ETV Bharat / state

ఆరు రోజుల తర్వాత జైలు నుంచి విడుదల... తల్లులతోపాటు జైలులో ఉన్న శిశువులు

author img

By

Published : Aug 11, 2021, 1:12 PM IST

women-were-released-from-prison
జైలు నుంచి విడుదల

పోడు భూముల కేసులో అరెస్టై.... జైలు పాలైన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్​కు చెందిన 21 మంది పోడుసాగుదారులు... కారాగారం నుంచి విడుదలయ్యారు. ముగ్గురు చంటిపిల్లల తల్లులు సైతం ఆరు రోజుల పాటు జైలు జీవితం గడిపి బయటకు రావడంతో.. జిల్లా జైలు వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌ పోడు భూముల కేసులో అరెస్టైన మహిళలు జైలు నుంచి విడుదలయ్యారు. వారం రోజుల క్రితం అటవీ అధికారులకు, ఆదివాసీలకు మధ్య జరిగిన వివాదంలో... పోలీసులు ఆదివాసీలపై కేసులు నమోదు చేశారు. కోర్టు వీరికి జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించగా... తల్లుల వెంట చంటి పిల్లలను సైతం అధికారులు జైలుకు పంపారు.

ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా... ఆరు రోజుల పాటు జైలులో ఉన్న... 18 మహిళలు ఇవాళ విడుదలయ్యారు. పసిపిల్లల తల్లులమని కూడా చూడకుండా జైలులో తమను చిత్రహింసలకు గురిచేశారంటూ.... బాధితులు కారాగారం ముందు ఆందోళనకు దిగారు.

జైలు నుంచి విడుదల

'నేను మూడు నెలల బాలింతను. జైలులో బియ్యం ఏరమంటే.. పాపను పక్కకు పెట్టి మరీ ఏరాను. పిల్లలు ఉన్నారని కనికరించకుండా పని చేయించారు. నాకు ఈ సమయంలో ఈ కష్టమెందుకు సార్. పిల్లలకు బాలేదని చెప్పినా... పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. పైగా మేము నాటకాలు ఆడుతున్నామంటూ హేళన చేశారు. మా భూములకు పట్టాలు ఇస్తే చాలు మాకు. ఇంకేమి వద్దు.'

-బాధితురాలు

'పిల్లలు ఉన్నవాళ్లకి వచ్చిన వెంటనే పాలు, బ్రెడ్లు ఇచ్చాం. కావాలంటే వారిని అడగండి. జైలులోకి ఎవరూ వచ్చినా... ప్రస్తుత పరిస్థితుల్లో క్వారంటైన్ ఉంచుతున్నాము. ఆ నేపథ్యంలోనే గదికి తాళం వేశాం. జైలులో సాధారణంగా ఎవరూ కొట్టరు. ఈ విషయంపై నాకు ఎలాంటి సమాచారం రాలేదు. నిజమని తెలిస్తే... బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.'

-శ్రీధర్, జిల్లా జైలు సూపరింటెండెంట్

జైలులో తమను కొట్టారంటూ మహిళలు.. ఎన్టీ నేతలతో గోడు వెళ్లబోసుకున్నారు. జైలు అధికారుల తీరును నిరసిస్తూ... బాధితులతో కలిసి న్యూడెమోక్రసీ నేతలు బైఠాయించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ గంట సేపు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. కొట్టినట్లు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జైలు సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో.. ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: 'పోడు పోరు'లో పసి పిల్లలు.. గుక్కపట్టి ఏడుస్తూ తల్లులతోపాటే జైలుకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.