KTR Letter To Center: నిర్మలా సీతారామన్​కు కేటీఆర్​ మరో లేఖ.. ఈసారి ఎందుకంటే..?

author img

By

Published : Jan 27, 2022, 7:16 PM IST

Updated : Jan 27, 2022, 8:51 PM IST

telangana minister ktr

19:12 January 27

కేంద్ర ఆర్థిక మంత్రికి కేటీఆర్​ లేఖ..

KTR Letter To Center: రాష్ట్రాభివృద్ధికి నిధులు విడుదల చేసి సహకరించాలని కోరుతూ కేంద్రంపై వరుస లేఖాస్త్రాలు సంధిస్తోన్న మంత్రి కేటీఆర్​.. మరో లేఖ రాశారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం తరహాలో పట్టణ పేదల కోసమూ ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్​ కోరారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని పరిశీలించాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖరాశారు. పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన స్థితిగతులు, వాటిలో సానుకూల మార్పుకోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలను అందులో పేర్కొన్నారు.

తెలంగాణలో 50 శాతానికి చేరవచ్చు..

పట్టణీకరణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామమని.. మెరుగైన ఉపాధి, జీవన అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాలవైపు తరలుతున్నారని కేటీఆర్ అన్నారు. ఈ పరిస్థితుల్లో పట్టణాల్లోని మౌలిక వసతులపైనా తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందన్నారు. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా.. పట్టణాల్లో నివాసం ఉందన్న కేటీఆర్.. 2030 నాటికి అది 40 శాతానికి చేరవచ్చన్నారు. తెలంగాణ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు.

పెద్ద ఎత్తున పట్టణాల్లోకి ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణ పేదరికంపై ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్న మంత్రి... వారి నివాసం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత, జీవనోపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణాల్లోని పేదలకు ఈ అంశాల్లో సరైన అవకాశాలు కల్పించినప్పుడే వారు నాణ్యమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవితాన్ని పొందాలంటే వారి ఆదాయం పెరగాల్సిన అవసరం ఉందని... కానీ, దురదృష్టవశాత్తూ వారిలో ఎక్కువ శాతం అసంఘటిత రంగంలో కార్మికులుగా, చిరు వ్యాపారులుగా, కూలీలుగా పనిచేస్తున్న పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

పేదలకు అండగా ఉండేలా..

ఒక్కరోజు ఉపాధి లభించకపోతే వారి జీవన స్థితిగతులు తారుమారయ్యే దయనీయమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. వారి ఉపాధి, ఆదాయానికి మరింత హామీ, భరోసా ఇచ్చేలా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం తరహాలో పట్టణ పేదల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కరోనా సంక్షోభంతో పట్టణ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందని.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గణాంకాల ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్యలో గరిష్ఠంగా 21 శాతం నిరుద్యోగం నెలకొందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పట్టణాల్లోని పేదలకు అండగా ఉండేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అత్యవసరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

లాక్​డౌన్ నాటి హృదయ విదారకమైన ఘటనలు..

ప్రభుత్వం నియమించిన పలు కమిటీలు, వివిధ సంస్థలు సైతం పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఒక ఉపాధిహామీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయని లేఖలో ప్రస్తావించారు. భర్తుహరి మహతాబ్ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ స్థాయీసంఘం కూడా పట్టణ ఉపాధి హామీ కార్యక్రమాన్ని సూచించిందన్నారు. అసంఘటిత రంగంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం కేవలం పట్టణాలకే ఉందని... వారి నైపుణ్యాభివృద్ధి, ఫైనాన్షియల్ ఇంక్లూషన్, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం లాంటి చర్యలను ప్రత్యేక ఉపాధిహామీ కార్యక్రమంలో భాగంగా చేర్చాలని సూచించారు. లాక్​డౌన్ నాటి హృదయ విదారకమైన పట్టణ పేద ప్రజల వలస సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలంటే... అసంఘటిత రంగాన్ని మరింత బలోపేతం చేయడమే మార్గమని కేటీఆర్ తెలిపారు. ఉపాధికోసం ఇతర రాష్ట్రాల్లోని పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితుల్లో దేశంలోని ఎక్కడివారైనా ఏ పట్టణంలోనైనా ఉపాధిహామీ లబ్ది పొందేలా కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు.

పట్టణాలు భారత ఆర్థిక వ్యవస్థకు ఇంజన్లుగా పనిచేస్తున్న విషయాన్ని గుర్తించాలని, ఇంతటి ప్రాధాన్యత కలిగిన పట్టణ ప్రాంతాల్లోని పేదలకు చేయూత అందించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పురపాలికలపైనా ఉందని కేటీఆర్ అన్నారు. హరితహారం లాంటి గ్రీనరీ కార్యక్రమాలు, ఫుట్​పాత్​లు, డ్రైనేజీల నిర్మాణం తదితర ప్రాథమిక మౌలిక వసతుల నిర్వహణ కార్యక్రమాల్లో పట్టణ పేదలకు భాగస్వామ్యం కల్పిస్తూ వారి ఉపాధికి హామీ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అనిశ్చిత ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలను అధిగమించి పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందుకోవాలంటే, వారి ఉపాధికి మరింత హామీ కల్పించడమే ఏకైక పరిష్కారమన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రత్యేక పట్టణ ఉపాధిహామీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీచూడండి: Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. తాజాగా 3,944 కరోనా కేసులు

Last Updated :Jan 27, 2022, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.