ETV Bharat / state

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ .. రికార్డు స్థాయికి యూనిట్‌ ధర

author img

By

Published : Mar 27, 2022, 5:11 AM IST

Electricity demand
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. రికార్డుస్థాయిలో శనివారం 13,742 మెగావాట్లుగా నమోదైంది. కరెంట్‌ ధర సైతం రికార్డు స్థాయికి చేరింది. బొగ్గు ఆధారంగా నడిచే థర్మల్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి తగ్గడంతో జాతీయ ఇంధన ఎక్స్ఛేంజీ(ఐఈఎక్స్‌)లో కరెంటు కొనుగోలు ధర రికార్డుస్థాయిలో యూనిట్‌కు రూ.20కి చేరింది.

రాష్ట్ర చరిత్రలో విద్యుత్‌ డిమాండ్‌ అత్యధికంగా రికార్డుస్థాయిలో శనివారం 13,742 మెగావాట్లు నమోదైంది. ఇంతకుముందు ఈ రికార్డు ఏడాది క్రితం ఇదే రోజున (2021 మార్చి 26) 13,668 మెగావాట్లుగా ఉండగా తాజాగా అది చెరిగిపోయింది. యాసంగి పంటలకు వ్యవసాయ మోటార్ల వినియోగం అధికంగా ఉండటంతో పాటు పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువగా నమోదవుతుండడంతో పరిశ్రమలు, ఇళ్లలో సైతం కరెంటు వినియోగం పెరుగుతోంది. దీంతో డిమాండు రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంచనా వేస్తున్నాయి. నెలరోజులుగా సాగిస్తున్న యుద్ధం కారణంగా విద్యుత్‌ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమ్మోనియం నైట్రేట్‌ దిగుమతులు లేక బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. బొగ్గు ఆధారంగా నడిచే థర్మల్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి తగ్గడంతో జాతీయ ఇంధన ఎక్స్ఛేంజీ(ఐఈఎక్స్‌)లో కరెంటు కొనుగోలు ధర రికార్డుస్థాయిలో యూనిట్‌కు రూ.20కి చేరింది.

యుద్ధంతో కష్టాలు...

బొగ్గు గనుల తవ్వకానికి ముందు మట్టి తీయడానికి పేలుళ్లు జరపాలి. ఇందుకోసం అమ్మోనియం నైట్రేట్‌ అవసరం. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం కారణంగా విదేశాల నుంచి అమ్మోనియం నైట్రేట్‌ దిగుమతులు పడిపోయి తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడి థర్మల్‌ కేంద్రాలకు సరఫరా తగ్గింది. బొగ్గు గనులకు దూరంగా ఉన్న 155 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు రోజుకు 57,616 టన్ను బొగ్గు అవసరం కాగా సుమారు 30 శాతమే (17,448 టన్నులే) అందుబాటులో ఉంటోందని కేంద్ర విద్యుత్‌ మండలి తాజాగా అన్ని రాష్ట్రాలకు పంపిన నివేదికలో స్పష్టం చేసింది. బొగ్గు కొరత కారణంగా విద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో జరగక పోవడంతో ఐఈఎక్స్‌ కరెంటు ధరలకు రెక్కలొచ్చాయి. యూనిట్‌ ధర రూ.15 నుంచి 20 వరకూ పలుకుతోంది. తెలంగాణలో ఒక యూనిట్‌ కరెంటు సరఫరా సగటు వ్యయం రూ.7.03 అవుతుండగా 60 శాతం మంది ప్రజల ఇళ్లకు అంతకన్నా తక్కువ ధరలకే సరఫరా చేస్తున్నట్లు డిస్కంలు తెలిపాయి.

ఒక్కరోజుకే రూ.100 కోట్లు చెల్లింపు

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ గరిష్ఠ స్థాయికి చేరడంతో డిస్కంలు బహిరంగ మార్కెట్‌లో ఐఈఎక్స్‌తో పాటు ఇతర చోట్ల కరెంటును కొని ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. ఈ నెల 25న ఒక్కరోజే కరెంటు కొనుగోలుకు డిస్కంలు రూ.100 కోట్లు చెల్లించాయి. ఈ నెల 14 నుంచి 25 వరకూ ఇలా విద్యుత్‌ కొనుగోలుకు రూ.550 కోట్లు వెచ్చించాయి. శుక్రవారం ఐఈఎక్స్‌లో 3.60 కోట్ల యూనిట్ల కరెంట్‌ను డిస్కంలు కొనుగోలు చేశాయి. మరో పక్షం రోజులు వరి పంటను కాపాడుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా బోర్లకు రైతులు కరెంటు వినియోగిస్తారని, విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగి 14 వేల మెగావాట్లను దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ‘ఈనాడు’కు చెప్పారు. అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒకరోజు(24 గంటల సమయం)లో అత్యధిక వినియోగం గతేడాది మార్చిలో 28.40 కోట్ల యూనిట్లు రికార్డు నమోదవగా ఈ ఏడాది 30 కోట్ల యూనిట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ఈ నెల 17న అత్యధికంగా 26.55 కోట్ల కరెంటు వినియోగం రికార్డు నమోదైంది. విద్యుత్‌ డిమాండ్‌ అంటే ఒకరోజులో ఏదో ఒక సమయంలో కాసేపు అత్యధిక వినియోగాన్ని మెగావాట్లలో చెబుతారు. ఒకరోజు(24 గంటల సమయం) పూర్తి వినియోగాన్ని కోట్ల యూనిట్లలో డిస్కంలు వెల్లడిస్తాయి.

ఇదీ చూడండి:
'హైదరాబాద్ ఫార్మా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.