ETV Bharat / state

కొవిడ్‌ టీకా స్లాట్‌ బుకింగ్‌లో ఇక్కట్లు

author img

By

Published : May 6, 2021, 12:05 PM IST

problems-in-booking-the-covid-vaccine-slot
కొవిడ్‌ టీకా స్లాట్‌ బుకింగ్‌లో ఇక్కట్లు

ప్రభుత్వం మే 1 నుంచి అన్ని వయసుల వారు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారానే టీకాలు వేసుకోవాల్సిందిగా ప్రకటించడంతో తిప్పలు పెరిగాయి. గతంలో నేరుగా వ్యాక్సిన్‌ కేంద్రాలకు వెళ్లి ఆధార్‌ కార్డు స్కాన్‌ చేసి టీకాలు వేసుకోగా ప్రస్తుత విధానంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి రెండో డోసు వారికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పినా అనంతరం స్లాట్‌ బుకింగ్‌లో అందరికీ అవకాశం ఇవ్వడంతో అటు తొలి డోసు వేసుకునే వారికి, ఇటు రెండో డోసు వారికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

* జగిత్యాలకు చెందిన ఓ మహిళ కోవిషీల్డు టీకా రెండో డోసు ఈ నెల 21న వేసుకోవాల్సి ఉంది. స్లాట్‌ బుకింగ్‌ కోసం కొవిన్‌ వెబ్‌సైట్‌లో వెతకగా ఈ నెల 21న జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో ఉదయం 11 గంటలకు స్లాట్‌ దొరికింది. కానీ అదే రోజు సాయంత్రం మీరు బుక్‌ చేసుకున్న షెడ్యూలు రద్దు చేయడమైనది, ఇబ్బంది కలిగినందుకు క్షమించాలని సందేశం పంపారు.

* మేడిపల్లికి చెందిన ఓ యువకుడు మే 6న కొవాగ్జిన్‌ రెండో డోసు వేసుకోవాల్సి ఉండగా వెబ్‌సైట్‌లో స్లాట్‌ కోసం వెతికితే ఈ నెల 31 వరకు స్లాట్‌ దొరకలేదు. మే 31న కోరుట్ల అల్లమయ్య గుట్ట పీహెచ్‌సీలో స్లాట్‌ బుక్‌ చేసుకున్నా తొలి డోసు పూర్తయిన అనంతరం 53 రోజులకు రెండో డోసు వేసుకోవాల్సి వస్తోందని బెంగ పెట్టుకున్నాడు.

కొవిన్‌ వెబ్‌సైట్‌లో కొవాగ్జిన్‌ తొలి డోసు వేసుకున్న 28 రోజుల నుంచి 42 రోజుల లోపు రెండో డోసు వేసుకోవాలని.. కోవిషీల్డు తొలి డోసు వేసుకున్న 28 రోజుల నుంచి 56 రోజుల లోపు రెండో డోసు వేసుకోవాలని సూచిస్తోంది. ఈ లెక్కన చాలా మంది తొలి డోసు వేసుకున్న అనంతరం నియమిత గడువులోపు రెండో డోసు కోసం స్లాట్‌ దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు.

కరోనా వైరస్‌ నియంత్రణకు టీకా ఉత్తమమని ప్రభుత్వాలు ఎంతమొత్తుకున్నా తొలి రోజుల్లో స్పందన కనిపించలేదు. జనవరి 16 నుంచి టీకాల కార్యక్రమం మొదలైంది. ఈ మేరకు జగిత్యాల జిల్లాలో తొలిరోజుల్లో సరాసరి 3,000 మంది వరకు టీకా వేసుకోగా ఏప్రిల్‌ చివరి నాటికి సరాసరి 30,000 మంది టీకా వేసుకున్నారు. కరీంనగర్‌ జిల్లాలో జనవరి 16 నుంచి సరాసరి 2,000 మంది టీకా వేసుకుంటూ ఏప్రిల్‌ తొలి వారం వరకు 12,000 అనంతరం సరాసరి 60,000 మంది టీకా వేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో టీకా ప్రారంభమైన నుంచి సరాసరి 2,000 వరకు వేసుకోగా ఏప్రిల్‌ రెండో వారం వరకు 16,000 వరకు చివరి వారం వరకు సరాసరి 33,000 చొప్పున వ్యాక్సిన్‌ వేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి రోజుల్లో 1,000 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ మూడో వారం వరకు ఆ సంఖ్య 46,000 వరకు చేరుకుంది.

ఇబ్బంది లేకుండా చూస్తాం

కొవాగ్జిన్‌ తొలి డోసు వేసుకున్న వారికి రెండో డోసుకు ఇబ్బంది లేకుండా చూస్తాం. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న టీకాలు సరిపోతాయనే భావిస్తున్నాం. సరిపోక పోతే ఇతర ఏర్పాట్లు చేస్తాం. వెబ్‌సైట్‌లో నమోదుకు ఇబ్బందులు అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. జగిత్యాలలో ఖిలాగడ్డ, కోరుట్ల అల్లమయ్య గుట్ట కేంద్రాల్లోనే గతంలో కొవాగ్జిన్‌ టీకాలు వేశాం. ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకునే వారికి కోవిషీల్డు టీకా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కోవిషీల్డు రెండో డోసు వేసుకునే వారు కూడా ఆన్‌లైన్‌లోనే షెడ్యూల్‌ నమోదు చేసుకోవాలి.

-శ్రీధర్‌, జిల్లా వైద్యాధికారి, జగిత్యాల

టీకాలు వేసుకున్న వారి సంఖ్య

గుర్తుంచుకోండి!

* పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మే 20 నుంచి కోవిషీల్డు టీకాలు అందుబాటులో ఉంటాయి.

* జగిత్యాల జిల్లాలో బుధవారం సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌ సమాచారం మేరకు మే 30న అయిలాపూర్‌లో 74, అంబారిపేట ఓల్డ్‌ పీహెచ్‌సీలో 75, మే 31న అంబారిపేట ఓల్డ్‌ పీహెచ్‌సీలో 119 కోవిషీల్డు టీకాలు అందుబాటులో ఉన్నాయి.

* కరీంనగర్‌ జిల్లాలో మే 20న 24 కేంద్రాల్లో, మే 21న 14 కేంద్రాలు, మే 23, 24 తేదీల్లో ఒక్కో కేంద్రంలో కోవిషీల్డు టీకాలు వేసే అవకాశముంది. ఆయా కేంద్రాల్లో సరాసరి 90 వరకు అందుబాటులో ఉన్నట్లు బుధవారం సాయంత్రం వరకు కొవిన్‌ వెబ్‌సైట్‌లో సమాచారం ఉంచారు.

* ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొవాగ్జిన్‌ టీకాలు మాత్రం అందుబాటులో లేవు.

ఇదీ చూడండి: మనసును కుంగదీస్తున్న కరోనా మహమ్మారి మరి ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.