ETV Bharat / state

కన్నీటి వ్యథ:  గద్వాల చేనేత రంగాన్ని కుదిపేసిన కొవిడ్

author img

By

Published : Aug 23, 2020, 11:37 PM IST

అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుని.. పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్న ఆ రంగాన్ని కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది. సీజన్ ప్రారంభమయ్యే సమయంలో మొదలైన లాక్‌డౌన్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షల్లో నమోదవున్న కరోనా కేసులు... గద్వాల చేనేత రంగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపాయి. మెట్రోపాలిటన్ నగరాలు కరోనా కోరల్లో చిక్కుకోవడంతో దుకాణాలు మూతపడ్డాయి, తెరిచినా.. ఖరీదైన గద్వాల చీరల్ని కొనేవాళ్లు కరవయ్యారు. పెళ్లిళ్లు, పండుగలు, పర్వదినాలకు భారీగా అమ్ముడయ్యే గద్వాల చీరలు.. ప్రస్తుతం నేతన్నల వద్దే అల్మారాల్లో మూలుగుతున్నాయి. చీరలు నేసే నేతన్నలు, డిజైనర్లు, అనుబంధ కార్మికుల ఆదాయం పడిపోయి.. పూట గడవని పరిస్థితి ఎదురవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు లాక్‌డౌన్‌లో ఆదుకున్నా.. ప్రస్తుత తరుణం, భవిష్యత్తు రెండూ అగమ్యగోచరంగా మారాయి.

corona-that-shrunk-the-handloom-sector-of-gadwal-sarees-in-telangana
గద్వాల చేనేత రంగాన్ని కుదిపేసిన కరోనా

గద్వాల చేనేత రంగాన్ని కుదిపేసిన కరోనా

ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన చేనేత వస్త్రాలు గద్వాల చీరలు. తెలంగాణ రాష్ట్రానికే ఇవి ప్రత్యేకమైనవి. నేసే విధానం, డిజైన్లు, నాణ్యతతో 2008 సెప్టెంబర్ 22న గద్వాల చీరలు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గుర్తింపు దక్కించుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అయిజ, ఎక్లాస్ పూర్, గొర్లఖాన్ దొడ్డి, గట్టు, మాచెర్ల, ఆరగిద్ద, రాజోలి, అలంపూర్, వనపర్తి సహ పలు ప్రాంతాల్లో 25 వేల మంది చేనేత కార్మికులు గద్వాల చీరలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడి నేతవిధానం ఎంతో ప్రత్యేకమైనది. గద్వాల పట్టు చీరలు, కాటన్, సీకో, తుస్సార్, కోటకొమ్మ బార్డర్ చీరలు, జరీ డిజైన్లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.

ఉట్టిపడే డిజైన్లతో

భారతీయ సంస్కృతి-సంప్రదాయాలు ఉట్టిపడే డిజైన్లతో ఆకట్టుకుంటాయి గద్వాల చీరలు. పండుగలు, పర్వదినాలు, పెళ్లిళ్ల సీజన్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. డిజైన్, రంగులను బట్టి 10 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ధర పలుకుతుంటాయి. ఏడాది, రెండేళ్ల నుంచి విదేశాలతోపాటు.. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నె, హైదరాబాద్, విజయవాడ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఏళ్లుగా గద్వాల చేనేత రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు కాస్త ఉపాధి లభిస్తోంది. అంతలోనే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా గద్వాల చేనేత రంగాన్ని కుదిపేసింది. కోలుకోలేని దెబ్బ తీసింది.

కరోనా దెబ్బ

గద్వాల పట్టుచీరలు ఖరీదైనవి. దేశ-విదేశాల్లోనే వీటికి గిరాకీ ఎక్కువ. శుభకార్యాలకు ఈ చీరల్ని జనం ఎక్కువగా కొంటుంటారు. మార్చి, ఏప్రిల్ నుంచి వీటి అమ్మకాల సీజన్ ప్రారంభమవుతుంది. పెళ్లిళ్లు, సెలవులు, పండగలను బట్టి దీపావళి ముగిసే వరకూ సీజన్ కొనసాగుతుంది. మార్చి, ఏప్రిల్, మే లాక్​డౌన్‌తో కరోనా దెబ్బ పడింది. వీటి ఉత్పత్తి ఆగిపోయింది. కర్ణాటక, మహారాష్టల నుంచి రావాల్సిన ముడిసరకు రాలేదు. అక్కడి పరిశ్రమలు దాదాపుగా మూతపడ్డాయి. ఇక నగరాల్లో కరోనా కేసులు పెరగడంతో చీరలు అమ్మే పెద్దపెద్ద షోం రూంలే తెరచుకోలేని పరిస్థితి. దీంతో ఏడాదితో పోల్చితే అమ్మకాలు దాదాపు 70 శాతం వరకూ పడిపోయాయి.

అమ్ముడుపోని పరిస్థితి

మార్చి నుంచి ప్రారంభమయ్యే సీజన్ కోసం మాస్టర్ వ్యూవర్లు... కార్మికులతో చీరల్ని సిద్ధం చేయించారు. ప్రస్తుతం ఆ నిల్వలే అమ్ముడుపోని పరిస్థితి. పైగా పంపిన స్టాక్ సైతం అమ్మకాలు లేని కారణంగా... తిప్పి పంపుతున్నారు. గతంలో ఒక్కో కార్మికుడు నెలలో నాలుగు నుంచి ఐదు చీరలు నేసే వాళ్లు. ఇప్పుడు ఒకటి రెండు నేయడమే గగనంగా మారింది. దీంతో చేనేత కార్మికుల ఆదాయం సగానికి సగం పడి పోయింది. 20 వేలు సంపాదించే కార్మికులకు 10 వేల జీతం కూడా రావడం లేదు.

