ETV Bharat / state

రక్తమోడిన రహదారులు.. ఆరుగురి మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు

author img

By

Published : Mar 25, 2023, 2:25 PM IST

Updated : Mar 25, 2023, 2:45 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రహదారులు రక్తమోడాయి. పలు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాతపడగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. అధిక వేగం, వాహనం నడిపేటప్పుడు మద్యం సేవించడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు.

రక్తమోడిన రహదారులు.. ఆరుగురి మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు
రక్తమోడిన రహదారులు.. ఆరుగురి మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు

రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారులపైనే ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. విచక్షణ కోల్పోయి అతి వేగంతో రోడ్లపై ప్రయాణించడం, తప్పతాగి వాహనాలు నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఖమ్మంలో శుక్రవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. నగరంలోని చర్చి కంపౌండ్ పైవంతెన డివైడర్​ను వేగంగా బైకు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామానికి చెందిన శివరామకృష్ణ(22), ఉదయ్(21)గా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను ఖమ్మం మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడికి నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనతో మృతుల సొంత గ్రామం మేడేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రహదారిపై పని చేస్తున్న కూలీలపై దూసుకొచ్చిన లారీ.. జాజాతీయ రహదారి డివైడర్​పై మొక్కలు కత్తిరిస్తున్న జీఎమ్మార్ కూలీలపైకి లారీ దూసుకొచ్చిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నడిగూడెం మండలం రామాపురానికి చెందిన 8 మంది కూలీలు ట్రాక్టర్​లో మొక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ ఆగివున్న ట్రాక్టర్​ను ఢీకొట్టి, కూలీలపైకి దూసుకొచ్చింది. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని ఖమ్మంనకు తరలించారు.

భార్యాభర్తల మృతి.. ఖమ్మం జిల్లా వైరాలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ బయలుదేరిన దంపతులు.. అనుకోని విధంగా మృతి చెందారు. సత్తుపల్లికి చెందిన రంగా సుభాష్, రోజా దంపతులు హైదరాబాద్​లో చిన్నపాటి కిరాణా దుకాణం నడుపుతూ జీవిస్తున్నారు. ఉదయం సత్తుపల్లి నుంచి హైదరాబాద్​కు స్కూటీపై భార్యాభర్తలు బయలుదేరారు. వైరా రింగ్ రోడ్ కూడలిలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వైరా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విందు కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు చేరుకొని.. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రూఫ్​ఖాన్​పేట గేటు సమీపంలో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ విందుకు హాజరయ్యేందుకు వస్తుండగా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated :Mar 25, 2023, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.