభలో చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.

TDP CHIEF CHANDRABABU NAIDU
టీడీపీ అధినేత చంద్రబాబు

పార్టీ అవసరంఉంది అనుకున్నవాళ్లు తిరిగి పార్టీలోకి రావాలి

TDP Chief Chandrababu at public meeting in Khammam:‘తెలుగు రాష్ట్రాలను కలిపేయాలని కొందరు బుద్ధిలేని వాళ్లు మాట్లాడుతున్నారు. కానీ ఎప్పటికీ రెండు రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశమే లేదు’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాలు విడిపోయినా దేశంలో ఆదర్శంగా నిలపాలన్నదే టీడీపీ అభిమతమని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు దేశంలో మొదటి రెండు స్థానాల్లో ఉండాలన్నదే తన చిరకాల వాంఛ అని చెప్పారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ మైదానంలో బుధవారం నిర్వహించిన తెదేపా శంఖారావం బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఖమ్మం సభ ప్రేరణతో నాయకులు, కార్యకర్తలు మళ్లీ ఉత్సాహంగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఘనచరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఈ సభ నాంది పలుకుతుందని చెప్పారు. బహిరంగ సభకు పోటెత్తినవారే నాయకులను తయారుచేయాలన్నారు. టీడీపీ హయాంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సామాజిక మార్పులు తీసుకొచ్చామని గుర్తుచేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకన్నా ఓటు అడిగే హక్కు తెదేపాకే ఎక్కువ ఉందన్నారు. తానెప్పుడూ అధికారం కోరుకోలేదని.. ప్రజల అభిమానం మాత్రమే కోరుకున్నానన్నారు.

.

తెలంగాణలో టీడీపీ ఎక్కడుందన్న వారికి ఈ సభే సమాధానం.. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల నాయకులను తయారు చేశామన్నారు. చాలారోజుల తర్వాత ఖమ్మం వచ్చానని.. ప్రజలు చూపిన ఆదరణను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందని అడిగే వాళ్లకు ఖమ్మం బహిరంగ సభే సమాధానమిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెదేపా అన్నారు. ప్రాజెక్టులు నిర్మించి నీటిపారుదల రంగానికి ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ, బీమా, నెట్టెంపాడు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, దుమ్ముగూడెం ప్రాజెక్టులు నిర్మించిన ఘనత తెదేపా ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. వేర్వేరు కారణాలతో పార్టీని విడిచివెళ్లిన వారంతా మళ్లీ తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేకున్నా ఇంత ప్రజాబలం తెదేపాకు ఉందంటే అది కార్యకర్తల వల్లేనన్నారు. రాష్ట్ర రైతాంగానికి గిట్టుబాటు ధర అందించేలా ప్రభుత్వం పనిచేయాలన్నారు.

‘‘30 ఏళ్ల ముందుచూపుతో భవిష్యత్తును నిర్మించిన ఘనత టీడీపీ ప్రభుత్వాలకు దక్కుతుంది. 20 ఏళ్ల క్రితమే ఐటీకి ప్రాధాన్యమిచ్చాం. కాలికి బలపం కట్టుకుని ఐటీ కంపెనీలు తీసుకొచ్చా. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోతే పట్టుబట్టి యువత కోసమే కలిశాను. ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో మరే దేశం డిజిటల్‌ రంగంలో పోటీపడలేదంటే అందులో తెదేపా కృషి ఎంతో ఉంది. యువతకు ఐటీని బహుమానంగా ఇచ్చాం. సంపద సృష్టించి యువతకు ఉపాధి కల్పించేలా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. కొవిడ్‌కు టీకా కనిపెట్టిన భారత్‌ బయోటెక్‌ను తెదేపా తీసుకొచ్చినందుకు అత్యంత సంతృప్తిగా ఉంది’’ - చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

‘‘టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. నాలుగు దశాబ్దాల ఘన చరిత్ర మంచి భవిష్యత్తుకు పునాది వేయబోతోంది. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్టీఆర్‌ వ్యక్తి కాదు శక్తి. తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా చోటు దక్కించుకున్న మహానాయకుడు. ఎన్టీఆర్‌ ఆశయాల సాధన కోసమే తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం’’ - చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

త్వరలో నిజామాబాద్‌లో సభ.. "ఖమ్మం శంఖారావం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తాం. ముందు నిజామాబాద్‌ జిల్లాలో.. తర్వాత మిగతా జిల్లాల్లో నిర్వహించి చివరగా హైదరాబాద్‌లో సింహగర్జన సభ ఏర్పాటు చేస్తాం. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది తెదేపాయే. బీసీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అండదండలు అందించిన పార్టీగా తెదేపాకు ఎప్పుడూ సుస్థిర స్థానం ఉంటుంది. అభివృద్ధికి చిరునామాగా మారిన తెదేపాకు ప్రజలు అండగా నిలవాలి. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యతను యువత తమ భుజస్కంధాలపై వేసుకోవాలి." - కాసాని జ్ఞానేశ్వర్‌, టీటీడీపీ అధ్యక్షుడు

బాబుకు జన నీరాజనం.. బహిరంగ సభకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనశ్రేణిలో వచ్చిన చంద్రబాబుకు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీగా చంద్రబాబు కాన్వాయ్‌ సాగింది. కూసుమంచి మండలం కేశవాపురంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఖమ్మం గ్రామీణ మండలంలో అడుగడుగునా పార్టీ కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. ర్యాలీకి ఖమ్మంలో విశేష స్పందన లభించింది. పలుచోట్ల చంద్రబాబును గజమాలతో సత్కరించారు.

ఖమ్మంలో జరిగిన సభకు తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తెదేపా సీనియర్‌ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు, బక్కని నర్సింహులు, అరవింద్‌కుమార్‌గౌడ్‌, నన్నూరి నర్సిరెడ్డి, టి.జ్యోత్స్న, నందమూరి సుహాసిని, కాట్రగడ్డ ప్రసూన, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో జరిగే సభకు చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో బయల్దేరి వెళ్లారు. బుధవారం ఉదయం బేగంపేట రసూల్‌పుర కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. నగరంలోని పలు చోట్ల అభిమానులు ఆయనకు గజమాలలు వేసి, పూలు చల్లి స్వాగతించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 22, 2022, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.