ETV Bharat / state

Telangana Assembly Budget Session: మేడారం జాతర ముగిశాకే రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు!

author img

By

Published : Feb 5, 2022, 5:31 AM IST

Telangana Assembly Budget Session: ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిశాక సమావేశాలను ప్రారంభించి.. యాదాద్రి పునఃప్రారంభ ముహూర్తానికి వీలైనంత ముందే ముగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఉభయసభలను ప్రోరోగ్ (నిరవధిక వాయిదా) చేసి ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

telangana budget session 2022
telangana budget session 2022

Telangana Assembly Budget Session: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్‌ను మార్చి నెలాఖరులోగా ఉభయసభలు ఆమోదించాల్సి ఉంది. ఇందుకోసం శాసనసభ, మండలి సమావేశాలను త్వరలో నిర్వహించనున్నారు. గత ఏడాది.. మార్చి 15న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై పది రోజుల పాటు జరిగాయి. అప్పుడు మార్చి 18న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది అంతకు ముందుగానే సమావేశాలను పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన రాష్ట్ర ప్రభుత్వం... మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తంగా ఖరారు చేసింది. ముహూర్తానికి ముందుగానే మార్చి 21న నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించనున్నారు. వైభవంగా నిర్వహించనున్న ఈ వేడుకల సమయానికి వీలైనంత ముందుగానే బడ్జెట్ సమావేశాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మార్చి రెండో వారానికే సమావేశాలను ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రోరోగ్ చేసిన తర్వాతే..

అటు ఈ నెల 16 నుంచి 19 వరకు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనుంది. రెండేళ్లకోసారి జరగనున్న జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో జాతర ముగిశాకే బడ్జెట్ సమావేశాల జరిగే పరిస్థితి ఉంది. నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఉభయసభలను సమావేశపరిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పది నుంచి 15 రోజుల పాటు సమావేశాలు జరగవచ్చు. బడ్జెట్ సమావేశాల కోసం ఉభయసభలను సమావేశపరుస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం నోటిఫికేషన్ జారీ చేయాలి. అయితే అసెంబ్లీ, కౌన్సిల్ ఇంకా ప్రోరోగ్ కాలేదు. దీంతో ఉభయసభలను ముందు ప్రోరోగ్ చేసి ఆ తర్వాత సమన్ చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు.

ఇదీచూడండి: Union Budget 2022: డిజిటల్‌ భారత్‌కు 'బడ్జెట్‌' రైట్‌ రైట్‌..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.