ETV Bharat / state

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ‌కు ఎన్ని కోట్లు కేటాయించారంటే?

author img

By

Published : Feb 6, 2023, 12:48 PM IST

Telangana Health Budget 2023
Telangana Health Budget 2023

Telangana Health Budget 2023-24 : తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖకు 2023-24 ఆర్థిక ఏడాదికిగానూ బడ్జెట్‌లో రూ.రూ.12,161 కోట్లు కేటాయించారు. దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్యసేవలందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించిందని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు అన్నారు. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు.

Telangana Health Budget 2023-24 : పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి లక్ష జనాభాకు సగటున 19 ఎంబీబీఎస్‌ సీట్లతో వైద్య విద్యలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కంటి వెలుగు ద్వారా 1 కోటి 54లక్షల మందికి పరీక్షలు నిర్వహించి 40లక్షలకు పైగా కళ్లద్దాలను పంపిణీ చేసిందని చెప్పారు. హైదరాబాద్‌ నగరం నలువైపులా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోందని వెల్లడించారు. వైద్య, ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.12,161 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు.

'రూ.1100 కోట్ల ఖర్చుతో రెండు వేల బెడ్ల సామర్థ్యంతో వరంగల్‌లో హెల్త్‌ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించింది. డయాలసిస్‌ సేవలు, మాతాశిశు ఆరోగ్యం.. పౌష్టికాహారం, కేసీఆర్‌ కిట్‌, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ వంటి వాటితో పాటు, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ వ్యాధులతో అవసాన దశకు చేరిన రోగులకు ప్రభుత్వం పాలియేటివ్‌ కేర్‌ను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.' అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

'దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్యసేవలందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి వల్ల 2014 లో 92 గా ఉన్న మాతృ మరణాల రేటు 2022 నాటికి గణనీయంగా తగ్గి 43కు చేరింది. ఈరోజు దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉంది' - హరీశ్ రావు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి

టరాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారి కష్టాలు తీర్చడం కోసం ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తోంది. 2018 లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం 1 కోటి 54 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి, 40 లక్షలకు పైగా కళ్లద్దాలు పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. తొలిదశ విజయం స్ఫూర్తితో ఇటీవలే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో ప్రారంభించారు.' అని హరీశ్ రావు తెలిపారు.

రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్దఎత్తున సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ నలువైపులా గచ్చిబౌలి, ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్ ప్రాంతాల్లో ప్రభుత్వం భారీ ఎత్తున సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. ఇందులో 2,679 కోట్ల రూపాయలతో మూడు ఆస్పత్రుల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ ఆసుపత్రుల నిర్మాణంతో 4,200 పడకలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తి చేసి ప్రభుత్వం వైద్య సేవలను అందుబాటులో తేనున్నట్లు వివరించారు. వీటితో పాటు నిమ్స్ లో మరో 2 వేల పడకలు అదనంగా అందుబాటులోకి తెస్తోందని అన్నారు.

"తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు వైద్య విద్యను చేరువ చేస్తూ వైద్య సేవలను మరింత విస్తృత పరిచేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ విద్యాసంవత్సరంలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, రామగుండంలలో ఇంకో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నాం. 2023లో నిర్మల్, ఆసిఫాబాద్, భూపాల్ పల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌లలో మరో 9 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 26 కు చేరనుంది. ఈ కాలేజీలకు అనుబంధంగా ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం." - హరీశ్ రావు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి

'గతంలో హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు సుస్తీ చేస్తే ప్రైవేటు దవాఖానాలే దిక్కయ్యేవి. ప్రభుత్వ వైద్యసేవలు అందుబాటులో ఉండేవి కావు. నిరుపేదల బస్తీలలో చక్కని సౌకర్యాలతో వైద్యశాలలను ప్రారంభించిన ఘనత మన కేసీఆర్‌కే దక్కుతుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 342 బస్తీ దవాఖానలు పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలనందిస్తున్నాయి. వీటికి కొనసాగింపుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో మరో వంద బస్తీ దవాఖానలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.' అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.