ETV Bharat / state

యువతకు ఆదర్శం ఈ జొమాటో గర్ల్: ఓ వైపు పని.. మరోవైపు చదువు!

author img

By

Published : Jun 19, 2021, 3:24 PM IST

Updated : Jun 19, 2021, 4:27 PM IST

చదువుకునేందుకు పేదరికం అసలు అడ్డంకే కాదు. ఉన్నతమైన లక్ష్యం.. చదవాలనే ఆకాంక్ష ఉంటే చాలు రచనలా లక్షణంగా చదువుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులున్నా.. కన్నీళ్లు ఉబికి వస్తున్నా ఉన్నత చదువుల కోసం వాటిని పంటిబిగువన భరించింది. కష్టాలను చూసి కుంగిపోలేదు. ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయలేదు. అబ్బాయిలు మాత్రమే పనిచేస్తున్న పుడ్ డెలివరీ పనిలో చేరింది. అమ్మాయిలు అన్నీ చేయగలరని మరోసారి నిరూపించింది. రాష్ట్రంలో తొలి ఫుడ్ డెలివరీ గర్ల్​గా పనిచేస్తూనే చదువునూ కొనసాగిస్తూ రచన యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

zomato girl, warangal girl success story
జొమాటో గర్ల్, వరంగల్ అమ్మాయి విజయగాథ

యువతకు ఆదర్శం ఈ జొమాటో గర్ల్: ఓ వైపు పని.. మరోవైపు చదువు!

ఉన్నత చదువుల కోసం తనదైన రీతిలో పట్టుదలతో కష్టపడుతోంది వరంగల్​కు చెందిన రచన. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకున్నా తాను మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలని సంకల్పించింది. కలలు కనండి.. వాటిని నెరవేర్చుకోండి అని అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆజాద్ స్పూర్తితో ముందుకుసాగింది. తల్లిదండ్రుల మాదిరిగానే రెక్కల కష్టాన్నే నమ్ముకుంది. అదేవిధంగా బాగా చదువుకోవాలనుకుంది. అందుకే ఓపక్క పనిచేస్తూనే మరోవైపు చదువుకోవాలని నిర్ణయించుకుంది.

స్తోమత లేదు

వరంగల్ అర్బన్ జిల్లా బాలసముద్రంలోని అంబేడ్కర్ నగర్​లో నివాసముంటున్న మామిడిపల్లి రవి, సాంబ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెను ఉన్నంతలో చదివించి ఆ తర్వాత పెళ్లి చేశారు. చిన్న కుమార్తె రచన ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఆపై చదివిద్దామనుకుంటే వాళ్ల ఆర్థిక స్తోమతకు మించి ఖర్చవుతుంది. రచన తండ్రి రవి మేస్త్రీ పనులు చేస్తుంటే.. తల్లి సాంబ కూలీకి వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ బిడ్డను ఉన్నత చదువులు చదివించడం వారికి తలకు మించిన భారమే అని భావించారు. కానీ తమ కూతురు అందుకు భిన్నంగా ఆలోచించింది.

రాజధాని బాట

తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించింది రచన. ఉన్నత చదువులు చదువుకునేందుకు రాష్ట్ర రాజధానికి బయల్దేరింది. హైదరాబాద్​లో వరసకు మామయ్య అయిన గుర్రం యాదగిరి ఉన్నాడన్న భరోసాతోనే వచ్చింది. కానీ తాను ఎంచుకున్న చదువు చదవాలంటే రూ.2.50 లక్షలు ఖర్చవుతుంది. చేతిలో చిల్లిగవ్వలేదు. అయినా ఏమాత్రం అధైర్యపడలేదు. తన లక్ష్యం ముందు తనకు అన్నీ చిన్నవిగానే కన్పించాయి. తన మామయ్య గుర్రం యాదగిరిని ఒప్పించి.. నగరంలో ఏదో ఒక పని కుదుర్చమని ప్రాధేయపడింది.

