ETV Bharat / state

గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమైన రాజకీయ పార్టీలు

author img

By

Published : Apr 16, 2021, 4:30 AM IST

రాష్ట్రంలో మినీ పురపోరు జరిగే ప్రాంతాల్లో... రాజకీయ సందడి నెలకొంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తైన వెంటనే నోటిఫికేషన్‌ రావడంతో... గెలుపు గుర్రాల వేటలో పార్టీలన్నీ నిమగ్నమయ్యాయి. ఖమ్మంలో మారిన రిజర్వేషన్లతో... తాజా మాజీల్లో అంతర్మథనం మొదలైంది. తమకు అనుకూలమైన డివిజన్‌ కోసం... నేతల వద్దకు వద్దకు 'క్యూ' కడుతున్నారు. అటు... ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎన్నికలు జరుగుతున్న.. రెండు పురపాలికలకు రిజర్వేషన్లు ఖరారు కావటం వల్ల.. అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు ఆశావహులు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు.

Khammam Pura elections, Mahbubnagar latest news
గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమైన రాజకీయ పార్టీలు

నగర, పురపాలక సంస్థ ఎన్నికల పర్వం ప్రారంభం కావడంతో.. ఆయా ప్రాంతాల్లో కోలాహాలం నెలకొంది. ఖమ్మం బల్దియాలో 50 డివిజన్లు ఉండగా... పునర్విభజన తర్వాత... ఈ సంఖ్య 60కి చేరింది. ప్రస్తుతం ఉన్న 50 స్థానాల్లో... తెరాసకు చెందిన 43 మంది, ముగ్గురు కాంగ్రెస్, సీపీఎమ్​, సీపీఐలకు ఇద్దరు చొప్పున సభ్యులున్నారు. వీరు ప్రాతినిథ్యం వహించిన డివిజన్లలో చాలావరకు రిజర్వేషన్లు మారిపోయాయి. పునర్విభజన కారణంగా ఇప్పటికే డివిజన్ల రూపురేఖలు మారటం, హద్దులు చెరిగిపోయి, డివిజన్ నెంబర్లు మారి సతమతమవుతున్న సిట్టింగ్‌లకు... తాజా రిజర్వేషన్లు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. రిజర్వేషన్ మారిన చోట పోటీ కూడా విపరీతంగా ఉండటం.. సిట్టింగు కార్పొరేటర్లకు సంకటంగా మారింది. తమ స్థానంలో తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపేందుకు... తాజా మాజీలు ప్రయత్నాలు చేస్తుంటే.. రిజర్వేషన్ మారినందున... తమకు అవకాశం ఇవ్వాలని కొత్త ఆశావహులు పట్టుబడుతున్నారు.

టికెట్ కేటాయించాలంటూ..

అభ్యర్థుల అన్వేషణ పార్టీలకు సైతం తలనొప్పిగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ అభ్యర్థుల వేట మరింత ముమ్మరం చేశాయి. ఖమ్మం తెరాసలో అయితే పరిస్థితి మరింత క్లిష్ట తరంగా మారింది. అన్ని డివిజన్లలో భారీగా ఆశావహులు ఉండటంతో... అభ్యర్థుల ఎంపికపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన డివిజన్లలో ఇప్పటికే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసింది. పార్టీ హామీ మేరకు పలువురు ఇప్పటికే అంతర్గత ప్రచారం సైతం చేసుకుంటుండగా... తాజా రిజర్వేషన్లు పార్టీల నేతలకు కూడా తలనొప్పులు తెచ్చిపెట్టాయి. రిజర్వేషన్ల ఆధారంగా తమకు టికెట్ కేటాయించాలంటూ... మంత్రి పువ్వాడ అజయ్ వద్దకు డివిజన్ల వారీగా తెరాసలోని ఆశావహులు బారులు తీరుతున్నారు. కాంగ్రెస్, భాజపా సహా వామపక్షాలు సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మరింత ముమ్మరం చేస్తున్నాయి.

పదేళ్లు గడుస్తున్నా..

అటు... ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. జడ్చర్ల పురపాలిక ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు. తాజాగా కావేరమ్మపేట గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు ముగియడంతో... జడ్చర్ల, బాదేపల్లి, కావేరమ్మపేటలను కలిపి జడ్చర్ల మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. దీంతో జడ్చర్ల మున్సిపాలిటీకి మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగనుండగా.. ఛైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. పురపాలికను మొత్తం 27 వార్డులుగా విభజించి... ఓటర్ల జాబితాను సైతం ఇప్పటికే ప్రకటించారు. తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న జడ్చర్లలో పాగా వేసేందుకు తెరాస సహా విపక్షాలు ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

పునరావృతం చేయాలని

అచ్చంపేట మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో 20కి 20 వార్డులను తెరాస గెలుచుకోగా... అదే రికార్డును ఈసారి పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. విపక్షాలు సైతం ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే ఛైర్మన్ అభ్యర్ధిని ప్రకటించింది. రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావహులంతా... వారి వారి వార్డుల నుంచి తమ అభ్యర్ధిత్వాలను ఖరారు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలతోపాటు.. అలంపూర్‌లోని ఐదో వార్డుకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్... అనారోగ్య కారణాలతో మృతి చెందటంతో... ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.


ఇదీ చూడండి: 'ఏదో ఒక రోజు తెలంగాణకి ముఖ్యమంత్రిని అవుతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.