ETV Bharat / state

వైభవోపేతంగా సాగుతున్న నవరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Oct 25, 2020, 5:27 AM IST

రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జోగులాంబ గద్వాల, వరంగల్‌ మహంకాళీ, ఏడుపాయల వనదుర్గా భవానీ సహా ప్రధాన ఆలయాలన్నీ అమ్మవారి నామస్మరణలతో మార్మోగాయి.

వైభవోపేతంగా సాగుతున్న నవరాత్రి ఉత్సవాలు
వైభవోపేతంగా సాగుతున్న నవరాత్రి ఉత్సవాలు

దేవీ నవరాత్రుల సందర్భంగా 5వ శక్తిపీఠం జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎనిమిదో రోజు మహాగౌరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి... అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి...రథోత్సవంలో పాల్గొన్నారు.

ఓరుగల్లులో...

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఎనిమిదోరోజు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. వేయిస్తంభాల గుడిలో మహిషాసురమర్ధిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

వీరలక్ష్మి అలంకరణలో లక్ష్మీ తాయారు అమ్మవారు

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో... లక్ష్మీ తాయారు అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శుక్రవారం శంఖుచక్రాలు, ధనుర్భాణాలు, కత్తి, డోలు, భరిస ధరించి....అష్టహస్తాలతో వీరలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పంచామృతాలతో అర్చకులు వీరలక్ష్మికి అభిషేకం నిర్వహించారు.

అమ్మవారి అవతారాల్లో చిన్నారులు

మెదక్‌ జిల్లాలో శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయంలో... శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో...అష్టోత్తర కలశపూజ చేసి...మహా మంగళ హారతి ఇచ్చారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కన్యకాపరమేశ్వరి ఆలయం భక్తులతో సందడిగా మారింది. అమ్మవారి తొమ్మిది అవతారాల్లో చిన్నారులు ఆకట్టుకున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్ర ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.