ETV Bharat / state

Ts High court: ఇఫ్లూలో బోధనా సిబ్బంది నియామకాలకు హైకోర్టు పచ్చజెండా..

author img

By

Published : Sep 28, 2021, 8:04 PM IST

Ts High court
Ts High court

ఇఫ్లూలో బోధనా సిబ్బంది నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతిచ్చింది. యూనివర్సిటీలో నియామకాలను నిలిపివేస్తూ జాతీయ బీసీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొంది. నియామకాల్లో అభ్యంతరాలుంటే అభ్యర్థులు సింగిల్‌ జడ్జిని ఆశ్రయించవచ్చని తెలిపింది.

ఇఫ్లూ(ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ)లో బోధనా సిబ్బంది నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. గతేడాది 58 అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఇఫ్లూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఓబీసీలకు అన్యాయం జరిగేలా నోటిఫికేషన్ ఉందని.. రిజర్వేషన్ నిబంధనలు అమలు కావడం లేదంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ జాతీయ బీసీ కమిషన్​ను ఆశ్రయించారు. దీంతో ఇఫ్లూ నియామక ప్రక్రియను నిలిపివేయాలని గతేడాది బీసీ కమిషన్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ బీసీ కమిషన్ స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇఫ్లూ హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. యూనివర్సిటీలో నియామకాలను నిలిపివేస్తూ జాతీయ బీసీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొంది. కేసు పూర్వాపరాల జోలికి ఇక్కడ వెళ్లడంలేదని తెలిపింది.‘‘ఓబీసీ రిజర్వేషన్ల వివాదంపై మేం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంలేదు. రిజర్వేషన్ల వివాదంపై విచారణ ప్రక్రియ కొనసాగించవచ్చు’’ అని ధర్మాసనం తెలిపింది. నియామకాల్లో అభ్యంతరాలుంటే అభ్యర్థులు సింగిల్‌ జడ్జిని ఆశ్రయించవచ్చని తెలిపింది.

టీఎస్​పీఎస్​సీ సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్​...

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్​లో ఆరుగురు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టీఎస్​పీఎస్​సీ నిబంధనలు, చట్టానికి విరుద్ధంగా పలువురు సభ్యులను నియమించారంటూ కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రమావత్ ధన్ సింగ్, బండి లింగారెడ్డి, సుమిత్ర ఆనంద్, కారెం రవీందర్ రెడ్డి, అరవిల్లి చంద్రశేఖర్ రావు, ఆర్.సత్యనారాయణ నియామకాలను రద్దు చేయాలని కోరారు. ఆరుగురు సభ్యులతోపాటు.. టీఎస్​పీఎస్​సీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

జేఎన్​టీయూహెచ్ ఉపకులపతి నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్​...

జేఎన్​టీయూహెచ్ ఉపకులపతి ప్రొఫెసర్​గా కట్టా నర్సింహారెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ ఏబీవీపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. సెర్చ్ కమిటీ ఏర్పాటు నుంచి వీసీ నియామకం వరకు.. యూజీసీ, ఇతర చట్టాలను ఉల్లంఘించారని పిల్​లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ పేర్కొన్నారు. వీసీ నియామకం, సెర్చ్ కమిటీ ఏర్పాటు జీవోలను కొట్టివేయాలని పిల్​లో పేర్కొన్నారు. నర్సింహారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, జేఎన్​టీయూహెచ్, యూజీసీతో పాటు సెర్చ్ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Huzurabad by-election: 'హుజురాబాద్​లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.