ETV Bharat / state

Protest at intermediate board : ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

author img

By

Published : Dec 17, 2021, 11:08 AM IST

Updated : Dec 17, 2021, 5:38 PM IST

Student unions besiege Telangana Inter Board office
ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు

08:50 December 17

ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు

ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Protest at intermediate board : హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఫలితాల తీరును నిరసిస్తూ.... విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నేతలు ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బోర్డు తీరును నిరసిస్తూ.... పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.... కార్యాలయం ముందు బైఠాయించారు. అప్పటికే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మొహరించిన పోలీసులు.... విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగిది. దీంతో బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.

'ఇంటర్ ఫలితాల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇంతశాతం మంది విద్యార్థులు ఫెయిల్ అవడం ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ప్రభుత్వం తప్పిదం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ బోర్డ్ బాధ్యత వహించాలి. ఇంటర్ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలి.'

-మూర్తి, ఎస్​ఎఫ్​ఐ రాష్ట్ర అధ్యక్షుడు

కరోనా సమయంలో కళాశాలల్లో తరగతులు నిర్వహించలేదని పీడీఎస్​యూ రాష్ట్ర కార్యదర్శి రాము విమర్శించారు. అయినా ఇంటర్మీడియట్ అధికారులు పరీక్షలు నిర్వహించి... విద్యార్థులను మానసికంగా గందరగోళానికి గురి చేశారని అన్నారు. కేవలం కార్పొరేట్ కళాశాలల కోసమే పరీక్షలు నిర్వహించి... సగానికి పైగా విద్యార్థులను ఫెయిల్ చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థి సంఘాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని గోషామహల్ మైదానానికి తరలించారు.

'ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల గతంలో 27మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కాలేదు. అయినా పరీక్షలు నిర్వహిస్తే... ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటారని మేం ముందే హెచ్చరించాం. అయినా పరీక్షలు పెట్టారు. ఇప్పుడు 51శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వాళ్లకు న్యాయం చేయాలి. విద్యార్థులకు అసైన్​మెంట్ రూపంలో పరీక్షలు పెట్టి... పాస్ చేయాలని మేం గతంలో కోరాం. అయినా కూడా కార్పొరేట్ కాలేజీలకు తొత్తులుగా మారి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. గ్రామీణ విద్యార్థులకు ఆన్​లైన్ క్లాసులు జరగకున్నా పరీక్షలు నిర్వహించారు. ఆ విద్యార్థులందరికీ న్యాయం చేయాలి.'

-జావేద్, ఎస్​ఎఫ్​ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

భరోసా కల్పించాలి..

బోర్డు చరిత్రలోనే ఏనాడు లేని విధంగా ఈ సారి విద్యార్థులు ఉత్తీర్ణత శాతం ఉందని... దీంతో పలువురు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడినట్లు చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి.... విద్యార్థులకు భరోసా కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు.

'ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ముందే ఇంటర్ బోర్డుకు చెప్పినం. ఎగ్జామ్ పోర్షన్ పూర్తికాకముందే పరీక్షలు పెడితే విద్యార్థుల పరిస్థితి అయోమయానికి గురవుతుందని, ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పాం. అయినా పట్టించుకోలేదు. ఒక నిరంకుశ పాలనతో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఈరోజు ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కారణమైంది. తక్షణమే విద్యార్థులకు భరోసా కల్పిస్తూ... ప్రమోట్ చేస్తున్నట్లు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.'

-విద్యార్థి సంఘాల నాయకులు

విద్యార్థి ఆత్మహత్య

Nalgonda Student Suicide : నల్గొండ గాంధీనగర్​కు చెందిన జాహ్నవి(16) ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గతేడాది కరోనా వల్ల నిలిచిపోయిన ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఇటీవలే నిర్వహించగా.. వాటి ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని జాహ్నవిని ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఓవైపు పరీక్షల నిర్వహణలో ఏర్పడిన గందరగోళం.. మరోవైపు ఆన్​లైన్ తరగతుల అయోమయంతో ఎంతో కష్టపడి చదివిన తనకు తక్కువ మార్కులొచ్చాయని బాధపడుతున్న జాహ్నవిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైంది. క్షణికావేశానికిలోనై.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

ఇదీ చదవండి: CM KCR : పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్

Last Updated :Dec 17, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.