ETV Bharat / state

Gadwal Handloom Park Problems : రెండు సార్లు శంకుస్థాపనలు.. అడుగు పడని చేనేత పార్కు.. హామీగానే మిగిలిపోయిందిగా..?

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2023, 1:44 PM IST

Gadwal Handloom Park Problems : జోగులాంబ గద్వాల జిల్లాలో చేనేత పార్క్‌ దశాబ్దాలుగా ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, 2018లో మరోసారి నాటి జౌళిశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేసి వదిలేశారే తప్ప.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత వస్ర్తాలు నేసే గద్వాలకు హ్యాండ్లూమ్‌ పార్కు వస్తే కార్మికులకు ఉపాధి, మార్కెటింగ్‌, ఆధునిక పరిజ్ఞానం అందుతాయని అంతా ఆశించారు. కానీ, ఐదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తెరపైకి రానున్న గద్వాల చేనేత పార్కు పనుల పురోగతిపై ఈటీవీ ప్రత్యేక కధనం..

telangana Assembly elections 2023
Gadwal Handloom Park Problems

Gadwal Handloom Park Problems రెండు సార్లు శంకుస్థాపనలు.. అడుగు పడని చేనేత పార్కు.. హామీగానే మిగిలిపోయిందిగా..?

Gadwal Handloom Park Problems : చేనేత వృత్తిదారులను ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జోగులాంబ గద్వాల జిల్లా పూడూరు సమీపంలో సమగ్ర చేనేత పార్కు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. పార్కు కోసం 47ఎకరాల స్థలాన్నికేటాయించగా 2018లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తొలుత 10ఎకరాల్లో 14కోట్ల 98లక్షల అంచనా వ్యయంతో పార్కును అభివృద్ధి చేయాలని భావించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 4కోట్లు, రాష్ట్ర వాటా 6కోట్లు, గద్వాలలోని చేనేత వస్త్రాల ఉత్పత్తి దారులు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌గా ఏర్పడి మిగిలిన 4కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. తమ వాటా ఇచ్చేందుకు మాస్టర్‌ వీవర్స్‌ సిద్ధమైనా 10 ఎకరాల స్థలాన్ని ఎస్పీవీకి రాసివ్వాలని మెలిక పెట్టారు.

Handloom Park at Gadwal : ప్రభుత్వం లీజుకిచ్చేందుకు మొగ్గు చూపింది. అయితే, పార్కు నిర్వహణ, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం లీజుపై బ్యాంకులు రుణాలివ్వవన్నది వ్యాపారుల వాదన. అందుకు సర్కారు అంగీకరించకపోవటంతో పార్క్‌ ఏర్పాటు అర్ధాంతరంగా ఆగిపోయింది.మరో మార్గంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో సీఎఫ్​సి నిర్మించి నామమాత్రపు అద్దెతో లీజుకు ఇచ్చేందుకు సర్కారు మొగ్గు చూపుతోంది. లేదా కామన్ ఫెసిలిటీ సెంటర్​ను నిర్మించి బహిరంగ వేలం ద్వారా పార్కు నిర్వాహణను అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు 52 కోట్లతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు గద్వాల చేనేత జౌళిశాఖ అదనపు సంచాలకులు గోవిందయ్య వెల్లడించారు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పార్క్ ఏర్పాటు పనులు ముందుకు సాగుతాయని చెప్పారు.

Konda Laxman Bapuji Award 2023 : కొత్తరకం డిజైన్లతో చీరలను నేశారు.. కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డును కొట్టేశారు

చేనేత పార్కుతో పాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ కళాశాలలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ సైతం వినిపిస్తోంది. తద్వారా అత్యాధునిక మగ్గాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం గద్వాల కార్మికులకు అందుబాటులోకి రానున్నాయి. ఒక డిజైన్‌ ఎక్కువ చీరలు నేసే జాకట్లు, ఇంటర్‌లాక్‌ సిస్టంతో ఇద్దరు కార్మికులు అవసరం లేకుండా ఆధునిక యంత్రాలు, డిజైన్ల మార్పులలో కొత్త ఒరవడిని తీసుకురావాలని మాస్టర్‌ వీవర్స్‌ కోరుతున్నారు. వాటన్నింటిపై ఎప్పటికప్పుడు పరిశోధనలు జరగాలన్నా, యువత చేనేత వృత్తిలోకి రావాలన్నా చేనేత కళాశాలను ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో 3వేలకు పైగా జియోట్యాగింగ్ మగ్గాలున్నాయి. పార్కు ప్రారంభమైతే వీరందరికీ ఉపాధి లభించే అవకాశం ఉంది. ఆధునిక మగ్గాలు, డిజైన్లలో మార్పులు, మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పడి గద్వాల చేనేతకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఈ అంశం ప్రచారాస్త్రంగా ముందుకు రానుంది.

చేనేత కార్మికుల వెతలు.. మారని బతుకులు

Gadwal Handloom Park : గద్వాల చేనేత పార్కు.. నేతన్నల కల నెరవేరేదెన్నడు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.