ETV Bharat / state

Dalit Bandhu scheme: 'ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి యూనిట్‌ ఏర్పాటు చేసుకోవచ్చు'

author img

By

Published : Oct 3, 2021, 10:11 AM IST

దళిత బంధు పథకం కింద ఒకరి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు కలిసి రూ.10 లక్షలకు మించిన యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. లబ్ధిదారుల అభివృద్ధి కోసం వారు ఎంచుకున్న యూనిట్లకు సంబంధించి అవసరమైన శిక్షణ ఇవ్వాలనిపేర్కొంది. యూనిట్‌ ఏర్పాటుకు లబ్ధిదారులు పూర్తి స్థాయిలో శిక్షణపొంది సన్నద్ధమైనట్లు కలెక్టర్‌, ఎస్‌ఆర్‌టీ సంతృప్తి చెందితేనే నిధుల మంజూరు చేయాలని స్పష్టం చేసింది.

Dalit Bandhu scheme
Dalit Bandhu scheme

రాష్ట్రంలో దళిత బంధు పథకం కింద ఒకరి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు రూ.10 లక్షలకు మించిన యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రతి కుటుంబం రూ.10 లక్షల విలువైన యూనిట్లకు ప్రణాళికలు రూపొందించాలని తెలిపింది. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లకు సంబంధించి అవసరమైన శిక్షణ ఇవ్వాలని, ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొంది. శిక్షణ, క్షేత్ర స్థాయిలో యూనిట్‌ అమలుకు కనీసం రెండు నుంచి ఆరు వారాల సమయం పట్టనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కలెక్టర్‌ అనుమతి లేనిదే దళిత బంధు ఖాతాల నుంచి నిధుల ఖర్చుకు బ్యాంకులు అనుమతించకూడదని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్‌, ఎస్‌ఆర్‌టీలు సంయుక్తంగా ఎస్సీ ఆవాసాలు, వార్డుల్లో మరోసారి పర్యటించాలని తెలిపింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో, సీఎం దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో చేపడుతున్న దళిత బంధు పథకం అమలుకు అదనపు మార్గదర్శకాలు వెలువరించింది. ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ మార్గదర్శకాలు..

  • లబ్ధిదారు పేరిట ‘దళిత బంధు’ బ్యాంకు ఖాతా తెరిచి అందులో రూ.9.90 లక్షలు నగదు జమయ్యేలా చూడాలి. ప్రత్యేక పాసు పుస్తకాలు అందజేయాలి.
  • గ్రామాల వారీగా లబ్ధిదారులు, ఎంచుకున్న యూనిట్లతో కూడిన జాబితాను సిద్ధం చేయాలి.
  • యూనిట్ల అమలుకు ఆయా రంగాలకు చెందిన జిల్లా అధికారులతో సెక్టార్‌ వనరుల బృందాలను (ఎస్‌ఆర్‌టీ) ఏర్పాటు చేయాలి. ఈ బృందాల్లో జిల్లా సీనియర్‌ అధికారుల్ని కలెక్టర్‌ నియమించాలి.
  • ఎస్‌ఆర్‌టీలు రూ.10 లక్షల విలువతో కూడిన యూనిట్లకు ప్రాజెక్టులు రూపొందించాలి. ఒక యూనిట్లో ఒకరి కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండొచ్చు.
  • ఎస్‌ఆర్‌టీ, ప్రత్యేక అధికారులు లబ్ధిదారులను పలుమార్లు కలిసి వారి ఆకాంక్ష, ఆలోచన వైఖరి, అనుభవం, ఆర్థికంగా సాధ్యాసాధ్యాలు అంచనా వేసి యూనిట్లను ఎంపిక చేయాలి. ఈ మేరకు ఆవాసాలు, గ్రామాల వారీగా తుది లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలి.
  • ఎంపికైన వారికి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో శిక్షణ ఇవ్వాలి. ఇందుకోసం అవసరమైతే నిపుణులు, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సేవలు వినియోగించుకోవాలి.
  • యూనిట్‌ ఏర్పాటుకు లబ్ధిదారులు పూర్తి స్థాయిలో శిక్షణపొంది సన్నద్ధమైనట్లు కలెక్టర్‌, ఎస్‌ఆర్‌టీ సంతృప్తి చెందితే ప్రారంభానికి చర్యలు తీసుకుంటారు.
  • యూనిట్‌ ఖరారయ్యాక నిధులు విడుదల చేయాల్సిన షెడ్యూల్‌ను సంబంధిత బ్యాంకులకు కలెక్టర్‌ తెలియజేస్తారు. అప్పటివరకు నిధులు విడుదల చేయడానికి వీల్లేదు.

ఇదీ చదవండి: new farming ideas : విపత్కర పరిస్థితుల్లోనూ వినూత్నంగా ఆలోచించు.. బంగారం పండించు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.