ETV Bharat / state

యాసంగికి కాళేశ్వరం జలాలు

author img

By

Published : Jan 29, 2021, 10:03 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంప్​హౌస్​ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు రెండు రోజుల ముందు నుంచి నీటిని తరలిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇదే తొలిసారిగా గోదావరి జలాలను లక్ష్మీ పంప్​హౌస్​ నుంచి సరస్వతి బ్యారేజ్​కు తరలిస్తున్నారు. యాసంగి పంటల కోసం ఎగువ ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు తరలిస్తున్నారు. ఎత్తిపోతలు కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

యాసంగికి కాళేశ్వరం జలాలు
యాసంగికి కాళేశ్వరం జలాలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మొదటిది.. ప్రధానమైన లక్ష్మీ పంప్​హౌస్​ నుంచి ఈనెల 17న నీటి తరలింపులు ఆరంభమైన మరుసటి రోజు పంపులను నిలిపివేశాలు. తిరిగి 19న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పగలంతా పంపులను నిలిపివేసిన ఆరోజు సాయంత్రం నుంచి వరుసగా పంపులను నడిపిస్తున్నారు. గడిచిన 11 రోజుల నుంచి బుధవారం రాత్రి వరకు 7.5 టీఎంసీల నీటిని అన్నారం బ్యారేజ్​కి గ్రావిటీ కాలువ ద్వారా తరలించినట్లు ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు.

దశలవారీగా తరలింపు

యాసంగి పంటల కోసమే కాళేశ్వరం జలాలను అందించేందుకే పంపులను రన్​ చేస్తున్నట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ముందుగా 10.5 టీఎంసీల లక్ష్యంగా ఎత్తిపోయాలని తలచారు. తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని యాసంగి కోసం నిరంతరం ఎగువకు తరలించారని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. యాసంగి పంటలకు కాళేశ్వరం జలాలను ఇవ్వాలని సీఎం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. తిరిగి సీఎం ఆదేశాలు వచ్చేంత వరకు ఎత్తిపోతలు కొనసాగనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటివరకు దశలవారీగా లక్ష్మీ పంప్​హౌస్​ నుంచి 77.90 టీఎంసీల నీటిని సరస్వతి బ్యారేజ్​కు తరిలించారు.

కళకళలాడుతోన్న గోదారి

2019 జూన్​ 21 నుంచి 2020 మే 14 వరకు 62 టీఎంసీలు, ఆ తర్వాత గతేడాది ఆగస్టు నెలలో 8.40 టీఎంసీలను ఎత్తిపోశారు. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టు తొలి నిర్మాణమైన మేడిగడ్డ బ్యారేజి నుంచి గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ వరకు ఎత్తిపోతలు జరిగాయి. తర్వాత ఈనెల 17 నుంచి తిరిగి పంపులను రన్ చేస్తున్నారు. ఈ ఏడాది యాసంగి పంటలకు కాళేశ్వరం నీటిని అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రాణహిత నది నుంచి నీటి ప్రవాహం తగ్గినా ప్రస్తుతానికి కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి కళకళలాడుతోంది. కాళేశ్వరం జలాలతో యాసంగి పంటలకు సాగునీటి ఇబ్బందులు తీరనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.