Dalitha Bandhu: హుజూరాబాద్‌లో ప్రారంభమైన దళిత బంధు సర్వే

author img

By

Published : Aug 28, 2021, 3:30 AM IST

Dalitha Bandhu

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు లబ్ధిదారుల గణన యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించి... సర్వే, పథక అమలు తీరుతెన్నులపై దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాల మేరకు లోతుగా అధ్యయనం చేస్తూ హుజూరాబాద్‌లో 450 మంది సిబ్బంది ఇంటింటా వివరాలు సేకరిస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత కుటుంబాల గణన ఉత్సాహంగా ప్రారంభమైంది. 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నియోజకవర్గంలో 21వేల దళిత జనాభా ఉంది. గత ఆరేళ్లలో పెరిగిన జనాభాతో పాటు వివాహమై వేరుపడిన కుటుంబాల వివరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వివరాలను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ నమోదు చేస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 5 మండలాలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. హుజూరాబాద్‌, జమ్మికుంట మండలాలను అర్బన్‌ రూరల్‌గా విభజించి ప్రత్యేక అధికారులను నియమించారు. ఒక్కో మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్‌ చొప్పున మొత్తం ఏడుగురు పనిచేస్తున్నారు. 30మంది క్లస్టర్ అధికారులు 130మంది ప్రత్యేక అధికారులు,మరో 130 అదనపు ప్రత్యేక అధికారులతో పాటు సహాయ సిబ్బంది సర్వేలో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 3లోగా గణన ప్రక్రియ పూర్తి చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు.

ఒకరోజు ముందుగానే గ్రామాల్లో చాటింపు

దళిత బంధు సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఒకరోజు ముందుగానే గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఒక్కో ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి పది లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్న దృష్ట్యా.... ఆ డబ్బుతో ఎలాంటి వ్యాపారం చేయబోతున్నారే విషయంపై.....5 ఆప్షన్లు ఇచ్చి ప్రాధాన్యత క్రమం తీసుకున్నారు. కుటుంబాల ఆసక్తిని తెలుసుకుంటున్నారు. బ్యాంకు సిబ్బంది లబ్ధిదారుల పేరిట బ్యాంకు ఖాతా ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేయబోతున్న పథకం పట్ల ఆయా కుటుంబాలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

దళిత బంధు అమలును ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.... హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్ అమలు తీరుతెన్నులపై అధికారులతో చర్చించారు. ప్రతి కుటుంబ స్థితిగతులను తెలుసుకునేలా దళిత కుటుంబ గణన చేయాలన్నారు. ఆన్‌లైన్‌లో లబ్ధిదారు కుటుంబం చేపట్టిన పని పురోగతిని నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగు సలహాలు, సూచనలు అందిస్తుండాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే దశలవారీగా.... ప్రభుత్వం 2వేల కోట్ల రూపాయలు కలెక్టర్‌ ఖాతాలో జమ చేసింది.

ఇదీ చదవండి: CM KCR REVIEW: 'గట్టిగా పట్టుబడతా.. చివరి రక్తపుబొట్టు దాకా పోరాడుతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.