ETV Bharat / state

Fire Gun : ఆ గన్​ చూస్తే చాలు.. ఏ జంతువైనా భయంతో పరిగెట్టాల్సిందే!

author img

By

Published : Feb 1, 2022, 1:30 PM IST

ఫైర్​గన్
ఫైర్​గన్

Fire Gun : అడవుల్లోకి వెళ్లాలంటే ఎవరికైనా భయమే. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. ఏ వైపు నుంచి ఏ జంతువు వచ్చి ప్రాణం తీస్తుందోనని గజగజ వణకాల్సిందే. అలాగని.. జంతువులపై మనం తిరిగి దాడి చేసి వాటి ప్రాణాలను తీయలేం. కర్రా విరగదు.. పామూ చావదు అన్నట్లు మన ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా.. అలా అని జంతువుల ప్రాణాలు తీయకుండా.. వాటిని కాస్త భయపెట్టి మన ప్రాణాలతో బయటపడే మార్గాన్ని కనిపెట్టాడు జగిత్యాల జిల్లా మెట్​పల్లికి చెందిన ఓ వ్యక్తి. ఇంతకీ ఆ ఉపాయం ఏంటి..? మీరు అడవులకు అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలో ఈ కథనం చదివితే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఓ సారి లుక్కేయండి మరి..

Fire Gun: ఏదో పని మీద మీరు అడవిలోకి వెళ్లారనుకోండి.. లేదా మీరు చేసే పని అటవీ ప్రాంత సమీపంలోనే ఉందనుకోండి. ప్రతిరోజు కృూరమృగాలతో సావాసం. ప్రాణాలమీద భయంతో అనుక్షణం గజగజ వణకాల్సిందే. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని భయపడాల్సిందే. సడెన్​గా మీకు ఓ జంతువు ఎదురుపడితే.. దాణ్నుంచి ఎలా తప్పించుకుంటారు. సాధారణ జంతువైతే కాస్త ఫైట్ చేయొచ్చేమో గానీ.. కృూర జంతువు అయితే మాత్రం మీ సంగతి అంతే. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు జంతువుల నుంచి మన ప్రాణాలు కాపాడుకోవడానికి జగిత్యాల జిల్లా మెట్​పల్లికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి ఓ ఫైర్​గన్​ను తయారు చేశాడు.

Fire Gun
ఫైర్​గన్

ఫైర్​గన్..

Fire Gun to Threaten Animals: జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలోని బీడీ కాలనీకి చెందిన ప్రయోగాల ప్రభాకర్ చదివింది పదో తరగతే అయినా.. తన మెదడుకు పదును పెడుతూ కొత్తకొత్త ఆవిష్కరణలు చేస్తుంటారు. గత 30 ఏళ్ల నుంచి వివిధ రకాల ఆవిష్కరణలు చేసి స్థానికుల ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల నుంచి రక్షించుకోవడానికి ప్రత్యేకంగా ఓ ఫైర్​గన్​ తయారు చేశారు.

Fire Gun
ఫైర్​గన్​తో ప్రభాకర్

ఆ గన్​ చూస్తే చాలు భయంతో పరుగులు..

Fire Gun For Tribal People: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్​తో పాటు వివిధ పరికరాలను ఏర్పాటు చేసి సుమారు 15 రోజుల పాటు కష్టపడి ఈ ఫైర్​గన్​ను రూపొందించారు. దీనికి 5 కిలోల ఎల్పీజీ గ్యాస్​తోపాటు పొడగాటి పైపులు బిగించి దానికి స్టిగ్గర్ లాంటి చేతిపిడిని ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఆన్.. ఆఫ్ బటన్​ను బిగించారు. పైపు పైభాగాన పెద్ద లైటర్​ను ఏర్పాటు చేశారు. గ్యాస్ బటన్ ఆన్ చేసి.. లైటర్​ను నొక్కితే చాలు అందులో నుంచి నిప్పు వస్తోంది. వెంటనే స్టిగ్గర్ నొక్కితే నిప్పు ఎక్కువవుతుంది. ఈ నిప్పు చూసి జంతువులు భయంతో పరుగులు పెట్టే విధంగా ఈ యంత్రాన్ని రూపొందించారు ప్రభాకర్.

Fire Gun
ప్రయోగాల ప్రభాకర్

సర్కార్ సాయం చేస్తే..

'ఈ గన్​ను తయారు చేయడానికి రూ.5వేలు ఖర్చయింది. దీనికి ఎల్పీజీ గ్యాస్, పైపులు, స్టిగ్గర్ వంటివి అవసరమయ్యాయి. ఇది అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు.. అటవీ శాఖ అధికారులకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం సహకరిస్తే ఇలాంటివి మరిన్ని తయారు చేస్తాను.'

- ప్రయోగాల ప్రభాకర్, ఫైర్​గన్ ఆవిష్కర్త

వారి కోసమే ఈ ఫైర్​గన్..

Fire Gun
ఫైర్ గన్ తయారు చేస్తున్న ప్రభాకర్

Fire Gun for Forest Officers: అడవినే ఆధారంగా చేసుకుని బతికే గిరిజనులు నిత్యం జంతువుల బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటారు. అడవుల్లోనే విధులు నిర్వర్తించే అధికారులకూ ఈ ముప్పు ఉంటుంది. ఈ ఇరువురికి ఈ పరికరం ఎంతో మేలు చేస్తుందని ప్రభాకర్ తెలిపారు. వర్షంలో కూడా ఈ గన్ పనిచేసే విధంగా ప్రత్యేకంగా రూపొందించానని చెప్పారు. ఈ పరికరాన్ని అటవీ అధికారులకు డెమో చూపించి.. ప్రభుత్వం సహకరిస్తే.. మరిన్ని ఫైర్​గన్​లను తయారు చేసి అందిస్తానని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.