ETV Bharat / state

Singareni on samme: సమ్మె వల్ల ఏమీ సాధించలేం: సింగరేణి యాజమాన్యం

author img

By

Published : Dec 4, 2021, 4:25 AM IST

Singareni on samme: సమ్మె వల్ల ఏమీ సాధించలేం: సింగరేణి యాజమాన్యం
Singareni on samme: సమ్మె వల్ల ఏమీ సాధించలేం: సింగరేణి యాజమాన్యం

సింగరేణి కార్మిక సంఘాలు ఈ నెల 9వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తలపెట్టిన సమ్మెతో సంస్థ ప్రగతికి నష్టం వాటిల్లుతుందని, సమ్మె ఆలోచన విరమించుకుని కంపెనీ ఉన్నతికి, తద్వారా కార్మికుల అభివృద్ధికి సహకరించాలని అన్ని కార్మిక సంఘాలకు సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. సమ్మె వల్ల ఏమీ సాధించలేమని, ఆర్థికంగా సంస్థకే కాకుండా ఉద్యోగులందరికీ నష్టం వాటిల్లుతుందని తెలిపింది.

తెలంగాణలో నాలుగు బొగ్గు బ్లాక్​లను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సహా ఐదు జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, బీఎంఎస్​లు ఇచ్చిన సమ్మె నోటీసుపై ఇవాళ సింగరేణి యాజమాన్యం ఆయా కార్మిక సంఘాల నాయకులతో సుదీర్ఘంగా ప్రత్యేక చర్చలు జరిపింది. దేశంలో బొగ్గు బ్లాక్​ల కేటాయింపులో స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులపై కూలంకషంగా కార్మిక సంఘాల నాయకులకు యాజమాన్యం వివరించింది. అలాగే నాలుగు బ్లాక్​లను వేలానికి వెళ్లకుండా చూసేందుకు యాజమాన్యం శక్తివంచన లేకుండా చివరి వరకూ చేసిన ప్రయత్నాలను తెలియజేసింది. కేంద్రానికి సంస్థ తరఫున లేఖ రాయడమే కాకుండా, ఆ బ్లాక్​లలో తాము చేపట్టిన అన్వేషణ పనులను వివరించామని తెలిపింది. అలాగే బొగ్గు బ్లాక్​లను సింగరేణికి కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా ప్రధాన మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం వివరించింది.

సమ్మె వల్ల ఉపయోగం ఉండదు: యాజమాన్యం

బొగ్గు బ్లాక్​ల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ దేశవ్యాప్త విధానపరమైన నిర్ణయం నేపథ్యంలో తెలంగాణలో నాలుగు బొగ్గు బ్లాక్​లను వేలం వేస్తున్నారని, ఇది ఒక్క సింగరేణికో, తెలంగాణ రాష్ట్రానికో సంబంధించింది కాదని, ఇక్కడ సమ్మె చేయడం అనేది సమస్య పరిష్కారానికి ఉపయోగకరం కాదని సింగరేణి యాజమాన్యం పేర్కొంది. అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థకు నష్టం జరగడం తప్ప ఉపయోగం ఉండదని, ఉత్పత్తికి విఘాతం కాని వేరే పద్ధతుల్లో మన సమస్యను పరిష్కరించుకోవచ్చని యాజమాన్యం కార్మిక సంఘాల నాయకులకు వివరించింది. నాలుగు బ్లాక్​ల వేలంతో సింగరేణి మనుగడకే ప్రమాదమని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.

సింగరేణి మనుగడకే ప్రమాదం: కార్మిక సంఘాలు

కేంద్ర ప్రభుత్వం నాలుగు బ్లాక్​లను వేలం వేస్తే సింగరేణి మనుగడకు ప్రమాదం పొంచి ఉందని, రానున్న రోజుల్లో తెలంగాణలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని, కార్మిక కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుందని ఈ సమావేశంలో అన్ని యూనియన్ల నాయకులు ముక్తకంఠంతో ఆందోళన వ్యక్తం చేశారు. తమను చర్చలకు పిలవడం పట్ల వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తూనే.. రైతులు సమ్మె చేయడం ద్వారానే రైతు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుందని, తమ పోరాటంతోనూ బొగ్గు బ్లాక్​లను తిరిగి కాపాడుకుంటామన్నారు.

సింగరేణి అస్తిత్వాన్ని కాపాడుతాం

కేంద్రం ఒకవేళ బ్లాక్​లను వేలం వేసినప్పటికీ వాటిని ఎవరు దక్కించుకోవాలని చూసినా సంఘటితంగా అడ్డుకుంటామని, సింగరేణి ప్రాంతంలో ఇతర సంస్థలు మైనింగ్​కు రాకుండా అడ్డుకుంటామని, సమష్టి పోరాటంతో సింగరేణి అస్తిత్వాన్ని కాపాడుతామని చెప్పారు. దీనిపై అవసరమైతే అఖిలపక్షంగా ఏర్పడి రాష్ట్ర ముఖ్యమంత్రిని, కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని, అలాగే ప్రధాన మంత్రిని కలిసి విన్నవిస్తామన్నారు. ఇప్పుడు సమ్మె చేయకపోతే భవిష్యత్​లో బాధపడాల్సి వస్తుంది కాబట్టి అనివార్యంగానే సమ్మె బాట పడుతున్నామని, యాజమాన్యం కూడా తమకు సంఘీభావం తెలపాలని కోరారు.

ఇదీ చదవండి:

Singareni workers strike: డిసెంబరు 9 నుంచి సింగరేణి కార్మికుల సమ్మె..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.