ETV Bharat / state

700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల.. వసతులపై హైకోర్టు అసంతృప్తి

author img

By

Published : Mar 2, 2023, 9:17 PM IST

TS High Court on Facilities in Govt Educational Institutions: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థినులకు వసతులు మెరుగుపర్చాలని సర్కార్​ని హైకోర్టు ఆదేశించింది. 700 మంది విద్యార్థినులకు ఒకే టాయిలెట్ ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సరూర్​నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సమస్యలపై ఎల్​ఎల్​బీ విద్యార్థి రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

Highcourt
Highcourt

TS High Court on Facilities in Govt Educational Institutions: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతులు మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని సర్కార్​ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సరూర్​నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస వసతులు లేవంటూ ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్ రాసిన లేఖను సుమోటో పిల్‌గా హైకోర్టు స్వీకరించింది. దానిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తీసుకుంటున్న మౌలిక వసతులపై మండిపడింది.

సరూర్ నగర్ ప్రభుత్వ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటంపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమ్మాయిలకు తగిన మౌలిక వసతులు కల్పించాలని వ్యాఖ్యానించింది. సరూర్​నగర్ కాలేజీతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతులపై ఏప్రిల్ 25లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్ బోర్డు కమిషనర్​కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇకనైన ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి.

బురదమయమైన ప్రభుత్వ మహిళా కళాశాల: మరోవైపు వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని పలు గదులలోకి నీరు చేరటంతో సిబ్బంది, విద్యార్థినులు ఇబ్బందులకు గురయ్యారు. పక్కనున్న వాటర్ ట్యాంక్‌ ఓవర్‌ ఫ్లో అయి తరచూ నీరు వస్తుండటంతో క్లాస్‌రూమ్‌లు బురద మయం అవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇలా నీరు వస్తుండడంతో చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని వారు వాపోతున్నారు.

మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ నిండి ఇలా కళాశాలలోకి వస్తుందని విద్యార్థినులు చెబుతున్నారు. ఇప్పటికీ మూడు సార్లు ఇలా క్లాస్​రూమ్​లలోకి నీరు వచ్చిందన్నారు. అలా నీరు రావడం వల్ల ప్రిన్సిపల్ ఛాంబర్, ఆఫీస్ రూమ్, క్లాస్​రూమ్​లలోకి వెళ్లాలంటే మొత్తం బురదమయం అవుతుందని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని సూచించారు. దీనిపై స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌ విక్రమ్‌ కాలేజీలోకి నీళ్లు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన ఘటన కాదని దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కుంటామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.