ETV Bharat / state

ప్రకృతి ప్రకోపంతో.. అన్నదాత మరోసారి ఓడిపోయాడు!

author img

By

Published : Oct 15, 2020, 1:04 PM IST

కాలం అనుకూలించిందని సంబురపడ్డ కర్షకులకు ప్రకృతి కల్లోలం నిరాశే మిగిల్చింది. అధిక దిగుబడులు వస్తాయనుకున్న అన్నదాతల కలలన్నీ కల్లలయ్యాయి. పెట్టుబడి పూడుతుందని, లాభాలొస్తాయని కొండంత ఆశతో చేతికొచ్చిన పంటను కోసేందుకు సిద్ధమవుతున్న రైతుపై వరణుడి కోపం శాపమైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా ఈదురుగాలులకు నేలకొరిగింది. ఎలాగోలా పంట కోసిన రైతుల ధాన్యమంతా వాయుగుండం ప్రభావానికి వర్షార్పణమైంది. రెక్కలు ముక్కలు చేసుకుని, రాత్రింబవళ్లు కష్టపడి, ఎండా, వానకోర్చి.. పండిన పంట చేతికొచ్చే సమయంలో కళ్లముందే నీటిపాలవడం చూసిన.. ఆ రైతుల గుండెలు బద్ధలవుతున్నాయి.

Heavy crop loss in khammam and bhadradri districts
అన్నదాత మరోసారి ఓడిపోయాడు!

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అధిక వర్షాలు అన్నదాతల వెన్నువిరిచాయి. కర్షకుల ఆరుగాలం శ్రమ మరోసారి బూడిదలో పోసిన పన్నీరైంది. గత సీజన్లన్నింటికన్నా భిన్నంగా ఈ సారి ఆరంభం నుంచీ ఊరించి ఆశలు నింపిన వర్షాలే.. సీజన్ చివరి నాటికి రైతుల గుండెల్ని పిండేశాయి. భారీ వర్షాలు.. పంటలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. నెల రోజుల క్రితం కురిసిన వర్షాలతో ప్రధాన పంటలైన పత్తి, పెసర పంటలు నష్టాలు మిగల్చగా.. మూడ్రోజులుగా కురుస్తున్న అధిక వానలు వరి పంటనూ నీటముంచేశాయి.

వేల ఎకరాలు.. నీటి పాలు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో పంటలన్నీ అధిక వర్షాల ధాటికి నీటిపాలయ్యాయి. భద్రాద్రి జిల్లాలో అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలోని మొత్తం 23 మండలాల్లో 4,126 మంది రైతులకు పంట నష్టం జరిగింది. 7,053 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. వీటిలో వరి 4,890 ఎకరాలు, పత్తి 1,723, వేరుశనగ 206, మిర్చి 234 ఎకరాలు. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ శాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం.. మొత్తం 345 గ్రామాల్లో 53, 358 మంది రైతులకు నష్టం వాటిల్లింది. 76, 819 ఎకరాల్లో వివిధ పంటలు నీటిపాలైంది. వీటిలో వరి 38,111 ఎకరాల్లో, 37,227ఎకరాల్లో పత్తి, కంది 26 ఎకరాల్లో, 1,455 ఎకరాలు.

పంట నష్టం

నియంత్రిత సాగు విధానంతో ఉభయ జిల్లాల్లో ఈ సారి పత్తి, వరి సాగు గణనీయంగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో వరి 2, 78, 690 ఎకరాల్లో, పత్తి 2, 68, 582 ఎకరాల్లో, మిర్చి 55,000 ఎకరాల్లో సాగయింది. భద్రాద్రి జిల్లాలో వరి 1, 66, 630 ఎకరాలు, పత్తి 2, 07, 992 ఎకరాలు, మిర్చి 1, 60,000 ఎకరాల్లో సాగు చేశారు. నెలరోజుల క్రితం కురిసిన వర్షాలకు పత్తి, పెసర పంటలు నీటమునిగి రైతులు నష్టపోయారు. ప్రాథమిక పంట నష్టం అంచనాలను వ్యవసాయ శాఖ.. రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

దెబ్బ మీద దెబ్బ

ఆ విపత్తు నుంచి కోలుకోకముందే.. మూడ్రోజులుగా కుండపోతగా కురిసిన భారీ వర్షాలు రైతుల్ని నిండా ముంచాయి. చేతికొచ్చే దశలో ఉన్న పత్తి, మరో 30 రోజుల్లో చేతికి వచ్చే వరి పైర్లన్నీ వర్షపు నీటిలో మునిగిపోయాయి. పత్తి రంగుమారి ఎందుకు పనికి రాకుండా పోయింది. పంట పొలాల్లో నుంచి పత్తి తీసే పరిస్థితి కూడా లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నెలరోజుల వ్యవధిలోనే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అధిక వర్షాలు మిగిల్చిన కష్టంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు పడిపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.