ETV Bharat / state

కోటి యాభై లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నాం: పోచారం

author img

By

Published : Jul 5, 2021, 4:31 PM IST

రాష్ట్రంలో కోటి యాభై లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం నీటిని నిజాంసాగర్ ద్వారా విడుదల చేయడం ఇదే తొలిసారి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా హాసన్​పల్లిలో నిజాంసాగర్ నుంచి సాగు నీటిని విడుదల చేశారు.

pocharam Srinivas reddy, vemula prashanth
పోచారం శ్రీనివాస్ రెడ్డి, వేముల ప్రశాంత్

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి యాభై లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని... ఫలితంగా 65 లక్షల రైతులకు లాభం చేకూరుతుందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి సారి నిజాంసాగర్ ద్వారా కాళేశ్వరం నీటిని విడుదల చేస్తున్నామని... ఇది శుభ సందర్భమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. కామారెడ్డి జిల్లా హాసన్​పల్లిలో నిజాంసాగర్ నుంచి... సభాపతి, వేముల ప్రశాంత్ రెడ్డి నీటిని విడుదల చేశారు.

జులై మొదటి వారంలో నీటిని విడుదల చేయడం నా అనుభవంలో ఇది తొలిసారి. గతంలో ఎగువ ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల నిజాంసాగర్ ప్రాజెక్టులో చుక్క నీరు లేకుండా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నీటిని... కాళేశ్వరం ద్వారా కొండపోచమ్మ సాగర్​కు మళ్లించారు. అక్కడినుంచి హల్దీ వాగు ద్వారా మంజీరా నదికి మళ్లించి... నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పంపించారు. నీటిని విడుదల చేయడానికి ఇది సరైన సమయం. వర్షాకాలం పంటకు నీరు తక్కువపడితే కాళేశ్వరం, సింగూరు నుంచి మళ్లిస్తాం. రైతులు రెండు పంటలూ నిర్భయంగా సాగు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి యాభై లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాం.

-పోచారం శ్రీనివాస్ రెడ్డి, సభాపతి

నీటిని విడుదల చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

అనంతరం పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. ఆ తర్వాత నిజాంసాగర్ జలాశయం పరిధిలోని విశ్రాంత భవనాన్ని పరిశీలించారు. హాసన్​పల్లికి సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం కోసం రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

pocharam Srinivas reddy, vemula prashanth
మొక్కలు నాటుతున్న పోచారం, వేముల

కాళేశ్వరం నీరు నిజాం సాగర్​లో కలవడం వల్లే జులై మొదటి వారంలో నీటిని విడుదల చేయడం సాధ్యమైంది. అవసరమైతే ఇంకా నీరు తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం నీటిని నిజాంసాగర్​ ద్వారా విడుదల చేయడం తొలిసారి. ఇది చాలా మంచి విషయం. గోదావరి, మంజీరా కలిసిన నీటిని రైతులకు తొలిసారి అందిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది.

-వేముల ప్రశాంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి

ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హనుమంతు, జడ్పీ ఛైర్ పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ శరత్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Krishna Board: కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.