ETV Bharat / state

Revanth comments on TRS, BJP: రైతుల చావుకు తెరాస, భాజపాలే కారణం : రేవంత్‌ రెడ్డి

author img

By

Published : Dec 27, 2021, 5:40 PM IST

Revanth reddy comments on BJP, TRS : ధాన్యం విషయంలో తెరాస, భాజపావి ఆర్భాటాలేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హడావుడి తప్ప రైతు సమస్యను పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల చావులకు తెరాస, భాజపాయే కారణమని ఆరోపించారు.

Revanth reddy comments on BJP, TRS, revanth arrest in hyderabad
ధాన్యం విషయంలో తెరాస, భాజపావి ఆర్భాటాలే..: రేవంత్ రెడ్డి

Revanth reddy comments on BJP, TRS : ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలకే పరిమితమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిలదీస్తామని గొప్పలు చెప్పారని.. ప్రధాని, కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్లు లేకుండానే మంత్రులు దిల్లీ వెళ్లారని ఎద్దేవా చేశారు. కేంద్రం మాత్రం ధాన్యం కొనుగోలు చేస్తామని.. రాష్ట్రమే ధాన్యం సేకరించట్లేదని చెబుతోందన్నారు. ఎర్రవల్లిలో రచ్చబండకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. జూబ్లీహిల్స్‌లో రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి అంబర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు విడుదల చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు.

ధాన్యం విషయంలో తెరాస, భాజపావి ఆర్భాటాలే..: రేవంత్ రెడ్డి

'ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలకే పరిమితమైంది. దిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిలదీస్తామని గొప్పలు చెప్పారు. ప్రధాని, కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్లు లేకుండానే దిల్లీ వెళ్లారు. దిల్లీ వెళ్లి ఎలాంటి హామీలు లేకుండానే వెనక్కి వచ్చారు. కేంద్రం మాత్రం ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతోంది. రాష్ట్రమే ధాన్యం సేకరించట్లేదని కేంద్రం చెబుతోంది. గత మూడు నెలల నుంచి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. పండించిన పంట కొనుగోలు చేయకపోవడం వల్ల అన్నదాతలు చనిపోయారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనాల్సిందే. రైతులను వరి వద్దని చెప్పి... సీఎం కేసీఆర్ మాత్రం తన వ్యవసాయ క్షేత్రంలో150 ఎకరాల్లో వరి ఎందుకు వేశారు? ఆ పంటను ఎవరికి అమ్ముతారు? రైతులు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం మనో ధైర్యం నింపలేకపోతుంది. రైతుల కల్లాల దగ్గరకి వెళ్లి ధైర్యం చెబుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్.

-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

'తెరపైకి కొత్త సమస్య'

భాజపా నాయకులు కొత్తగా నిరుద్యోగ దీక్షను తెరపైకి తెచ్చారని మండిపడ్డ రేవంత్‌రెడ్డి.. రైతుల చావులకు తెరాస, భాజపాయే కారణమన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేంద్ర హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతుల సమస్యను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పండించిన పంటకొనలేని సీఎం కేసీఆర్​ను గద్దె దించుతామని అన్నారు. తాము ఎన్నికల ప్రచారం కోసం పోవడం లేదని.. రైతులకు అండగా నిలవడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయేది సోనియమ్మ రాజ్యమేనని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

'భాజపా నాయకులు కొత్తగా నిరుద్యోగ దీక్షను తెరపైకి తెచ్చారు. రైతుల చావులకు తెరాస, భాజపాయే కారణం. 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేంద్ర హామీ ఏమైంది. రైతుల సమస్యను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిరుద్యోగులను మోసం చేశాయి.'

-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

53లక్షల కుటుంబాలు పండిస్తున్నారని రేవంత్​ రెడ్డి తెలిపారు. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని స్పష్టం చేశారు. ఆదుకునేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని... ఇతర జిల్లాల్లో కూడా పర్యటిస్తామని చెప్పారు.

'నేను పార్టీలో ఏడనో కలపడం కాదు.. ప్రజలు వాళ్ల పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారు. రైతులను మోసం చేస్తే ఊరుకోరు. రైతులు చనిపోతుంటే వారి సమస్యలు పరిష్కరించకుండా... వారం రోజులు దిల్లోలో ఉండి ఏం చేశారు? ఇవాళ వచ్చి మౌనంగా ఎక్కడి వాళ్ల అక్కడికి పోయారు. భాజపా, తెరాస కలిసి ఉమ్మడిగా రైతులను మోసం చేస్తున్నారు. తెలంగాణ రైతులకు ప్రతీఒక్క కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు అండగా ఉండాలి. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు. సమస్యకు చావు పరిష్కారం కాదు. రాబోయే రోజుల్లో సోనియమ్మ రాజ్యం వస్తుంది. రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంది. చిరుధాన్యాలను ప్రభుత్వమే కొంటుంది.

-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇదీ చదవండి: Revanth Reddy Arrest: ఉద్రిక్తతల మధ్య రేవంత్ రెడ్డి అరెస్ట్.. అంబర్​పేట పీఎస్​కు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.