ETV Bharat / state

కరోనా సమయంలోనూ స్వయం ఉపాధిలో అతివలు భళా..

author img

By

Published : Jun 16, 2020, 1:51 PM IST

మహిళా సంఘ సభ్యులు ఆర్థికంగా రాణించడంలో స్త్రీనిధి రుణాలది ప్రముఖ పాత్ర.. స్వయం ఉపాధితో ఆర్థిక పరిస్థితి రోజురోజుకు మెరుగై పురుషులతో సమానంగా ఎదుగుతున్నారు. ఒక్కో స్వశక్తి సంఘంలో 10 నుంచి 15 మంది వరకు మహిళలు సంఘంగా ఏర్పాటు చేసుకొని పొదుపుపై దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో 2020-21 ఏడాదికి స్త్రీనిధి రుణాల లక్ష్యం రూ.152 కోట్లుగా నిర్ధారించారు.. ఈ నేపథ్యంలో కథనం..

Stree Nidhi proves treasure-trove to women-in karimnagar district
స్త్రీ నిధి.. మహిళల భవిష్యత్​కు పెన్నిది

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలోనూ జిల్లాలో మహిళా సంఘాలకు స్త్రీనిధి రుణాలు పంపిణీ సవ్యంగా కొనసాగింది.. అంతా ఆన్‌లైన్‌ వ్యవస్థ ఉండటంతో రుణం గురించి మహిళలు బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేదు. అవసరమైన మహిళలు సమ్మతి పత్రం మీద సంతకం చేస్తే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రుణం జమ అవుతోంది. పంపిణీలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తవు. కరీంనగర్ జిల్లాలో మే ఆఖరు వరకు రూ.5 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. సువిధ కింద ఒక్కో సభ్యురాలికి రూ.30 వేల చొప్పున అందజేశారు. ప్రగతి, అక్షయ రుణాలుగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇచ్చారు. ఏడాది చివరలో అధికారులు హడావుడి చేసే బదులు ఇప్పటి నుంచే రుణ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాల్సి ఉంది.

సజావుగా పంపిణీ జరిగేనా?

మహిళా సంఘ సభ్యులకు స్త్రీనిధి, బ్యాంకు రుణాల పంపిణీ విషయంలో జిల్లా పాలనాధికారి, డీఆర్డీవోలు క్షేత్రస్థాయి అధికారులు, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు. డీఆర్డీవో క్షేత్రస్థాయి సిబ్బందికి చరవాణి ద్వారా రోజువారీ లక్ష్యాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ సంఘ సభ్యులకు రుణాలను అందించడంలో అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేశారు. ఏడాది లక్ష్యాన్ని చేరుకోవడంలో క్షేత్రస్థాయిలో అధికారులు అంకితభావంతో కృషిచేస్తేనే మహిళా సంఘ సభ్యులకు రుణ పంపిణీ సజావుగా జరగనుంది.

లాక్‌డౌన్‌ సమయంలోనూ రుణం

లాక్‌డౌన్‌ సమయంలో మా కిరాణ దుకాణంలో సరకులు అయిపోయాయి. చేతిలో డబ్బులు లేని సమయంలో స్త్రీనిధి రుణం అందింది. ఆ డబ్బులు తీసుకొని కిరాణ సామగ్రి తీసుకొచ్చాం. వ్యాపారం సజావుగా నిర్వహించుకోవటానికి ఉపయోగపడ్డాయి.

-ఎం.సుజాత, ఇందిరా గ్రామ సంఘం అధ్యక్షురాలు, మొగ్దుంపూర్‌

స్త్రీ నిధి రుణం పంపిణీకి మరింత కృషి

ఈ ఏడాది రూ.152 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది.. ఏడాది చివరి నాటికి లక్ష్యాన్ని మించి రుణ పంపిణీ జరిగేలా కృషి చేస్తాం. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని పురమాయిస్తాం. మహిళలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూస్తాం.

ఎ.వెంకటేశ్వరరావు, డీఆర్డీవో, కరీంనగర్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.