ETV Bharat / state

Dalit Bandhu: ఇష్టానుసారంగా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక?

author img

By

Published : Feb 20, 2022, 7:28 AM IST

dalit bandhu
dalit bandhu

రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలుకు కసరత్తు జరుగుతోంది. హుజూరాబాద్​ మినహా 118 నియోజకవర్గాల్లో లబ్దిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ప్రభుత్వ అప్పగించింది. ఇష్టానుసారంగా ఎంపికలు జరుగుతున్నాయన్న ఆరోపణలూ వస్తున్నాయి.

రాష్ట్రంలో హుజూరాబాద్‌ మినహా 118 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలుకు లబ్ధిదారుల జాబితాలు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గానికి వంద మంది చొప్పున అర్హులను ఎంపిక చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఆ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించింది. క్షేత్రస్థాయిలో ఆశావహ ఎస్సీ కుటుంబాలు ఎమ్మెల్యేలకు దరఖాస్తులు సమర్పించాయి. ఎంపికకు స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో ప్రజాప్రతినిధులు తమ విచక్షణ మేరకు ఎంపిక చేస్తున్నారు. దీంతో ఇష్టానుసారంగా ఎంపికలు జరుగుతున్నాయన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల జాబితాలు ప్రభుత్వానికి అందగా, ఈ నెల 25 నాటికి మిగతావి చేరనున్నట్లు సమాచారం. మార్చి నెలాఖరు నాటికి ఆయా లబ్ధిదారులు యూనిట్లు స్థాపించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

దళితబంధు పథకం కింద ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల విలువైన స్వయం ఉపాధి యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలు, సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో 70 కుటుంబాలకు పథకం మంజూరైంది. హుజూరాబాద్‌లో 1250 కుటుంబాలు, వాసాలమర్రిలో 60 కుటుంబాల యూనిట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటితోపాటు చింతకాని (మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా), తిరుమలగిరి (తుంగతుర్తి, సూర్యాపేట), చారకొండ (అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌), నిజాంసాగర్‌ (జుక్కల్‌, కామారెడ్డి) మండలాల్లో పథకం అమలుకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది.

జాబితాలపై గోప్యత...

118 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయినప్పటికీ.. జాబితాలో లేని ఇతర ఆశావహ కుటుంబాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న కారణంతో ప్రస్తుతం గోప్యత పాటిస్తున్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల్లో తమ అనుచరులను, అనుకూలంగా ఉన్నవారిని ఎంపిక చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిచోట్ల నేతల అనుచరులు.. ఎంపిక చేసిన లబ్ధిదారులతో వాటాలు (రూ.2-4 లక్షలు) మాట్లాడుకుంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి.

పలుచోట్ల ఫిర్యాదులు..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు చేర్చారని కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నారాయణపేట, గద్వాలలో పేదలను కాకుండా ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్నవారిని మరోసారి ఎంపిక చేస్తున్నట్లు అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు. గద్వాల కలెక్టరేట్‌ ముందు పర్మాల గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.

146 మంది దళితబంధు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ..

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారుల్లో 146 మందికి రూ.15,30,84,413 విలువ చేసే 51 హార్వెస్టర్లు, నాలుగు జేసీబీలు, ఆరు డీసీఎం వ్యాన్లు, ఒక ట్రాక్టర్‌, ఒక వరినాటు యంత్రాన్ని శనివారం మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ అందజేశారు. లబ్ధిదారులకు ఇది మంచి అవకాశమని.. సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: Cm Kcr Mumbai Tour: నేడు ముంబయికి సీఎం కేసీఆర్​.. ఉద్ధవ్​ ఠాక్రేతో కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.