ETV Bharat / state

చదువులమ్మకు సవాల్..  బడి గంట మోగేదెప్పుడో?

author img

By

Published : Jun 8, 2020, 8:39 AM IST

కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలల పునఃప్రారంభం ఓ సవాలుగా మారింది. కరోనా మహమ్మారి వెంటాడుతుండటంతో విద్యా సంస్థలను ఎప్పుడు తెరవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న తరగతి గది ప్రణాళికతో విద్యార్థులను సురక్షితంగా ఉంచడం సాధ్యమేనా? అనే సందేహాలు అటు ప్రభుత్వాలను, ఇటు ప్రైవేటు యాజమాన్యాలను వెంటాడుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది తమ బిడ్డల చదువులు సజావుగా సాగుతాయా? అనే సందేహాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి

when will schools reopen in India
భారత్​లో బడి గంట మోగేదెప్పుడో?

భారత్‌లో జూన్‌ మొదటి వారంలో మోగాల్సిన బడి గంట...ఎప్పుడు మోగుతుందో తెలియని ఆయోమయ పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కరోనాతో ఉక్కిరిబిక్కిరి అయిన కొన్ని దేశాలు విద్యా విధానాన్ని ఎలా కొనసాగిస్తున్నాయి? ఎలాంటి జాగ్రత్తలతో పాఠశాలలను తెరుస్తున్నాయి? అనే చర్చ విద్యాశాఖ వర్గాల్లో సాగుతోంది. కొన్ని దేశాలు అనుసరిస్తున్న సంస్కరణలను పరిశీలిస్తే..

జపాన్‌: ‘గాలి’ వేగంతో గదుల్లో మార్పులు

గాలి ధారళంగా వచ్చేలా తరగతి గదుల్లో మార్పులు చేశారు. విద్యార్థులు, సిబ్బంది సహా ఎవరూ భౌతికదూరం నిబంధనలను మీరి దగ్గరగా చేరకూడదు, సంభాషించ కూడదని నిర్దేశించారు. ‘మాస్కులు తప్పనిసరి. చేతులు తరచూ శుభ్రపరుచుకోవాలి. తరచూ విద్యార్థుల శరీర ఉష్ణోగ్రత పరీక్షించాలి. పాజిటివ్‌ కేసు బయటపడితే తాత్కాలికంగా తరగతి గది, అవసరమైతే పాఠశాలలను మూసివేయాలనే’ నిబంధనను అమలు చేస్తున్నారు.

వియత్నాం: రోజు మార్చి రోజు

ఇక్కడ విద్యా సంస్థలను ఫిబ్రవరిలో మూసివేసినా, మార్చి 2వ తేదీ నుంచి తెరిచారు. బడులు రోజు మార్చి రోజు నడిచాయి. తరగతి గదిలో 20 మందికి మించకూడదనే నిబంధనను అమలు చేశారు. ఆన్‌లైన్‌, ముఖాముఖి తరగతులతో పాఠ్య ప్రణాళిక పూర్తి చేశారు. విద్యేతర కార్యక్రమాలన్నీ రద్దు చేశారు.

హాంకాంగ్‌: ఒంటిపూట బడులు

హాంకాంగ్‌లో దశల వారీగా పాఠశాలలను తెరుస్తున్నారు. మే నెల 27వ తేదీ నుంచి సీనియర్‌ సెకండరీ విద్యార్థులకు తరగతులు మొదలయ్యాయి. మాధ్యమిక, ప్రాథమిక తరగతులను జూన్‌ 8న ప్రారంభిస్తారు. కిండర్‌గార్డెన్‌ విద్యార్థులకు ఈసారి తరగతులు జరగవు. తరగతి ఏదైనా గదుల్లో విద్యార్థులు మీటరు చొప్పున భౌతిక దూరం విధిగా పాటించాలని, ఒంటిపూట బడులే కొనసాగించాలని అక్కడి విద్యాశాఖ వర్గాలు నిర్ణయించాయి. భోజనం చేసేటప్పుడు అందరూ ఒకచోట గుమికూడకుండా ఉండేందుకే ఈ నిర్ణయమని పేర్కొన్నాయి.

ఇటలీ: ఆన్‌లైన్‌ విద్య!

సెప్టెంబరులో తరగతులు మొదలవుతాయి. ఆన్‌లైన్‌ విద్యతో విద్యా సంవత్సరాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. కొత్తగా 24 వేల మంది ఉపాధ్యాయులను నియమించుకునే కసరత్తును ప్రారంభించారు.

దక్షిణ కొరియా: బడిలో ఉపాధ్యాయులు.. ఇంట్లో విద్యార్థులు

బడుల పునఃప్రారంభాన్ని మూడు సార్లు వాయిదా వేసిన ఆ దేశం, ఎట్టకేలకు ఏప్రిల్‌ 9 నుంచి ఆన్‌లైన్‌ విద్యా విధానాన్ని ప్రారంభించింది. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారు. విద్యార్థులు ఇళ్లలో ఉంటూ ల్యాప్‌టాప్‌ల ద్వారా వారు బోధించే పాఠాలు వింటారు.

ఫ్రాన్స్‌: హాజరు తప్పనిసరి కాదు

మార్చి మధ్యలో మూసివేసి మే నెల 25వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించారు. తరగతి గదిలో గరిష్ఠంగా 15 మందికే అవకాశం. 11-15 సంవత్సరాల వయసు విద్యార్థులకు మాస్కు తప్పనిసరి. హాజరు తప్పనిసరి కాదనే వెసులుబాటు కల్పించారు.

తైవాన్‌: శానిటరీ మానిటర్లు.. విద్యార్థుల చుట్టూ ప్లాస్టిక్‌ తెరలు

ఈ దేశంలో విద్యాసంస్థలను మూసివేయలేదు. ప్రతి తరగతి గదిలో కొత్తగా శానిటరీ మానిటర్లను ఏర్పాటు చేశారు. బల్లలపై విద్యార్థుల చుట్టూ ప్లాస్టిక్‌ తెరలు అమర్చారు. కిటికీలు తెరిచి ఉంచారు. విద్యార్థులు గుమిగూడే కార్యక్రమాలను రద్దు చేశారు. గ్రాడ్యుయేషన్‌ ఉత్సవాలను ఆన్‌లైన్‌లో జరిపారు. విద్యార్థి విద్యా సంస్థలోకి ప్రవేశించేటప్పుడే ఉష్ణోగ్రతను పరీక్షించడంతోపాటు బూట్లను క్రిమి సంహారకం(డిస్‌ ఇన్‌ఫెక్ట్‌) చేసేలా ఏర్పాట్లు చేశారు.

బెల్జియం.. తరగతికి 10 మందే

మార్చి నెల మధ్యలో మూసివేసి మే నెల 18వ తేదీ నుంచి మళ్లీ బడులు తెరిచారు. ఒక్కో తరగతికి 10 మందికి మించరాదని నిబంధన విధించారు. తరగతి గదిలో విద్యార్థికి, విద్యార్థికీ మధ్య నాలుగు చదరపు మీటర్ల ఎండం ఉండేలా చూశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.