ETV Bharat / state

ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న ధరణి సేవలు.. అడ్డుగా ఏజెన్సీ చట్టాలు..

author img

By

Published : Nov 11, 2020, 11:57 AM IST

అవినీతి రహితంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సేవలు జోరుగా సాగుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, యాజమాన్య హక్కుల మార్పిడి వంటి ప్రక్రియలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తహసీల్దార్, జాయింట్ రిజిస్టార్ కార్యాలయాల్లో సందడి నెలకొంది.

dharani service speed up in khammam district
ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న ధరణి సేవలు.. అడ్డగా ఏజెన్సీ చట్టాలు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధరణి సేవలు ఊపందుకుంటున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, యాజమాన్య హక్కుల మార్పిడి వంటి ప్రక్రియలతో తహసీల్దార్, జాయింట్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సందడి నెలకొంది. గతంలో పట్టాదారు పాసు పుస్తకాల కోసం కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ తిరిగిన రైతులు.. ప్రస్తుత ప్రక్రియతో ఊపిరి పీల్చుకుంటున్నారు. యాజమాన్య హక్కుల మార్పిడి అత్యంత త్వరితగతిన పూర్తవుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆదిలోనే హంసపాదు అన్నట్లు ధరణి సేవలకు అక్కడక్కడ ఇబ్బందులు తప్పడం లేదు. దరఖాస్తుదారులు స్లాట్లు బుక్ చేసే సందర్భంలో వ్యక్తిగత వివరాల నమోదులో కొన్ని కొన్ని తప్పిదాలు చేస్తున్న పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొన్ని చోట్ల ఆలస్యమవుతోంది. మరికొన్ని సార్లు సర్వర్ వేగం తగ్గడం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కాసింత నెమ్మదిగా సాగుతోంది.

ఖమ్మం జిల్లాలో ఐదు వందలు దాటిన రిజిస్ట్రేషన్లు

నవంబర్ 2న ధరణి పోర్టల్ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకాగా.. ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. జిల్లాలో మంగళవారం వరకు మొత్తం 547 దరఖాస్తులు స్లాట్లు బుకింగ్ కాగా.. వీటిలో 521 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. జిల్లాలోని మొత్తం 21 మండలాలు ఉండగా 20 మండలాల్లో ధరణి సేవలు అందుబాటులో ఉన్నాయి. కామేపల్లి మండలం పూర్తిగా ఏజెన్సీ పరిధిలో ఉండటంతో ఇంకా మండలంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి రాలేదు. మిగిలిన మండలాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఖమ్మం నియోజకవర్గంలోని ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల పరిధిలో మొత్తం 48 స్లాట్లు నమోదు చేసుకోగా.. వీటిలో 40 దరఖాస్తులకు రిజిస్ట్రేషన్ పూర్తయింది. వివిధ కారణాలతో 8 దరఖాస్తులు నిలిచిపోయాయి. 3 కోర్టు కేసుల్లో ఉన్నాయి. మరో ఇద్దరు దరఖాస్తు దారులు గైర్హాజరయ్యారు. ఇంకో దరఖాస్తుదారు పేరు తప్పుగా నమోదైనందున రిజిస్ట్రేషన్ కాలేదు. ఇంకో వ్యక్తి బయోమెట్రిక్, ఐరిష్ నమోదు కాకపోవడం వల్ల నిలిచిపోయింది.

ఆలస్యమవుతున్న రిజిస్ట్రేషన్లు

పాలేరు నియోజకవర్గంలో మొత్తం 139కి స్లాట్లు బుకింగ్ కాగా... 138 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. తిరుమలాయపాలెంలో దరఖాస్తు తప్పుగా నమోదవడంతో.. రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. వైరా నియోజకవర్గంలో 74 స్లాట్లకు 70 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. సత్తుపల్లి నియోజకవర్గంలో మొత్తం 126 స్లాట్లకు గానూ 124 రిజిస్ట్రేషన్లను అధికారులు పూర్తి చేశారు. మధిర నియోజకవర్గంలో 160 స్లాట్లు బుక్కయ్యాయి. 149 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం 30 నిమిషాల సమయం పడుతుందని తొలుత భావించినా కొన్ని సాంకేతిక సమస్యలు, ఇతర లోపాలతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. కొన్నిచోట్ల వేలిముద్రలు నమోదుకాక పోతుండటంతో ఐరిష్ ద్వారా నమోదు చేస్తున్నారు.

