ETV Bharat / state

కుచించుకుపోతున్న రామాంతాపూర్‌ పెద్దచెరువు

author img

By

Published : Oct 30, 2020, 2:42 PM IST

అక్కడ సులువుగా కబ్జా చేసేస్తారు. లాలూచీ పడే కొందరు అధికారులతో పట్టా పని కూడా కానిచ్చేస్తారు. సొంతిల్లు కట్టుకోవాలనుకునే వారికి ఆశచూపెడతారు. చెరువు ఆక్రమిత ప్రాంతాల్లోని భూమి అమ్మేసి నట్టేటా ముంచేస్తారు. ఇదీ హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో కొందరు అక్రమార్కులు సాగిస్తున్న స్థిరాస్తి దందా. ఇందుకు తాజా ఉదాహరణే... ఇటీవల భాగ్యనగరిలో కురిసిన భారీ వర్షానికి రామంతాపూర్‌ పెద్ద చెరువు విలయం. వరద పోటెత్తి పరిసర కాలనీలను ముంచెత్తడంతో.. జనజీవనం అస్తవ్యస్తమైంది. పెద్దఎత్తున ఆస్తి నష్టం జరిగింది.

ramanthapur pond occupied
కుచించుకుపోతున్న రామాంతాపూర్‌ పెద్దచెరువు

కుచించుకుపోతున్న రామాంతాపూర్‌ పెద్దచెరువు

ఒకప్పుడు సాగు, తాగునీటి వనరుగా ఉన్న రామంతాపూర్‌ పెద్దచెరువు... కాలక్రమేణా మురికికూపంగా మారిపోయింది. చేపల పెంపకం ద్వారా వేల కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన ఈ జలాశయం... ఇప్పుడు చెత్త, చెదారం, పూడిక పేరుకుపోయి సహజత్వాన్ని కోల్పోయింది. ఒకప్పుడు 33 ఎకరాల్లో విస్తరించిన చెరువు.. ఇప్పుడు సగానికి పైగా ఆక్రమణలకు గురై కుచించుకుపోయింది.

అడ్డగోలుగా ఆక్రమణలు

ఓయూ నుంచి పెద్ద చెరువులోకి నీరు వచ్చే చాలా కాలువలపై ఇళ్లు, భవనాలు వెలిశాయి. నాలాలకు అడ్డంగా మట్టి దిబ్బలు, గోడలు కట్టి ఎక్కడిక్కడ అడ్డుకట్ట వేశారు. చాలా చోట్ల నాలాల సహజ మార్గాన్ని మార్చి పైనుంచి ఇళ్లు నిర్మించుకున్నారు. కాలువ రూటు మార్చడం, విస్తీర్ణం తగ్గించటంతో మ్యాన్‌హోళ్ల వెంబడి ధారళంగా వరద నీరు బయటకు పొంగిపోతోంది. ఎక్కడిక్కడ గోడలు పడి పోయి... వరద నీరు ముంచెత్తుతోంది. ఇటీవల వర్షాలకు రవీంద్రనగర్, సత్యనగర్, సీబీఎన్​ నగర్‌లోని చాలా కాలనీల్లో ఇళ్లు మునిగిపోయాయి.

ఇంకా ముంపులోనే..

వరంగల్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రామంతపూర్ పెద్దచెరువు శివారులో పలు కాలనీలు ఏర్పడ్డాయి. చెరువుకు అతి సమీపంలో ఉన్న సాయిచిత్రనగర్ కాలనీ... వర్షం వెలిసి ఇన్నిరోజులైనా... ఇంకా ముంపులోనే ఉంది. చెరువుకుండే తూముల మూసివేత.. ఆక్రమణలతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఓ మోస్తరు వర్షానికి భయపడే పరిస్థితి నెలకొంది.

నాడు జీవనాధారం.. నేడు మురికి కూపం

పాతికేళ్ల కిందట 2వేల కుటుంబాలకు ఈ చెరువే జీవనాధారం. పట్టణీకరణ నేపథ్యంలో తటాకం భూములు కబ్జాలకు గురయ్యాయి. మురికినీరు, గుర్రపు డెక్క పేరుకుపోయి.. చెరువు సహజత్వాన్ని కోల్పోయింది. మరోవైపు చిన్నచెరువు విస్తీర్ణం 19 ఎకరాలుండగా ఆక్రమణలతో 9 ఎకరాలే మిగిలింది. చెరువు కట్ట సైతం కబ్జాకు గురై నిర్మాణాలు వెలిశాయి. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు అర్జీలు పెట్టుకుంటున్నా... పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గంగపుత్రులు వాపోతున్నారు. డ్రైనేజి నీరు సైతం చెరువుల్లో కలిసిపోయి చేపల పెంపకానికి పనికిరాకుండా తయారైందని ఆవేదన చెందుతున్నారు.

కోర్టు ఉత్తర్వులు తుంగలో తొక్కి

1998లో చెరువు భూముల్లో ఇళ్లు కట్టొద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయినా కొందరు అనుమతులు తెచ్చుకుని యథేచ్చగా చెరువు చుట్టూ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. అర్బన్ లేక్స్ పరిధిలో మిషన్ కాకతీయ కింద రామంతాపూర్‌ పెద్ద చెరువు పునరుద్ధరించాలని, ఎఫ్​టీఎల్​, చెరువు సరిహద్దులు నిర్ణయించటమే సమస్యకు శాశ్వత పరిష్కారంగా కన్పిస్తోంది.

ఇదీ చూడండి: గ్రేటర్​లో చెరువులు మాయం... వరదలకు ఆక్రమణలే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.