జొమాటో తొలి గర్ల్

తార్నాకాలోని ఓ పాలకేంద్రంలో ఉదయం సమయంలో పాలు అమ్మే పనిలో చేరినప్పటికీ అవి ఇంటి అద్దెకే సరిపోవడంలేదు. తనకు దగ్గరలో ఉన్న ఓ కిరాణంలో పనిచేయాలని నిర్ణయించుకుంది. అలా నెలకు రూ.9వేలకు పైగా ఆదాయం వచ్చినప్పటికీ అవి తన చదువులకు ఏమాత్రం సరిపోవని తెలిసింది. ఓరోజు దుకాణం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే జొమాటో డెలివరీ బాయ్స్ పుడ్ డెలివరీ కోసం వేగంగా వెళుతుండడం గమనించింది. ఒకరోజు అనుకోకుండా రాజు అనే ఓ డెలివరీ బాయ్​ని కలిసి తనకు డెలివరీ గర్ల్​గా పనిచేయాలని ఉందని తెలిపింది. అందుకు ఏం చేయాలో అతడు వివరించాడు. ఆవిధంగా జొమాటో కార్యాలయానికి వెళ్లి రూ.200ల ఫీజు చెల్లించి... టీషర్ట్, పుడ్ బ్యాగ్​ను తీసుకుంది. డెలివరీ గర్ల్​కు కావాల్సిన శిక్షణ తీసుకుంది. ఆవిధంగా మే 22న తొలి జొమాటో పుడ్ డెలివరీ గర్ల్​గా చేరింది.

ఆన్​లైన్​లో చదువు

జొమాటో గర్ల్​గా చేరిన రచనకు ద్విచక్రవాహనం లేకపోవడంతో తాను పనిచేస్తున్న కిరాణషాపు యజమాని వద్ద ఉన్న స్కూటీని వాడుకుంటానని తెలిపింది. అందుకు యజమాని అంగీకరించడంతో జొమాటో సంస్థలో పుడ్ డెలివరీ చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం నాచారం, మల్లాపూర్, మల్కాజ్ గిరి, హబ్సిగూడ, సీతాఫల్ మండీ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఆహారం సరఫరా చేస్తోంది. ఒకవైపు డెలివరీ గర్ల్​గా పనిచేస్తూనే మరోవైపు బల్కంపేట్​లోని చెన్నయ్ అమృత హోటల్ మేనేజ్​మెంట్ కళాశాలలో చేరి ఆన్​లైన్​లో చదువుకుంటోంది. ఫీజు రూ.2.50లక్షలు అయినప్పటికీ తన పరిస్థితిని కళాశాల యాజమాన్యానికి వివరించడంతో మూడు దఫాల్లో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది.

నిత్యం పుడ్ డెలివరీ చేయడం... ఆన్​లైన్​లో చదువుకోవడం నాకు దినచర్యగా మారింది. ఒకరోజు పుడ్ డెలివరీకి వెళ్లొస్తున్న సమయంలో నన్ను చూసి యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ ఒకింత షాకయ్యారు. వెంటనే నా వద్దకు వచ్చి కేవలం మగవాళ్లు మాత్రమే చేసే పుడ్ డెలివరీ పనిని ఎలా చేస్తున్నావని అడిగారు. నా కుటుంబపరిస్థితులు.. చదువుకు కావాల్సిన ఫీజుల కోసం ఇలా చేయాల్సి వస్తుందని చెప్పడంతో చలించిపోయారు. తక్షణం రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. ఆ మరుసటి రోజు వచ్చి ఓ స్కూటీని ఇచ్చారు. ఇప్పుడు సంతోషంగా డెలివరీ చేస్తున్నాను.

రచన, జొమాటో ఫుడ్ డెలివరీ గర్ల్

ఎంత కష్టమైనా పూర్తి చేస్తా

తొలుత లాక్​డౌన్ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే మినహాయింపు ఇచ్చిన సమయంలో దుకాణాలు నడపడం కష్టంగా మారాయి. తనకు జీతం చెల్లించడం కష్టమని యజమాని చెప్పడంతో ఆ పనిమానేసి.. పుడ్ డెలివరీపైనే దృష్టిసారించినట్లు తెలిపింది. ప్రస్తుతం రోజుకి సుమారు రూ.400 వరకు వస్తాయని పేర్కొంది. వచ్చిన డబ్బుల్లో కొంత తల్లిదండ్రులకు పంపిస్తానని వెల్లడించింది. ఉన్నదాంట్లో కొంత ఫీజుకు వినియోగిస్తానని వివరించింది. ఎంతకష్టమైనా హోటల్ మేనేజ్​మెంట్ పూర్తిచేసి... మంచి ఉద్యోగం సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. తన లాంటి వారికి సాయం చేస్తానని చెబుతోంది.

కష్టాలు రానీ..కన్నీళ్లు రానీ.. ఓడిపోయేది లేదు.రాజీ పడేది లేదని రచన స్పష్టం చేస్తోంది. ఎవరైనా దాతలు తాను చదువుకునేందుకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగిస్తారా ...? ఎత్తేస్తారా...?

Last Updated : Jun 19, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.