ETV Bharat / state

MLC elections 2021: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. పోలింగ్​ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

author img

By

Published : Dec 9, 2021, 5:37 PM IST

mlc elections
MLC elections 2021: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. పోలింగ్​ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

Local Body MLC Elections 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే బ్యాలెట్‌ బాక్సులు పోలింగ్‌ కేంద్రాలకు చేరాయి. సిబ్బందికి శిక్షణ, ఓటర్లకు అవగాహన, భద్రత సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.

Local Body MLC Elections 2021: స్థానిక సంస్థల కోటాలో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం జరిగే ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 37 పోలింగ్​ కేంద్రాల్లో 5,326 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరుగుతుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ ముగిశాక బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూంలకు తరలించి మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు.

ఏర్పాట్లు పూర్తి: సీఈవో

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్​ గోయల్​ వెల్లడించారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో వెబ్‌కాస్టింగ్‌, వీడియో ద్వారా పోలింగ్‌ ప్రక్రియను రికార్డ్‌ చేస్తామని తెలిపారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓటరు స్లిప్పులను ఇప్పటికే పంపిణీ చేయడం జరిగిందన్నారు.

క్యాంప్ రాజకీయాలపై ఫిర్యాదులు లేవు

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు శశాంక్‌ గోయల్‌ వివరించారు. ఓటర్లందరూ మాస్క్‌ ధరించి పోలింగ్‌ కేంద్రానికి రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. క్యాంపు రాజకీయాలపై ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లడించారు. క్యాంపు రాజకీయాలపై అధికారులు దర్యాప్తు చేశారని శశాంక్‌ గోయల్‌ చెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నాం.పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. క్యాంపు రాజకీయాల గురించి అధికారులు దర్యాప్తు చేశారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులెవరూ ఫిర్యాదు చేయలేదు. కొవిడ్‌ నిబంధలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. -శశాంక్​ గోయల్​, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం: సీఈవో

ఇప్పటికే 6స్థానాలు ఏకగ్రీవం

రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం కాగా.. మహబూబ్‌నగర్ జిల్లాలో కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలు గులాబీ ఖాతాలోనే చేరాయి. ఇక్కడ పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు ఏకగ్రీవమయ్యారు. వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

జిల్లాల వారీగా..

ఆదిలాబాద్‌: జిల్లాలో ఎన్నిక జరిగే ఒక స్థానానికి తెరాస నుంచి దండె విఠల్‌, స్వతంత్ర అభ్యర్థిగా పి.పుష్పరాణి పోటీ చేస్తున్నారు. మొత్తం 937 మంది ప్రజాప్రతినిధులకు 717 మంది తెరాసవారే.

కరీంనగర్‌: రెండు స్థానాల్లో తెరాస అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణతో పాటు పార్టీకి రాజీనామా చేసిన రవీందర్‌సింగ్‌, మరో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో 1,324 మంది ప్రజాప్రతినిధులకు తెరాసవారు 996 మంది.

ఖమ్మం: ఒక స్థానానికి తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు తాతా మధు, రాయల నాగేశ్వరరావులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. మొత్తం 768 మందికిగాను తెరాసకు 490 మంది, కాంగ్రెస్‌కి 116మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు.

మెదక్‌: ఒక స్థానంలో మెదక్‌ జిల్లాలో తెరాస అభ్యర్థి వంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి నిర్మల, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 1,026 మంది ప్రజాప్రతినిధుల్లో 777 మంది తెరాస వారు.. 230 మంది కాంగ్రెస్‌ వారు.

నల్గొండ: ఒక స్థానానికి ఇక్కడ తెరాస నుంచి ఎంసీ కోటిరెడ్డితో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 1,271 మంది ప్రజాప్రతినిధులకు.. తెరాస వారు 991 మంది ఉన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.