ETV Bharat / state

వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు.. ఎందుకంటే

author img

By

Published : Oct 24, 2020, 5:09 AM IST

మార్కెట్లో మంచి ధర వచ్చే పంటలను మాత్రమే సాగు చేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. గోదావరి ప్రాజెక్టులతో 24 జిల్లాలు సుభిక్షంగా మారాయని.. కృష్ణా ప్రాజెక్టులతో మిగిలిన జిల్లాలూ సుభిక్షమవుతాయని తెలిపారు. వ్యవసాయశాఖలో కొత్తగా రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు.. ఎందుకంటే
వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు.. ఎందుకంటే

వ్యవసాయరంగానికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. అనేక చర్యలు తీసుకుంటూ.. రాష్ట్ర సాగు ముఖచిత్రమే మార్చామని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సహా ఉన్నతాధికారులతో వ్యవసాయరంగంపై సీఎం సమీక్షించారు. వ్యవసాయశాఖలో కొత్తగా రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సాగునీరు, విద్యుత్‌, ఎరువులు, విత్తనాల పర్యవేక్షణకు ఒకటి.... మార్కెటింగ్‌ కోసం మరొక విభాగం ఏర్పాటు చేసి ఐఏఎస్​ అధికారులు నేతృత్వం వహించాలని నిర్దేశించారు.

జిల్లాలన్నీ జలసిరులతో తడుస్తాయి

దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో వరి సాగు అవుతోందని... మిగతా పంటల్లోనూ పురోగతి సాధించాలన్నారు. భవిష్యత్తులో సాగు రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల వల్ల 24 జిల్లాలు సుభిక్షంగా మారాయని... సాగునీటికి ఢోకా ఉండదని ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు గోదావరి ప్రాజెక్టుల కింద సాగునీటిని పొందుతున్నాయని తెలిపారు. కృష్ణా నదిపై నిర్మించే ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సుభిక్షంగా మారబోతున్నాయన్నారు.

నిర్ణీత సాగు విధానం పాటించాలి

రాష్ట్రంలో ఒక్కో ప్రాజెక్టు ఒక్కో సమయంలో నిండటం వల్ల ఆయా ప్రాంతాల్లోని పంటకాలాల్లో స్వల్ప తేడాలు ఉంటాయని చెప్పారు. అందుకు అనుగుణంగానే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని... పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. మార్కెట్లో మంచి ధర వచ్చే పంటలను వేయాలని... నిర్ణీత పంటల సాగు విధానాన్ని అందుకే సూచిస్తున్నామని వివరించారు. వరి, పత్తితోపాటు కొన్ని పంటల సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉందన్నారు. కందులు 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో సాగవ్వాలని... ఆయిల్ పామ్ 12 లక్షల ఎకరాల్లో, 15 లక్షల ఎకరాల్లో మిరప, పసుపు, ఇతర పప్పుధాన్యాలు, కూరగాయలు తదితర పంటలు సాగు కావాలని సూచించారు. నీటి లభ్యత, భూముల రకం, వాతావరణం, మార్కెటింగ్ అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎప్పటికప్పుడు ఏ పంటలు వేయాలన్న విషయమై అధికారులు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు..

ఇదీ చూడండి: రెండో రోజు కేంద్రబృందం పర్యటన.. నష్టం అంచనా వివరాలు సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.