ETV Bharat / state

MLC Election 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. వరించేది వారినేనా?

author img

By

Published : Dec 9, 2021, 6:57 AM IST

MLC Election 2021, Local Bodies Quota MLC Polls 2021
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

Local Bodies Quota MLC Polls 2021: తెలంగాణలో శుక్రవారం జరగనున్న.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​కు రంగం సిద్ధమైంది. మొత్తం 5 ఉమ్మడి జిల్లాలకు చెందిన ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. దానిలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ బరిలో నిలిచింది. అయిదు జిల్లాల్లో మెజారిటీ సభ్యులున్న తెరాస ఆరు స్థానాలను గెలుస్తాననే నమ్మకంతో ఉంది. రేపు ఉదయం 8 నుంచి సాయంత్ర 4 గంటలవరకు పోలింగ్ జరగనుంది.

Local Bodies Quota MLC Polls 2021: స్థానిక సంస్థల కోటాలో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం జరిగే ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 37 పోలింగు కేంద్రాల్లో 5,326 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు జరుగుతుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు.

తెరాసకు మెజారిటీ

అయిదు జిల్లాల్లో మెజారిటీ సభ్యులున్న తెరాస ఆరు స్థానాలను గెలుస్తాననే నమ్మకంతో ఉంది. మొత్తం తొమ్మిది జిల్లాల్లో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావించి ఏకగ్రీవాలకు యత్నించగా నాలుగింట వ్యూహం ఫలించింది. అయిదు జిల్లాల్లో అది సాధ్యం కాలేదు. దీంతో ఆయా జిల్లాల్లో భారీ ఆధిక్యంతో గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది. కాంగ్రెస్‌ ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో పోటీ చేస్తుండగా... కరీంనగర్‌లో తెరాసకు రాజీనామా చేసిన మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ పోటీలో ఉండడం ఆసక్తికరంగా మారింది. తెరాస ముందస్తు వ్యూహంతో తమ తమ ప్రజాప్రతినిధులను శిబిరాలకు తరలించింది. వారు బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. గురువారం తమ జిల్లాలకు వెళ్లి పోలింగులో పాల్గొంటారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ బుధవారం నగరంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కలిసి పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచేందుకు కృషి చేయాలని సూచించారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ శిబిరాన్ని నిర్వహించింది. మెదక్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమ పార్టీ అభ్యర్థినికి మద్దతు సమీకరించేందుకు యత్నించారు. కరీంనగర్‌లో రవీందర్‌సింగ్‌ తనకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు.

ఇవీ బలాబలాలు..

  • ఆదిలాబాద్‌: జిల్లాలో ఎన్నిక జరిగే ఒక స్థానానికి తెరాస నుంచి దండె విఠల్‌, స్వతంత్ర అభ్యర్థిగా పి.పుష్పరాణి పోటీ చేస్తున్నారు. మొత్తం 937 మంది ప్రజాప్రతినిధులకు 717 మంది తెరాసవారే.
  • కరీంనగర్‌: రెండు స్థానాల్లో తెరాస అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణతో పాటు పార్టీకి రాజీనామా చేసిన రవీందర్‌సింగ్‌, మరో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో 1,324 మంది ప్రజాప్రతినిధులకు తెరాసవారు 996 మంది.
  • ఖమ్మం: ఒక స్థానానికి తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు తాతా మధు, రాయల నాగేశ్వరరావులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. మొత్తం 768 మందికిగాను తెరాసకు 490 మంది, కాంగ్రెస్‌కి 116మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు.
  • మెదక్‌: ఒక స్థానంలో మెదక్‌ జిల్లాలో తెరాస అభ్యర్థి వంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి నిర్మల, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 1,026 మంది ప్రజాప్రతినిధుల్లో 777 మంది తెరాస వారు.. 230 మంది కాంగ్రెస్‌ వారు.
  • నల్గొండ: ఒక స్థానానికి ఇక్కడ తెరాస నుంచి ఎంసీ కోటిరెడ్డితో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 1,271 మంది ప్రజాప్రతినిధులకు.. తెరాస వారు 991 మంది ఉన్నారు.

ఇదీ చూడండి: Mlc Election Voting: ఏమరుపాటు ప్రదర్శిస్తే ఓటు చెల్లకుండా పోయే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.