ETV Bharat / state

Union Cabinet Annoucements to Telangana : తెలంగాణకు కేంద్రం వరాలు జల్లు.. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు​

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 9:13 PM IST

Union Cabinet Annoucements to Telangana : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. కేంద్రం తెలంగాణపై వరాల జల్లు కురిపించింది. ఈరోజు జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో మూడు ప్రధాన అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. పసుపు బోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌కు కొత్త మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది.

Union Cabinet Goodnews to Telangana
Union Cabinet Annoucements to Telangana

Union Cabinet Goodnews to Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రాష్ట్రానికి కేంద్రం(Union Cabinet) వరాలు కురిపించింది. ఒకే రోజు మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు కోసం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ యూనివర్సిటీకి గిరిజన దేవతలైన సమ్మక్క, సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడంతో పాటు.. 889.07 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Central Govt Focus on Krishna Water Share to AP and Telangana : 'కృష్ణా జలాల్లో.. తెలుగు రాష్ట్రాల వాటా త్వరగా తేల్చండి'

Tribal University in Telangana : గిరిజన కళలు, సంస్కృతి, సాంప్రదాయిక జ్ఞాన వ్యవస్థలలో బోధనా పరమైన, పరిశోధన సంబంధమైన సదుపాయాలకు కూడా ఈ విశ్వవిద్యాలయం వేదిక కానుందని కేంద్రం తెలిపింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల వివాదాలను పరిష్కరించేందుకు, నీటి వాటాలు తేల్చేందుకు గాను.. ప్రస్తుతం ఉన్న కృష్ణా ట్రైబ్యునల్‌కు సరికొత్త మార్గదర్శకాలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.

Krishna Tribunal : తెలంగాణ ప్రభుత్వ విజ్ఞాపన మేరకే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించడానికి ట్రైబ్యునల్‌ పదవీ కాలం పొడిగిస్తూ.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, ఇరు రాష్ట్రాల మధ్య సర్దుబాటు చేయాల్సిన విధివిధానాలపై జలశక్తి శాఖ విడుదల చేసే గెజిట్‌లో పొందుపరచనుంది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాలపై ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

2014లో కేంద్రం తగిన నిర్ణయం తీసుకోకపోవడంతో.. 2018లో తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత 2021లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండవ భేటీలో ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని, కానీ... సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ అడ్డంకిగా మారిందని కేంద్రం తెలంగాణకు తెలిపింది. ఆ నేపథ్యంలో.... తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ ఉపసంహరించుకున్న తరువాత... న్యాయపరంగా అన్ని అంశాలపై అటార్నీ జనరల్‌, సొలిసిటర్‌ జనరల్‌ నుంచి అభిప్రాయాల అనంతరం.. ఈరోజు కేంద్ర క్యాబినెట్‌ ట్రైబ్యునల్‌ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Turmeric Board in Telangana : జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. పసుపు రంగ అభివృద్దికి సుగంధ ద్రవ్యాల బోర్డు, ఇతర ప్రభుత్వ సంస్థలతో సమన్వయాన్ని ఈ బోర్డు మరింత సులభతరం చేస్తుందని కేంద్రం అభిప్రాయపడింది. 2030 నాటికి ఒక బిలియన్‌ అమెరికా డాలర్ల స్థాయికి పసుపు ఎగుమతులు జరుగుతాయనే అంచనాతో... పసుపుకు ప్రాధాన్యత పెంచాలనే ఉద్దేశ్యంతో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

కొత్తగా బోర్డు ఏర్పాటు ద్వారా.. పసుపుపై అవగాహన, వినియోగాన్ని మరింత పెంచడానికి, ఎగుమతులను వృద్ధి చేయడానికి అంతర్జాతీయంగా కొత్త మార్కెట్‌లను అభివృద్ధి చేయడానికి, కొత్త ఉత్పత్తులలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొంది. విలువ ఆధారిత పసుపు ఉత్పత్తులపై పరిజ్ఞానం తద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందడం కోసం పసుపు ఉత్పత్తిదారుల సామర్థ్యం పెంపుదల, నైపుణ్యాభివృద్ధిపై బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.

పసుపు ఉత్పత్తిదారులకు మరింత శ్రేయస్సును అందించడానికి బోర్డు కార్యకలాపాలు దోహదపడతాయని కేంద్రం వెల్లడించింది. ఈ బోర్డు ఛైర్మన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని, ఆయుష్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ ఔషధ, వ్యవసాయం, రైతు సంక్షేమం, వాణిజ్య పరిశ్రమల శాఖల నుంచి సభ్యులు ఉంటారు. వీరితో పాటు.. మూడు రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు రొటేషన్ ప్రాతిపదికన సభ్యులుగా కొనసాగుతారు.

పరిశోధనలో నిమగ్నమైన జాతీయ, రాష్ట్ర సంస్థల ప్రతినిధులు, పసుపు రైతులు, ఎగుమతిదారుల ప్రతినిధులతో పాటు.. బోర్డు కార్యదర్శిని వాణిజ్య శాఖ నియమించనుంది. దేశంలో పసుపు పండించే 20 రాష్ట్రాల్లో.. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి అధిక ఉత్పత్తి అవుతుందని కేంద్రం పేర్కొంది. ఐతే, క్యాబినెట్‌ నిర్ణయాలపై కేంద్ర వాణిజ్య శాఖ విడుదల ప్రకటనలో మాత్రం బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందనే ప్రస్తావన లేదు.

Kishan Reddy about Krishna Water Sharing : 'కేంద్ర నిర్ణయంతో కృష్ణా జలాల సమస్య పరిష్కారమవుతుందని ఆకాంక్షిస్తున్నా'

PM Modi Nizamabad Tour Today : నేడు నిజామాబాద్ జిల్లా​కు ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.