ETV Bharat / state

భూముల క్రమబద్ధీకరణకు యాప్‌ సోపాలు.. అయోమయంలో స్థలాలు, ఇళ్లు కొన్న పేదలు

author img

By

Published : Jun 26, 2022, 7:45 AM IST

issues of regularization of the lands: తెలంగాణలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ చాలామందికి చుక్కలు చూపుతోంది. సర్కారీ బృందాలు క్షేత్రస్థాయిలో నివాసాలను పరిశీలించి రెవెన్యూశాఖ యాప్‌ ఆధారంగా సమాచారాన్ని దానిలో పొందుపర్చుతున్నాయి. అందులోని ఐచ్ఛికాలతో పేదలిచ్చే సమాచారం సరిపోలక అనేకచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రభుత్వ స్థలం
ప్రభుత్వ స్థలం

issues of regularization of the lands: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ చాలామందికి చుక్కలు చూపుతోంది. సర్కారీ బృందాలు క్షేత్రస్థాయిలో నివాసాలను పరిశీలించి రెవెన్యూశాఖ యాప్‌ ఆధారంగా సమాచారాన్ని దానిలో పొందుపర్చుతున్నాయి. అందులోని ఐచ్ఛికాలతో పేదలిచ్చే సమాచారం సరిపోలక అనేకచోట్ల చిక్కులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో జీవో ఎంఎస్‌.నం.58, 59 కింద గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆక్రమణదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తం 1.60లక్షల దరఖాస్తులు వచ్చాయి. వివిధ శాఖల జిల్లా అధికారులకు వాటి పరిశీలన బాధ్యతలు అప్పగించారు. ప్రతి 250 దరఖాస్తుల పరిశీలనకు ఓ బృందాన్ని ఏర్పాటుచేశారు. జూన్‌ రెండోతేదీ నాటికే పరిశీలన పూర్తిచేయాలని ఆదేశించినా చాలా జిల్లాల్లో ఇప్పటికీ కొలిక్కిరాలేదు.

అర్హులున్నా.. ఆధారాల్లేవు: 2014 జూన్‌ 2కి ముందు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి క్రమబద్ధీకరణ చేయాలనేది లక్ష్యం. ఆ గడువులోపు ఇంటి పన్ను, విద్యుత్‌ బిల్లు రసీదు, కొళాయి బిల్లు.. ఇలా ఏదైనా రుజువును లబ్ధిదారులు చూపాలి. వాటి ఆధారంగా క్షేత్రస్థాయి సర్వే బృందాలు ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నాయి. రాష్ట్రంలో మొదట 2014-16 సంవత్సరాల మధ్య క్రమబద్ధీకరణ చేపట్టారు.

అప్పుడు రుజువులు లేక, ఆధారాలు నమోదు చేయడంలో చాలామందికి తప్పులు దొర్లాయి. పూర్తి సమాచారం ఇవ్వలేనివారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. క్రమబద్ధీకరణ ఇక ఉండదేమోనని చాలామంది భూమిని, ఇంటిని విక్రయించుకున్నారు. వారి నుంచి కొనుగోలు చేసిన పేదలు ఇప్పుడు ఇచ్చిన క్రమబద్ధీకరణ అవకాశాన్ని అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారి వద్ద రుజువులు లేవు. ఇల్లు పాతదే అయినా నిర్ధారణకు అవసరమైన బిల్లుల రసీదులు వారి వద్ద లేవు.

2014 జూన్‌ 2 తరువాత తీసుకున్న రసీదులు చాలామంది చూపుతుండగా అవి చెల్లుబాటు కావడం లేదు. కొనుగోలు చేసిన ఇళ్లకు సంబంధించి పాత యజమాని పేరుపై ఉన్న కరెంటు మీటరు, కొళాయి, ఇంటి నంబరు లాంటివి తమ పేర్లపైకి మార్పించుకున్నవారి వివరాలు యాప్‌ స్వీకరించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. అర్హులైన పేదలకు వీలైనంత వరకు న్యాయం చేయాలని పలు జిల్లాల్లో కలెక్టర్లు సర్వే బృందాలకు సూచిస్తున్నా సాంకేతిక ఇబ్బందులతో సాధ్యంకావడం లేదని తెలిసింది. దీనిపై చాలాచోట్ల లబ్ధిదారులు వేడుకుంటున్నా పరిశీలక బృందాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు బృందాలు ఎక్కువగా జీవో ఎంఎస్‌.నం.58 దరఖాస్తుల పరిశీలనకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.

పట్టణాల్లోనే పూర్తి: క్రమబద్ధీకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి పరిశీలన ఇప్పటికీ పూర్తికాలేదు. సమీప పట్టణాలు, పురపాలికలకు మండలాల నుంచి నాయబ్‌ తహసీల్దార్లు, ఆర్‌ఐ, సర్వేయర్లను కలెక్టర్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటుచేసి మున్సిపాలిటీలలో సర్వే బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో వారికి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు, గ్రామాల్లో క్రీడామైదానాల ఏర్పాటుకు భూముల గుర్తింపు తదితర అదనపు బాధ్యతలు అప్పగించడంతో క్షేత్రస్థాయి సర్వేకు అవరోధం ఏర్పడింది. ఈ నెల రెండోతేదీ నాటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేయాలని రెవెన్యూశాఖ గడువు విధించినా కొన్ని జిల్లాల్లో నేటికీ 60శాతం కూడా సర్వే పూర్తికాలేదు. కలెక్టర్లు చొరవ చూపుతున్న చోట వేగంగా కొలిక్కి వస్తోంది.


ఇదీ చదవండి: telangana government: కేంద్ర సంస్థలకిచ్చిన భూములపై నజర్‌

రెండేళ్లుగా ఎదురుచూపుల్లో సాదాబైనామా.. బాధలు తీరేదెన్నడు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.