ETV Bharat / state

Fever Survey in Telangana : తెలంగాణలో ఇంటింటా జ్వరం.. జలుబు

author img

By

Published : Jan 23, 2022, 6:40 AM IST

Updated : Jan 23, 2022, 7:13 AM IST

Fever Survey Updates in Telangana, fever survey reports
ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య

Fever Survey Updates in Telangana : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే కొనసాగుతోంది. వైద్యబృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను లక్షణాలు అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉన్నట్లుగా సర్వే ఫలితాల్లో వెల్లడైంది.

Fever Survey Updates in Telangana : రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంది. ఒమిక్రాన్‌ బయటపడిన అనంతరం నెలరోజులుగా ప్రతి ఇంట్లో ఇవి సర్వసాధారణమయ్యాయి. రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జ్వర సర్వేలో వెలుగుచూస్తున్న వాస్తవాలివి. 29.26 లక్షల ఇళ్లను సర్వే చేయగా ఇందులో జ్వరం తదితర లక్షణాలున్న వారు 1,28,079మంది. వీరిలో 1,27,372 మందికి కిట్‌లు ఇచ్చారు. చాలా మందిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోకుండా స్థానిక వైద్యుల సహకారంతో మందులు వాడుతున్నారు. జ్వరం వచ్చిన మూడు, నాలుగు రోజుల్లో కొవిడ్‌ లక్షణాల తీవ్రత తగ్గుతుండడంతో ప్రజలు తేలికగా తీసుకుంటున్నారు.

Fever Survey Updates in Telangana, fever survey reports
ఇంటింటా ఫీవర్ సర్వే

లక్షణాలున్నా.. లేవు లేవంటూ..

స్థానికంగా పంచాయతీ కార్యదర్శి, ఆశా వర్కర్‌, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్‌ బృందంగా ఏర్పడి రెండు రోజులుగా రోజుకి 100 గృహాలను జ్వర సర్వే చేస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే.. అక్కడే పరీక్షించి కిట్లు పంపిణీ చేస్తున్నారు. ‘‘కొందరు ఈ లక్షణాలున్నా భయంతో లేవని చెబుతున్నారు. తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఇంట్లో ఒకరికి ఏదో ఒక లక్షణం కనిపిస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నాం’’ అని సర్వేలో భాగమైన పలువురు అధికారులు తెలిపారు. సగటున ప్రతి వంద మందిలో 25-30 మంది ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నట్లు వివరించారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించినా కొన్ని చోట్ల నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. పాజిటివ్‌ వస్తుందేమోనని ముందుకు రావడం లేదు. ఇటీవల లోకల్‌ సర్కిల్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో పాజిటివ్‌ వ్యక్తితో తిరిగిన ప్రజల్లో దాదాపు 41 శాతం మంది పరీక్షలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడైంది.

జీహెచ్‌ఎంసీలోనూ..

జీహెచ్‌ఎంసీలో ఇప్పటి వరకు 55 వేల గృహాలను పరిశీలించారు. 2,200 మందికి లక్షణాలున్నట్లు గుర్తించారు. మరోపక్క బస్తీల్లోని ప్రైవేటు క్లినిక్‌లకు వచ్చే కేసులన్నీ జ్వరం, జలుబు, దగ్గుతోనే అని తెలుస్తోంది. ఒక్కో క్లినిక్‌కు రోజుకి కనీసం 200 మంది వస్తున్నారు. ఇంట్లో ఒకరికి చికిత్స తీసుకుంటే.. అవే మందుల్ని మిగతా వ్యక్తులు వాడుతున్నారు. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండల కేంద్రంలో 250 మందిని జ్వర సర్వేలో పరీక్షించగా 40 మందికి జలుబు, జ్వరం ఉన్నట్లు వెల్లడైంది. వీరిలో నలుగురు పరీక్షలు చేయించుకోగా వారికి పాజిటివ్‌ వచ్చింది.

మరో 4,393 మందికి పాజిటివ్‌

రాష్ట్రంలో శనివారం కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ రెండోసారి కొవిడ్‌ బారిన పడ్డారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 1,16,224 మందికి పరీక్షలు జరిగాయి. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 1,643, మేడ్చల్‌లో 421, రంగారెడ్డిలో 286, హనుమకొండలో 184, ఖమ్మంలో 128 కేసులు వచ్చాయి.

జిల్లాల వారీగా పరిస్థితిదీ...

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం ఒక్కరోజు 969 బృందాలు 65,777 గృహాలను పరిశీలించాయి. 3,914 మందికి కిట్లు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా 695 గ్రామాల్లో సర్వే పూర్తయింది. 1.94 లక్షల గృహాల్లోని 3.65 లక్షల మందిని పరీక్షించారు. 7,030 మందికి కిట్‌లు అందించారు.

* ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా 1.35 లక్షల గృహాలను పరిశీలించగా లక్షణాలున్న 4,604 మందికి కిట్ల పంపిణీ జరిగింది. ఆదిలాబాద్‌లో 60 వేల గృహాలను పరిశీలించగా 1,458 మందిలో లక్షణాలు బయటపడ్డాయి.

* వరంగల్‌ జిల్లాలో 29,540 గృహాలను పరిశీలించగా.. 1,699 మందికి, హనుమకొండలో 22,375 గృహాలను సందర్శిస్తే 3,356 మందికి కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి.

ఏపీలో 12,926 మందికి కొవిడ్‌

ఏపీలో శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకు 29.53 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 43,763 నమూనాలను పరీక్షించగా.. 12,926 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది.

మాజీ ప్రధాని దేవేగౌడకు కరోనా

మాజీ ప్రధాని దేవేగౌడ కరోనా బారినపడ్డారు. పాజిటివ్‌ రావడంతో బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కొవిడ్‌ రావటం ఇది రెండవసారి

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి ఫీవర్​ సర్వే.. లక్షణాలుంటే కిట్స్​..

Last Updated :Jan 23, 2022, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.