ETV Bharat / state

T Congress Focus Constituency Candidates : రచ్చకెక్కిన కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకాలు

author img

By

Published : Jul 8, 2023, 11:26 AM IST

Congress
Congress

T Congress Focus On Assembly Elections : కాంగ్రెస్‌లో మండల అధ్యక్షుల నియామకాలు.. నాయకుల మధ్య చిచ్చు పెట్టాయి. పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నియామకం చేసిన కొందరు మండలాధ్యక్షులను మార్పు చేయడం, నియామక పత్రాలపై సంతకం చేసే అధికారం మల్లు రవికి ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల అధ్యక్షులను మల్లురవి సంతకాలతో నియామకం జరిగినా మిగిలిన నియోజకవర్గాల మండలాధ్యక్షుల నియామకాలను కాంగ్రెస్‌ తాత్కాలికంగా నిలుపుదల చేసింది.

రచ్చకెక్కిన కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకాలు

T Congress Disputes About Constituency Presidents : అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మండల అధ్యక్షులను నియమించే కార్యక్రమం పీసీసీ చేపట్టింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌ రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌తో పాటు పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి కలిసి కసరత్తు పూర్తి చేశారు.

డీసీసీ అధ్యక్షులు, ఆయా నియోజకవర్గాల ఇంఛార్జిలు, ప్రధాన కార్యదర్శులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉపాధ్యక్షులు ఇచ్చిన సిఫారసులను దృష్టిలో ఉంచుకుని పార్టీకి విధేయులుగా ఉండే నాయకులను మండలాల అధ్యక్షులుగా నియమించే దిశలో కసరత్తు జరిగింది. మంగళవారం నాటికి రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాలకుగాను 72 నియోజకవర్గాలకు సంబంధించిన మండలాల అధ్యక్షులను నియమిస్తూ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ జాబితా విడుదల చేశారు. మరో 10 నియోజక వర్గాలకు చెందిన సీనియర్‌ నాయకుల నుంచి అభ్యంతరాలు వస్తుండడంతో తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇక్కడ రేవంత్‌ రెడ్డికి, మహేష్‌కుమార్‌ గౌడ్‌ మధ్య విబేధాలు తలెత్తాయి. తాను చెప్పినా... ఆ పది నియోజకవర్గాల మండలాల అధ్యక్షులను ఎందుకు నియమించలేదని మహేష్‌కుమార్‌ గౌడ్‌ను రేవంత్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అభ్యంతరాలు వస్తుండడంతో తాత్కాలికంగా ఆపినట్లు మహేష్‌ చెప్పడంతో రేవంత్​రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఆ తరువాత రేవంత్‌రెడ్డి పది నియోజక వర్గాల పరిధిలో మండలాల అధ్యక్షులను నియామకం విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ బాధ్యతల నుంచి మహేశ్‌ను తప్పించి మల్లు రవికి అప్పగించారు. మహేష్‌కుమార్‌ గౌడ్‌ అప్పటికే విడుదల చేసిన 72 నియోజక వర్గాల మండల అధ్యక్షుల జాబితాలో మూడు నియోజక వర్గాలకు చెందిన మండల అధ్యక్షుల నియామకాలను మార్పులు చేర్పులు చేయడంతోపాటు మరో 8 నియోజకవర్గాలకు చెందిన మొత్తం 11 నియోజకవర్గాల పరిధిలో మండల అధ్యక్షులను మల్లురవి సంతకాలతో నియామకాల జాబితాను విడుదల చేశారు. ఏ హోదాతో మల్లు రవి సంతకాలు పెడతారని సీనియర్‌ నేతలు ప్రశ్నించడంతోపాటు అదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో జోక్యం చేసుకున్న ఏఐసీసీ... తమ అనుమతితోనే ఆర్గనైజేషన్‌ బాధ్యతలను మార్పు చేయాల్సి ఉంటుందని పీసీసీకి స్పష్టం చేసినట్లు సమాచారం.

మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావ్‌ ఠాక్రే, రోహిత్‌ చౌదరిలు జోక్యం చేసుకుని ఇప్పటి వరకు అయ్యిన మేరకు ఆలా ఉంచి.. మిగిలినవి నిలుపుదల చేయాలని సూచించారని తెలుస్తోంది. ఇప్పటివరకు 80 నియోజక వర్గాల పరిధిలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తికాగా మరో 39 నియోజకవర్గాలకు చెందిన మండల అధ్యక్షుల నియామకం.. రేవంత్‌ అమెరికా పర్యటన పూర్తయిన తరువాత నియామకాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు నియామకాలు జరిగిన 80 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని మండలాల అధ్యక్షుల నియామకాలను కూడా సమీక్ష చేసి అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని పీసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.