ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు

author img

By

Published : Mar 8, 2020, 11:48 PM IST

Updated : Mar 9, 2020, 12:57 PM IST

రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అట్టహాసంగా జరిగాయి. మహిళలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో అలరించారు. వివిధ జిల్లాల్లో షీటీమ్స్‌ ఆధ్వర్యంలో పరుగు నిర్వహించి భద్రతపై అవగాహన కల్పించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు.

womensday celebrations in telangana
వైభవంగా మహిళా దినోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పలు జిల్లాల్లో మహిళా భద్రత అవగాహనలో భాగంగా... షీటీమ్‌ ఆధ్వర్యంలో పరుగు కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ కాచిగూడ డివిజన్‌ పరిధిలో మహిళా దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులను సన్మానించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటోందని అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీవో భవన్‌లో వేడుకలకు ఆయన హాజరయ్యారు.

మహిళలకు అండగా నిలవడంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముందుంటుందని ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో మహిళా సాధికారికత కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. షీ ట్యాక్సీ పథకంలో భాగంగా హైదరాబాద్‌లో నలుగురు మహిళలకు కార్లు పంపిణీ చేశారు..

ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అణిచివేతకు గురవుతున్నారని ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో జరిగిన మహిళా దినోత్సవం ఆయన పాల్గొన్నారు.

మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరేళ్ల శారద ధ్వజమెత్తారు. సమాజంలో మార్పు రావాలంటే మనలోనే మార్పు రావాలని ఆమె పేర్కొన్నారు. గాంధీభవన్‌లో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

సీయోవాయల్టీ నారిథన్- 2020 పేరిట నెక్లెస్​రోడ్ లోని పీపుల్ ప్లాజా నుంచి పీవీ ఘాట్ వరకు నిర్వహించిన పరుగులో మహిళలతో పాటు పెద్ద ఎత్తున పురుషులు పాల్గొన్నారు. నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్యాట్నీ వద్ద మహిళలకు గులాబీ పూలను అందించారు.

కూకట్‌పల్లి వివేకానంద సదన్ ఇందిరా చంద్రశేఖర్ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉత్సవాల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారతదేశంలోనే మహిళలను పూజించే సంస్కృతి ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం మోదీ ప్రభుత్వం రూ. 10 కోట్లకుపైగా మరుగుదొడ్లు నిర్మించిందన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి హాజరయ్యారు. వివిధ వృత్తుల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు అవార్డులు ప్రదానం చేశారు.

మహిళ మానసికంగా, శారీరకంగా బలంగా ఉండాలని ప్రముఖ అంకాలజీ నిపుణులు డాక్టర్ సాయి దాయన పేర్కొన్నారు. మహిళలు మానసికంగా, శారీరకంగా వచ్చే వేధింపులను నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్ దాయన సూచించారు. పెద్ద పెద్ద పనులను చిటికెలో చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడొద్దు అన్నారామె. మహిళలు శారీరక శ్రమ రోజూ చేయటం అవసరమన్నారు దాయన.

తోటి మహిళలను శత్రువులుగా చూడొద్దు. అందరూ ఒకేలా ఉండరు.కొన్ని సందర్భాల్లో వారి ప్రవర్తనకు ప్రత్యేక కారణాలుండొచ్చు. మనసులోంచి వ్యతిరేక ఆలోచనలు తీసేయాలి. ఆరోగ్యం, మానసిక బలం మీద దృష్టి పెట్టిన మహిళలే చరిత్రలో విజేతలుగా నిలిచారని ఆమె గుర్తు చేశారు.

హైదరాబాద్ దిల్‌షుఖ్‌నగర్‌లో మహిళా ఫొటోగ్రాఫర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. సీనియర్‌ మహిళా ఫొటోగ్రాఫర్లను సత్కరించారు.

ఇదీ చూడండి: 'సమాజంలో మహిళలపై వివక్ష పోవాలి'

Last Updated : Mar 9, 2020, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.