ETV Bharat / state

Blood Donor Connect: రోగిని, రక్తదాతను అనుసంధానం చేసే యాప్​ ఇదే!

author img

By

Published : Jun 14, 2021, 12:38 PM IST

World Blood Donor Day 2021
World Blood Donor Day 2021

సమయానికి రక్తం అందక, ప్రమాదకర పరిస్థితికి చేరుకున్న రోగులనెందరినో చూసింది 20 ఏళ్ల రియాగుప్తా. అలా జరగకూడదనుకుంది. అందుకే రోగిని, రక్తదాతను అనుసంధానం చేసేలా ఓ యాప్‌ రూపొందించింది. దీంతో ఎందరినో ప్రాణాపాయం నుంచి కాపాడుతోంది. ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా ఆమె సేవా కథనమిది.

రియాగుప్తా చెన్నై చెట్టినాడు అకాడెమీ ఆఫ్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌లో మూడో ఏడాది చదువుతోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్‌మీడియా ద్వారా తెలిసినవాళ్లకు కొందరికి బెడ్స్‌, ఆక్సిజన్‌ సౌకర్యాన్ని అందేలా సాయం చేసేది. ఆ సమయంలో రక్తదాతల కోసం చాలా అభ్యర్థనలు వెల్లువెత్తడం గుర్తించింది. అందుకోసం ప్రయత్నిస్తోన్న సమయంలో కొవిడ్‌ వల్ల బ్లడ్‌బ్యాంకుల్లో నిల్వలు తగ్గాయని గమనించింది. ఇందుకు తన వంతు పరిష్కారం చూపించాలనుకుంది.

‘‘టిండర్‌’ యాప్‌ ద్వారా ఓ స్నేహితుడికి ప్లాస్మా డోనర్‌ దొరికాడని తెలిసింది. ఇక మేం వెనుకడుగు వేయలేదు. వెంటనే ‘బ్లడ్‌ డోనర్‌ కనెక్ట్‌’ పేరుతో...ఓ యాప్‌ తయారుచేశాం. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశాం. అలా వారంలోపే వందమంది దాతలు తమ పేర్లను మా యాప్‌లో నమోదు చేసుకున్నారు. క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. చెన్నైలోని ఎగ్మూరు పిల్లల ఆసుపత్రి, మెటర్నిటీ ఆసుపత్రి, అడయారు క్యాన్సర్‌ ఆసుపత్రుల వారికి అత్యవసరానికి మమ్మల్ని సంప్రదించవచ్చని సమాచారమిచ్చాం.

రక్తం అవసరమున్నవారికి మా యాప్‌లో ఉన్న దాతల వివరాలతో మ్యాచ్‌ చేసి సమాచారం ఇస్తాం. రెండు, మూడు గంటల్లో దాతలు ఆయా ఆసుపత్రులకు చేరుకునేలా చేస్తున్నాం. దీన్ని ప్రారంభించిన నెలలోనే వందల మంది లబ్ది పొందారు. మా యాప్‌ గురించి తెలుసుకున్న రెడ్‌ క్రాస్‌ ఇండియా, చెన్నై ట్రైకలర్‌ వంటి పలు ఎన్జీవోలు దాతల కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. రోజూ కనీసం పదిమందికైనా మా ద్వారా రక్తాన్ని అందించగలుగుతున్నాం. ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు సురేష్‌రైనా మా సేవలను కొనియాడటం మాలో ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల ఒక అరుదైన బ్లడ్‌గ్రూపు రక్తాన్నివ్వడానికి దాతలు చెన్నై నుంచి తిరుచ్చి, పుదుచ్చేరి వెళ్లివచ్చారు. వారికి తగిన ప్రభుత్వ అనుమతులను తీసిస్తున్నాం’ అని చెబుతోన్న రియా త్వరలో ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉంది.

.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.