అడ్డంకిగా మారిన ఏజెన్సీ చట్టాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో "ధరణి" రిజిస్ట్రేషన్లకు 1/70 వంటి ఏజెన్సీ చట్టాలు అడ్డంకిగా మారుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 377 రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటివరకు కేవలం 8 గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఫలితంగా నవంబర్ 2న ధరణి సేవలు ప్రారంభమైప్పటికీ జిల్లాలో మంగళవారం వరకు మొత్తం 31 స్లాట్లు నమోదు కాగా..18 దరఖాస్తులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో పోలిస్తే భద్రాద్రి జిల్లా భిన్నంగా ఉంటుంది. జిల్లాలో ఉన్న మొత్తం 23 మండలాల్లో దాదాపు అన్నీ ఏజెన్సీ పరిధిలోనే ఉంటాయి. మొత్తం 23 మండలాలు ఉంటే ప్రస్తుతం కొత్తగూడెం అశ్వాపురం, అశ్వారావుపేట, దమ్మపేట, బూర్గంపాడు, పాల్వంచ, సుజాతనగర్, ఇల్లందు ప్రాంతాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.

ఏజెన్సీ చట్టాల ప్రకారం ఇక్కడి భూములను ఇతరులు కొనడానికి వీలులేదు. క్రయ విక్రయాలు కూడా గిరిజనుల మధ్యే జరగాలి. ఒకవేళ గిరిజనుల నుంచి గిరిజనేతరులు వ్యవసాయ భూములు కానీ, ఆస్తులు కానీ కొనుగోలు చేసినా వాటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక గుర్తింపు ఉండదు. వారి మధ్య జరిగే లావాదేవీలు, దస్తావేజు రాతలు పూర్తిగా వారి వ్యక్తిగతం. వీటిని ప్రైవేటు ఒప్పందాల కిందనే పరిగణిస్తారు. అధికారులు ప్రస్తుతం జిల్లాలోని 377 గ్రామాలుంటే 8 చోట్ల రిజిస్ట్రేషన్లు చేపడుతున్నారు. మిగిలిన 369 చోట్ల రిజిస్ట్రేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న అంశంపై కసరత్తులు చేస్తున్నారు. ఏజెన్సీలోని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై వ్యవసాయ నిపుణులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ గ్రామాల్లో ఫాం "కె", ఫాం "ఎల్" ఉన్నవారికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రొహిబిటెడ్ జాబితాకు చోటెక్కడ..?

భూ వివాదాలకు సంబంధించి న్యాయస్థానం ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన భూముల వివరాలు సర్వే సంఖ్యలతో సహా రిజిస్ట్రేషన్ కార్యాలయం రికార్డుల్లో "ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్" కాలంలో నమోదు చేస్తారు. సంబంధిత భూముల క్రయ విక్రయాల సమయంలో రిజిస్టార్ అభ్యంతరం చెప్పి రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపి వేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్​లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలో న్యాయస్థానం పరిధిలో ఉన్నవి.. న్యాయస్థానం తీర్పులు వెలువరించినవి లేకపోవడం గమనార్హం. ఈ భూములు రిజిస్ట్రేషన్లు అయితే సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలను వెంటనే అధికారులు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

జిల్లాలో వేగంగా ధరణి ప్రక్రియ

జిల్లాలో ధరణి సేవలు బాగా ఉన్నాయని ఖమ్మం కలెక్టర్ ​ఆర్.వి.కర్ణన్ అన్నారు. ఏ రోజు కారోజు దాదాపు అన్ని రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించామని చెప్పారు. ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, సాంకేతిక సమస్యలుతలెత్తినా పరిష్కరించుకుంటూ ముందుకుపోతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ధరణి సేవల్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఏజెన్సీ గ్రామాల్లో సమస్యకు త్వరలోనే పరిష్కరిస్తాం

ఏజెన్సీ గ్రామాల్లో సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​ ఎంవీ.రెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 377 గ్రామాలకు 8 చోట్ల రిజిస్ట్రేషన్ కొనసాగుతోందని చెప్పారు. మిగిలిన 369 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు ఎలా నిర్వహించాలన్న అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గిరిజన ప్రాంత రెవెన్యూ గ్రామాల్లో గిరిజనులు, గిరిజనేతరులకు మధ్య క్రయ విక్రయాలు నిర్వహించుకోవచ్చుని పేర్కొన్నారు. మిగిలిన సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు.

ఇదీ చదవండి: తెలంగాణలో కొత్తగా 1,196 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.