ETV Bharat / state

మంత్రుల పర్యవేక్షణ, ఎమ్మెల్యేలకు బాధ్యతలు

author img

By

Published : Apr 18, 2021, 10:18 AM IST

తెలంగాణలో రెండు నగరపాలక సంస్థలు, అయిదు పురపాలక సంఘాలకు ఈనెల 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెరాస పటిష్ఠ వ్యూహం రచించింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలకు ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, నేతల సమన్వయం బాధ్యతలను అప్పగించనుంది.

trs party solid strategy for Elections to Municipal Corporations in telangana
మంత్రుల పర్యవేక్షణ, ఎమ్మెల్యేలకు బాధ్యతలు

వరంగల్‌, ఖమ్మం నగర పాలక సంస్థలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు పురపాలికలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల వార్డులకు ఉపఎన్నికలను నిర్వహించనున్నారు. ఎన్నికల ఇన్‌ఛార్జిగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు వ్యవహరిస్తుండగా.. స్థానిక నేతలు పర్యవేక్షించనున్నారు. ఆదివారం నుంచే పూర్తి స్థాయిలో ప్రచారం చేపట్టాలని అధిష్ఠానం నిర్దేశించింది.

ఎక్కడివారక్కడే..

స్థానిక ఎన్నికలైనందున ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలోనే పార్టీ శ్రేణులు పనిచేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. వరంగల్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎమ్మెల్యేలు.., ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, సిద్దిపేటకు మంత్రి హరీశ్‌రావు, జడ్చర్ల, కొత్తూరు పురపాలికలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, అచ్చంపేటకు మంత్రి నిరంజన్‌రెడ్డి, నకిరేకల్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డిల పర్యవేక్షణ బాధ్యతలు చేపడతారు.

కార్పొరేషన్లలో ఒక్కో డివిజన్‌కో ముఖ్యనేతను, పురపాలికల్లో ప్రతి మూడు నాలుగు వార్డులకో నాయకుడు ప్రచార బాధ్యతలు చేపడతారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక నేతలకే పార్టీ అప్పగించింది. పార్టీ వ్యూహానికి అనుగుణంగా అన్ని విధాల అర్హులకు, బలమైన వారికే టికెట్లు ఇవ్వాలని సూచించింది. మినీ పోరు ప్రచారానికి మరో 11 రోజులే సమయం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రచారం చేపట్టాలని అధిష్ఠానం ఆదేశించింది. వరంగల్‌, ఖమ్మంలలో రెండేసి రోజులు కేటీఆర్‌ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు తెలిసింది. మిగిలిన పురపాలికల్లోనూ ఆయన పర్యటించే వీలుంది.

ఇదీ చూడండి: కరోనా సెకండ్​ వేవ్ ప్రభావం... ప్రభుత్వ ఉద్యోగులపై పంజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.