ETV Bharat / state

డిజిటల్ లావాదేవీలే లక్ష్యం.. ఆ దిశగా ​ఖమ్మం బ్యాంకుల అడుగులు

author img

By

Published : Feb 8, 2021, 2:12 PM IST

khammam,digital transactions
ఖమ్మం, డిజిటల్​ లావాదేవీలు

రాష్ట్రంలో నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్‌ లావాదేవీలను పెంచే దిశలో అడుగులు ముందుకు పడుతున్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి డిజిటల్‌ లావాదేవీల స్థితిగతులను పరిశీలించేందుకు ఎస్ఎల్​బీసీ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక సబ్‌ కమిటీ దీనిని పర్యవేక్షిస్తోంది. ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లాను పూర్తి స్థాయి డిజిటల్‌ జిల్లాగా వచ్చే నెల చివరనాటికి పూర్తి చేయాలని ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయించింది.

దేశంలో 2016 నవంబరు 8న పెద్ద నోట్లు రద్దు తరువాత... క్రమంగా నగదు లావాదేవీలు తగ్గుతూ, డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్నాయి. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాంకర్లపై ఒత్తిడి పెంచి నగదు లావాదేవీలను నియంత్రించేందుకు కేంద్రం ఆంక్షలు విధిస్తోంది.

ఎస్ఎల్​బీసీ ఆదేశాలు

రాష్ట్రంలో 2019 సెప్టెంబరు 30న జరిగిన ఎస్‌ఎల్‌బీసీ(రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి) సమావేశం.. 2020 అక్టోబరు చివరి నాటికి ఖమ్మం జిల్లాను పూర్తి స్థాయి డిజిటల్‌ జిల్లాగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, గ్రామీణ, సహకార బ్యాంకులను లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఎస్‌ఎల్‌బీసీ ఆదేశించింది. ఇందుకోసం ప్రతి బ్యాంకు ఓ నోడల్‌ అధికారిని నియమించి ఖమ్మం జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌కు అనుసంధానం చేసింది. తరచూ సమీక్షలు నిర్వహిస్తూ... డిజిటల్‌ లావాదేవీలు వంద శాతం పూర్తి చేసే బాధ్యతను భారతీయ స్టేట్‌ బ్యాంకు తీసుకుంది. అన్ని బ్యాంకులు.. బ్రాంచీల వారీగా వ్యాపార, వాణిజ్య సంస్థలను, సర్వీసు ప్రొవైడర్లను గుర్తించి పూర్తి స్థాయిలో సర్వే చేసింది. ప్రదేశాల వారీగా స్థానికంగా ఉన్న మౌలిక వసతులు, అంతర్జాలం, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న డిజిటల్‌ లావాదేవీలు, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ తదితర వాటిని కూడా పరిశీలించింది. మౌలిక వసతులు లేకపోవడం, ఇతరత్రా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని తక్షణం పరిష్కరించేందుకు ఎస్‌ఎల్‌బీసీ ఉప కమిటీని ఏర్పాటు చేసింది.

డిజిటల్​ లావాదేవీల జిల్లాగా

ఖమ్మంను వందశాతం డిజిటల్‌ లావాదేవీల జిల్లాగా తీర్చిదిద్దేందుకు బ్యాంకర్లు తీసుకుంటున్న చర్యలపై గతేడాది అక్టోబర్ 28న పురోగతిని ఆర్బీఐకి ఎస్ఎల్​బీసీ నివేదించింది. జిల్లాలో 2020 జూన్ నాటికి 25.57లక్షలు సేవింగ్‌ ఖాతాలు, 40,167 కరెంట్‌ ఖాతాలు ఉన్నాయి. నిరక్షరాస్యత కలిగిన ఖాతాదారులను డిజిటల్ లావాదేవీల నుంచి మినహాయిస్తే గతేడాది సెప్టెంబర్ నాటికి 19.60 లక్షల సేవింగ్ ఖాతాలు, 37,138 కరెంట్‌ ఖాతాలు ఉన్నట్లు ఎస్‌ఎల్​బీసీ తన నివేదికలో స్పష్టం చేసింది. సేవింగ్ ఖాతాల్లో 59.69 శాతం డెబిట్ కార్డులు, 15.25 శాతం నెట్ బ్యాంకింగ్, 18.58 శాతం యూపీఐ లావాదేవీలు ఉన్నట్లు పేర్కొన్న ఎస్ఎ​ల్​బీసీ మొత్తంగా 64.49 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా, కరెంట్ ఖాతాల్లో 35.54 నెట్ బ్యాంకింగ్, 20.28 శాతం పాయింట్ ఆఫ్ సేల్ ఉండగా మొత్తం మీద 48.46 శాతం లావాదేవీలు ఉన్నట్లు వెల్లడించింది.

ముందుకెళ్లాలి

అయితే గత అక్టోబర్ నాటికే ఖమ్మంను పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీల జిల్లాగా మార్చాల్సి ఉండగా కొవిడ్ మూలంగా అది సాధ్యం కాలేదు. వచ్చే నెల 31 నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్ణయించిన ఎస్ఎల్​బీసీ.. పురోగతిపై వారం వారం సమీక్షలు నిర్వహించాలని ఆ జిల్లా లీడ్ బాంక్ మేనేజర్​కు స్పష్టం చేసింది. ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకుని లక్ష్యసాధన వైపు ముందుకెళ్లాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా పల్లా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.