ETV Bharat / state

ఛైర్మన్‌, సభ్యులే లేని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

author img

By

Published : Mar 1, 2023, 3:09 PM IST

Vacancy in Telangana Human right commission: ప్రజల హక్కులను కాపాడాల్సిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ నిర్వీర్యంగా మారిపోయింది. గత రెండు నెలలుగా కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులు లేకపోవడంతో వేలాది కేసులు పరి‌ష్కారానికి నోచుకోవడం లేదు. న్యాయం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల పిటీషన్‌ కాగితాలకే పరిమితం కావడంతో నిరాశతో వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Human Rights Commission
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌

vacancy in telangana Human right commission: సమాజంలో ఎవరి హక్కులకైనా భంగం కలిగితే వారిని రక్షించేదే మానవ హక్కుల కమిషన్‌. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలోని ఆ కార్యాలయంలో ఛైర్మన్‌, సభ్యులు లేక ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా అక్కడికి వస్తే అధికారులు లేక నిరాశతో తిరిగివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

హైకోర్టులో కేసు ఎప్పుడు వేశారు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్పలో హెచ్చార్సీ కార్యాలయం పనిచేసింది. కమిషన్‌ చివరి చైర్మన్‌గా నిస్సార్‌ అహ్మద్‌ కక్రూ డిసెంబర్‌‌ 2016 వరకు పనిచేశారు. ఆయన పదవికాలం ముగిసిన తరువాత కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల నియామకం జరగలేదు. రాష్ట్ర విభజన తరువాత 2019 వరకు రెండు రాష్ట్రాలకు ఒకే కమిషన్‌ పనిచేసింది. దీంతో రెండు కమిషన్లు ఏర్పాటు చేయకపోవడంపై అప్పట్లో హైకోర్టులో ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలు కూడా అయింది.

హైకోర్టు ఆదేశం: చైర్మన్‌, సభ్యుల పదవులు ఖాళీగా ఉండటాన్ని సవాల్‌ చేస్తూ సామాజిక కార్యకర్తలు న్యాయపోరాటం చేశారు. పిల్స్‌పై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తీర్పు వెల్లడించింది. 2019 నవంబర్‌‌ 20 లోగా రెండు రాష్ట్రాలకు ప్రత్యేక కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులను నియమించాలని ఆదేశించింది.
డిసెంబర్‌ 22 నుంచి ఖాళీ కుర్చీలే: హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అదే ఏడాది డిసెంబర్‌‌ 21న కొత్త కమిషన్స్‌, ఛైర్మన్, సభ్యులను నియమిస్తూ అప్పటి సీఎస్‌ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993 సెక్షన్‌ 12సి ప్రకారం కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం-2014, సెక్షన్‌5 ప్రకారం ఏపీ హెచ్‌ఆర్‌‌సీ నుంచి టీఎస్‌హెచ్ఆర్‌సీని విభజించినట్లు వివరించారు.

చైర్మన్‌, సభ్యుల పదవీకాలం మూడేళ్లుగా పేర్కొన్నారు. దీంతో 2019 డిసెంబర్‌‌ 24న రాష్ట్ర హెచ్‌ఆర్‌‌సీ మొట్టమొదటి చైర్మన్‌గా జస్టిస్ చంద్రయ్య బాధ్యతలు చేపట్టారు. సభ్యులుగా విశ్రాంత జిల్లా సెషన్స్‌ జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యులుగా మహ్మద్‌ ఇర్ఫాన్‌ మొయినుద్దీన్‌ బాధ్యతలు స్వీకరించారు. వీరి పదవీకాలం గత డిసెంబర్‌‌తో ముగిసింది. దీంతో గత రెండు నెలలుగా ఛైర్మన్‌, సభ్యులు లేని కమిషన్‌గానే టీఎస్‌హెచ్‌ఆర్‌‌సీ మిగిలిపోయింది.

కొత్త కమిషన్​ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?: తెలంగాణ మానవ హక్కుల కమిషన్​ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కమిషన్​కు న్యాయం కోసం వచ్చిన ప్రజలు, కేసులను వాదిస్తున్నా న్యాయవాదులు తెలిపారు. చైర్మన్‌, సభ్యుల పదవీకాలం ముగిసి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయడం లేదని హెచ్‌ఆర్‌‌సీకి వచ్చే బాధితులకు ఖాళీ కుర్చిలే దర్శణమిస్తున్నాయన్నారు. పిటీషన్లు ఇన్‌ వార్డ్‌కు మాత్రమే పరిమితమౌతున్నాయని వాపోయారు.

ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి: మూడు నెలలుగా దాఖలైన పిటీషన్లు అన్నీ పెండింగ్‌ ఫైల్స్‌గానే మిగిలిపోయాయని తెలిపారు. పిటిషన్లపై విచారణ జరిపే న్యాయాధికారులు లేకపోవడంతో మానవ హక్కుల ఉళ్లంఘనలకు పాల్పడే ప్రభుత్వ అధికారులు, పోలీసులను ప్రశ్నించే వారే కరువయ్యారన్నారు. ఇలాంటిదే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, కాక్షిదారులకు కూడా చేదు అనుభవం ఎదురయ్యింది. దీంతో మానవ హక్కులను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఎలాంటి అలసత్వం వహించ కుండా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యులను భర్తీ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.