Group1 Notification: ఉగాది తర్వాతే గ్రూప్‌-1 నోటిఫికేషన్​..!

author img

By

Published : Mar 27, 2022, 5:39 AM IST

Group1 Notification

ఉగాది తర్వాత గ్రూప్‌-వన్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 503 పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇవ్వగా అందుకు సంబంధించిన పూర్తి వివరాలను వారం రోజుల్లో ఇవ్వాలని ఆయా శాఖాధిపతులను టీఎస్​పీఎస్సీ కోరింది. వివరాలన్నీ అందాక ప్రకటన వెలువరించనుంది. అటు... కొత్త విధానానికి అనుగుణంగా అభ్యర్థుల స్థానికత ఖరారు కోసం ఓటీఆర్​లో సవరణలకు ఒకటి, రెండు రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా టీఎస్​పీఎస్సీ అవకాశం కల్పించనుంది.

ఉద్యోగ నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో టీఎస్​పీఎస్సీ తదుపరి కసరత్తు వేగవంతం చేసింది. వివిధ శాఖల్లోని 30 వేల 453 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయగా అందులో 503 గ్రూప్ వన్ పోస్టులున్నాయి. టీఎస్​పీఎస్సీ వీటిని భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులు 19 శాఖల్లో ఉన్నాయి. ఆ పోస్టులకు సంబంధించిన రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఉద్యోగార్హతలు, వేతన స్కేలు తదితర వివరాలన్నీ ఆయా శాఖల నుంచి కమిషన్‌కు అందాల్సి ఉంటుంది. వాటన్నింటిని పరిశీలించాకే నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆర్థికశాఖ అనుమతి నేపథ్యంలో 19 శాఖాల అధిపతులు, ఉన్నతాధికారులతో....టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి గత రెండు రోజులుగా సమావేశమయ్యారు.

ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ, సంబంధిత అంశాలపై చర్చించారు. శాఖల నుంచి కమిషన్‌కు ఇవ్వాల్సిన సమాచారం, వివరాలపై సమీక్షించారు. నిర్ణీత ప్రొఫార్మాలో ఇండెంట్ ఫారాన్ని శాఖాధిపతులుటీఎస్​పీఎస్సీ ఇవ్వాల్సి ఉంది. అన్ని వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి, క్షుణ్నంగా తనిఖీ చేసి ఇవ్వాలని ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. వారం రోజుల్లోగా సమగ్ర వివరాలను అందించాలని గడువు విధించారు. ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాలని.... తద్వారా న్యాయపరమైన, ఇతర చిక్కులేవీ తలెత్తబోవని అన్నారు. ఆయా శాఖల నుంచి వివరాలు అందిన తర్వాత వాటన్నింటినీ పరిశీలించి, క్రోడీకరించాక గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం టీఎస్​పీఎస్సీప్రకటన విడుదల చేయనుంది. దీంతో ఉగాది పర్వదినం తర్వాత కొత్త తెలుగు సంవత్సరంలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థులకు కొత్త స్థానికత వర్తించనుంది. టీఎస్​పీఎస్సీవద్ద ఓటీఆర్ విధానంలో నమోదు చేసుకున్న అభ్యర్థుల స్థానికతను... నూతన విధానం ఆధారంగా ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు చదువుకున్న ప్రాంత వివరాలను పూర్తిగా నమోదు చేయాల్సి ఉంటుంది. వివరాల నమోదు కోసం ఓటీఆర్‌లో సవరణలు చేసేందుకు అభ్యర్థులకు టీఎస్​పీఎస్సీ అవకాశం కల్పించనుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ వెసులుబాటు ఇస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో ఓటీఆర్ సవరణకు ఒకటి, రెండు రోజుల్లోనే కమిషన్ ప్రకటన ఇచ్చి ప్రక్రియ ప్రారంభించనుంది.


ఇదీ చూడండి:

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ .. రికార్డు స్థాయికి యూనిట్‌ ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.