బీఆర్ఎస్ సత్తా చాటేలా.. ఖమ్మం బహిరంగ సభ నిర్వహణ

author img

By

Published : Jan 14, 2023, 9:17 AM IST

Etv Bharat

BRS Public Meeting in Khammam on 18th: ఖమ్మం వేదికగా ఈనెల18న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. 2001లో కరీంనగర్ సింహగర్జన సభ ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినట్టే.. ఖమ్మం సభ బీఆర్ఎస్​కు జాతీయ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు తెచ్చేలా ప్రజలు విజయవంతం చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్‌రావుకి సభా నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలందరినీ ఒకేతాటిపైకి తీసుకొస్తున్నారు.

బీఆర్ఎస్ సత్తా చాటేలా.. ఖమ్మం బహిరంగ సభ నిర్వహణ

BRS Public Meeting in Khammam: ఖమ్మంగడ్డపై 5 లక్షల మందితో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతున్న భారత్ రాష్ట్రసమితి ఎక్కడా రాజీపడకుండా ఏర్పాట్లుచేస్తోంది. సభా నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు ఖమ్మంలో మకాంవేసి ఎప్పటికప్పుడు పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా,ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభ లక్ష్యాలు.. భారీ జనసమీకరణ, సభకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 3 లక్షల మందిని తరలించేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు. సమీపంలోని జిల్లాల నుంచి.. జన సమీకరణ చేసేలా మార్గనిర్దేశం చేస్తున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారగా.. అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా నియోజకవర్గ నేతలతో మంత్రి హరీశ్​రావు మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు.

వైరాలో జరిగిన.. బీఆర్​ఎస్ సన్నాహక సమావేశం ఆద్యంతం ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్‌లాల్, బానోత్ చంద్రావతి హరీష్‌రావు ఆధ్వర్యంలో కలుపుగోలుగా మాట్లాడుకోవడం కార్యకర్తల్లో ఆసక్తి రేకెత్తించింది. బహిరంగ సభకు.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా హాజరవుతున్నందున బహిరంగ సభలో సీపీఎం, సీపీఐ నాయకులు, శ్రేణుల్ని.. బీఆర్ఎస్ భాగస్వామ్యం చేస్తోంది. ఇందుకోసం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో సీపీఎం, సీపీఐ నేతలతో మంత్రి హరీశ్​రావు సమావేశమయ్యారు. 18న బహిరంగ సభలో పాల్గొనాలని హరీశ్‌ కోరగా.. వారు సమ్మతించారు.

ఖమ్మం జిల్లాలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం క్రాస్‌రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఇరువురు.. పెద్దఎత్తున జన సమీకరణ జరిగేలా చూడాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

"నాకు చాలా సంతోషంగా ఉంది. ముగ్గురు నేతలు సభలో చాలా చక్కగా మాట్లాడారు. ఖమ్మం సభ బీఆర్ఎస్​కు చాలా ముఖ్యం. జాతీయస్థాయి నాయకులు సభకు వస్తున్నారు. జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే సభ ఖమ్మం సభ. దేశంలో తెలంగాణ నమూనాపై చర్చ జరుగుతోంది."-హరీశ్​రావు, ఆర్థిక శాఖ మంత్రి

"ఈ నెల 18న భారీ బహిరంగ సభలో అందరూ భాగస్వామ్యులు కావాలి. మన ఖమ్మం జిల్లాలో ఈ సభ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు తరలిరావాలి." - నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ లోక్ సభాపక్షనేత

ఇవీ చదవండి: ఒడిశా బీఆర్​ఎస్ అధ్యక్షునిగా గిరిధర గమాంగ్‌! 18న ఖమ్మంలో ప్రకటించే అవకాశం

'విద్వేషపూరిత ప్రసంగాలతో ముప్పు.. TV ఛానెళ్లు హింసకు పాల్పడితే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.