సగానికి సగం ఆదాయం

ఒక చీర రూపుదిద్దుకోవాటనికి.. దారానికి రంగులు అద్దే వాళ్లు, ఆ దారాన్ని కండెలు చుట్టి డిజైన్ ఆధారంగా వార్పు, వెఫ్ట్‌ తయారు చేసే వాళ్లు, చీరలకు డిజైన్ చేసే వాళ్లు, నేత కార్మికులు వీళ్లంతా పనిచేయాల్సి ఉంటుంది. ముడిసరకు రాక రంగులు అద్దే వారికి పని లేకుండా పోయింది. చీరలు నేయించే వాళ్లు లేక నేత కార్మికుడు, అనుబంధ కార్మికులకు ఉపాధి కరవైంది. డిజైన్లు చేసే వాళ్లు కూడా.. పనిలేక ఇబ్బంది పడుతున్నారు. ఆదాయం సగానికి సగం పడిపోయింది.

గద్వాల చేనేత రంగాన్ని

ఊహించని లాక్‌డౌన్, కరోనా గద్వాల చేనేత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చేనేత కార్మికుల్ని కొద్దిమేర ఆదుకున్నాయి. ముఖ్యంగా త్రిఫ్ట్ ఫండ్ పథకం.. నేత కార్మికులకు లాక్‌డౌన్ సమయంలో కాస్త తిండి పెట్టింది. చేనేత కార్మికుడు నెలవారిగా సంపాదించే ఆదాయంలో 8 శాతాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తే.. సర్కారు 16 శాతం జమ చేస్తుంది. ఇలా మూడేళ్ల తర్వాత దాచుకున్న డబ్బుల్ని తిరిగి తీసుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 36 నెలల గడువు ముగియకపోయినా.. అంతకన్నా ముందే ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. అలా జోగులాంబ గద్వాల జిల్లాలో 3,706 ఖాతాల్లో ప్రభుత్వం 12 కోట్ల 44 లక్షల రూపాయలు జమ చేసింది.


అవగాహన లేకపోవడం

ఇక చేనేత మిత్ర కింద జోగులాంబ గద్వాల జిల్లాలో 20 వేల 400 మంది కార్మికులకు 3 కోట్ల 43 లక్షలు విడుదల చేసింది. నేత కోసం కొనుగోలు చేసిన దారంపై 40 శాతం రాయితీ ఇవ్వడం చేనేత మిత్ర పథకం ఉద్దేశం. ముడిసరకు కొనుగోలుపై 5 శాతం మాస్టర్ వీవర్​కు, 35 శాతం నేత కార్మికుడు, అనుబంధ కార్మికులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. కానీ ఈ పథకం లబ్ధి ఎక్కవ మందికి అందడం లేదు. ముడిసరుకు కొనగోళ్లు నేషనల్ హ్యాండ్ లూమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ గుర్తించిన సంస్థల వద్దే కొనుగోలు చేయాలి. జీఎస్టీ బిల్లులు సమర్పించాలి. ఆన్​లైన్ దరఖాస్తు చేసుకోవాలి. కానీ వీటిపై నేత కార్మికులకు అవగాహన లేకపోవడం వల్ల ఆదరణకు నోచుకోవడం లేదు.

అమ్మే పరిస్థితి లేదు

అలాగే, జోగులాంబ గద్వాల జిల్లాలో 24 చేనేత సహకార సంఘాలున్నాయి. ప్రస్తుతం.. నాలుగైదు సంఘాలు తప్ప మిగిలివి దాదాపుగా మనుగడలో లేవు. దీంతో సొసైటీలు చేనేత కార్మికులకు పని కల్పించే పరిస్థితి లేదు. సొంతంగా చేనేత కార్మికులూ చీరలు నేసే అమ్మే పరిస్థితి లేదు. అర్హులైన చేనేత కార్మికులందరికీ ముద్ర పథకం ద్వారా రుణాలివ్వాలని బ్యాంకులు కోరినా.. 401 మంది కార్మికులకు గాను 17 మందికి మాత్రమే 50 వేల రుణాలు అందాయి. కనీసం ఆత్మ నిర్భర్ భారత్ పథకం కిందైనా బ్యాంకులు చేనేత కార్మికులకు రుణాలిచ్చి కార్మికులకు కరోనా కాలంలో ఆదుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.


గద్వాల చీరల ఆన్ లైన్ అమ్మకాల కోసం అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ లాంటి సంస్థలతో ఒప్పందాలు జరిగినా.. అంతగా ఆదరణ పొందలేదు. ఇక గద్వాలలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, మాస్టర్ వీవర్ల ఉమ్మడి పెట్టుబడితో ప్రారంభం కావాల్సిన చేనేత పార్కు శంకుస్థాపనకే పరిమితమైంది. కరోనా కారణంగా గద్వాలలో ఓ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేయాలని భావించిన పట్టు దారం పరిశ్రమ సైతం ప్రారంభానికి నోచుకోలేదు.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గద్వాల చేనేత రంగాన్ని ఆదుకోవాలంటే.. ప్రస్తుతం మాస్టర్ వీవర్లు, సొసైటీల్లో మూలుగుతున్న నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. అది సాధ్యం కాకపోతే కనీసం అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వ అవసరాల కోసం సర్కారే ఆర్డర్లిచ్చినా కార్మికులకు పని దొరుకుతుంది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.


ఇదీ చూడండి : ఆ ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదు : రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.