ETV Bharat / state

GST: పన్ను ఎగవేత సంస్థలపై రాష్ట్ర జీఎస్టీ అధికారుల దృష్టి

author img

By

Published : Dec 2, 2021, 5:28 AM IST

పన్ను ఎగవేతదారులపై కొరడా ఝుళిపించేందుకు రాష్ట్ర జీఎస్టీ అధికారులు సిద్ధమయ్యారు. సుమారు 50వేల వ్యాపార, వాణిజ్య సంస్థలకు నోటీసులు ఇచ్చిన అధికారులు.. దాదాపు ఏడువేల కోట్లు అదనపు రాబడులు తెచ్చి పెట్టే ప్రక్రియను చేపట్టారు. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు వేసిన రిటర్న్‌లను పరిశీలించి ఎగవేతకు పాల్పడిన, తక్కువ చెల్లించిన జీఎస్టీ వసూలు ప్రక్రియను ప్రారంభించారు.

GST:  పన్ను ఎగవేత సంస్థలపై రాష్ట్ర జీఎస్టీ అధికారుల దృష్టి
GST: పన్ను ఎగవేత సంస్థలపై రాష్ట్ర జీఎస్టీ అధికారుల దృష్టి

గత ఏడాది 2017-18 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు దాఖలు చేసిన రిటర్న్‌లను జీఎస్టీ అధికారులు నిశితంగా పరిశీలించారు. చాలా సంస్థల చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాలతో సంబంధిత సంస్థలకు నోటీసులు జారీ చేసి 600 కోట్లకుపైగా అదనపు పన్ను ఆదాయాన్ని వసూలు చేశారు. పన్ను ఎగవేతలో మరిన్ని అవకతవకలు జరిగాయన్న అనుమానంతో... ఎన్నేళ్లు వెనక్కి వెళ్లి పరిశీలన చేయొచ్చని సీఎస్​ అధికారులను ఆరా తీశారు.

ప్రత్యేక బృంద అధ్యయనం

మొదటి మూడేళ్లు పరిశీలించవచ్చనే సమాచారంతో హైదరాబాద్ ఐఐటీ సహాయంతో జీఎస్టీ చట్టంపై పట్టున్న కొందరు అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి అధ్యయనం చేశారు. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించి వ్యాపార, వాణిజ్య సంస్థలు వేసిన రిటర్న్‌లను పరిశీలించారు. నెలవారీ, వార్షిక రిటర్న్‌లకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. కొన్ని సంస్థల యజమానులు కావాలనే తక్కువ టర్నోవర్ చూపి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు వెల్లడైంది. 50వేలకుపైగా వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి మూడేళ్లకు సంబంధించి దాదాపగా 7వేల కోట్లు రావాల్సి ఉన్నట్లు ప్రాథమికంగా అంచనావేశారు.

నిబంధనలను క్రోడీకరించి..

ఈ మొత్తాన్ని వసూలు చేయడానికి చట్టంలోని నిబంధనలను క్రోడీకరించి ప్రణాళికను సిద్ధం చేశారు. న్యాయ పరమైన చిక్కులు రాకుండా జీఎస్టీ చట్టం ప్రకారం... గత నెల రెండో వారం చివరిలో ఆన్‌లైన్ ద్వారా నోటీసులు ఇచ్చారు. నోటీసు అందిన రెండు వారాల్లో నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాలని పేర్కొన్నారు. ఒక్కో సహాయ కమిషనర్‌కు 120 లెక్కన మూడేళ్లకు 360 మంది వ్యాపార, వాణిజ్య సంస్థల వసూళ్లను అప్పగించారు. అంటే 120 మంది సహాయ కమిషనర్‌లు ఏకంగా 43వేలకుపైగా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 12 మంది జాయింట్ కమిషనర్లకు 1080 నోటీసులు, 24 డిప్యూటీ కమిషనర్లకు 4వేల 320 నోటీసుల చొప్పున పని విభజన చేశారు.

15రోజుల్లో చెల్లిస్తే..

నోటీసులు అందుకున్నవారిలో ఎక్కువ మంది ఆయా రాష్ట్ర జీఎస్టీ అధికారులను సంప్రదించి చెల్లింపులు చేసేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ రెండు మూడు నెలలు పట్టవచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. నోటీసు అందిన 15 రోజుల్లో సంబంధిత సంస్థ చెల్లిస్తే ఎలాంటి అపరాధ రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ పరిమితి దాటినట్లయితే చెల్లించాల్సిన మొత్తానికి సమానంగా అపరాధ రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Bus Ticket Fare: ఆర్టీసీ గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచాల్సిందే: మంత్రి అజయ్​కుమార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.