రూపురేఖలు లేకుండాపోయిన రహదారులు.. ఇబ్బందులు పడుతున్న జనాలు

author img

By

Published : Jul 21, 2022, 3:43 PM IST

roads damaged in joint nizamabad district due to heavy rains

భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో రోడ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు వెళ్లే దారులతోపాటు.. మండల కేంద్రాలకు వెళ్లే రహదారులూ దెబ్బతిన్నాయి. వర్షాలకు ఉన్న రోడ్లు దెబ్బతింటే.. అప్పటికే ధ్వంసమైన రహదారులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. గుంతల్లో ప్రయాణించి ఆరోగ్యపరంగా నష్టపోతున్నామని.. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

రూపురేఖలు లేకుండాపోయిన రహదారులు.. ఇబ్బందులు పడుతున్న జనాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలతో రహదారుల రూపురేఖలు లేకుండా పోయాయి. కాలూర్, ఖానాపూర్, బోర్గాం(కె), మాక్లూర్, ఆర్మూర్​కు వెళ్లే రహదారులు గుంతలతో నిండిపోయాయి. నవీపేట్, బోధన్ వంటి ప్రధాన రోడ్లతో పాటు గ్రామాలకు వెళ్లేదారులూ పూర్తిగా ధ్వంసమయ్యాయి. నవీపేట, రెంజల్, బోధన్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లో గ్రామాలకు వెళ్లే రోడ్లు విపరీతమైన గుంతలతో నిండిపోయాయి.

నిజామాబాద్ జిల్లాలో ఆర్ అండ్ బీ రోడ్లు 6.. పంచాయతీరాజ్ రోడ్లు 14 చోట్ల కోతకు గురయ్యాయి. కామారెడ్డి జిల్లాలో వర్షాలతో పంచాయతీరాజ్ రోడ్లు 52.85 కిలోమీటర్లు, ఆర్ అండ్ బీ రోడ్లు 14 కిలోమీటర్లు ధ్వంసమయ్యాయి. గుంతలు తేలిన దారుల్లో.. ప్రయాణం అంటేనే వాహనదారుల్లో వణుకు వస్తోంది. అనేక మంది గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. రాత్రి వేళ గుంతలు పడిన మార్గాల్లో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆసుపత్రి కోసం వెళ్లే రోగులు, గర్భిణీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తమ పరిస్థితి అధ్వానంగా ఉందంటున్న ఆటోడ్రైవర్లు.. వచ్చిన ఆదాయం రిపేర్లకే సరిపోతోందని ఆవేదన చెందుతున్నారు.

ఏళ్లుగా గుంతలు తేలి నరకం చూపిస్తున్న రోడ్లు.. వర్షాలకు మరింత భయంకరంగా మారాయని వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోగ్యం, ప్రాణ, ఆర్థిక నష్టాల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి..

రాష్ట్రంలో వరద నష్టాలపై కేంద్ర బృందం అధ్యయనం

Bullet in monkey shoulder : కుక్క కరిచిందని కోతికి వైద్యం.. భుజంలో బుల్లెట్ చూసి డాక్టర్లు షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.