Sheep Distribution in Telangana : నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం

author img

By

Published : Jun 9, 2023, 7:25 AM IST

Etv Bharat
Etv Bharat ()

Second Phase Sheep Distribution in Telangana : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం కానుంది. మొదటి విడత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈ సారి అవినీతి, అక్రమాలకు తావులేకుండా రాయితీపై గొర్రెల పంపిణీకి సర్కార్​ శ్రీకారం చుట్టనుంది. మంచిర్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఇవాళ లాంఛనంగా గొర్రెల పంపిణీ ప్రక్రియ మొదలుకానుంది. నల్గొండ జిల్లాలో నకిరేకల్‌లో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నారు.

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో రెండో విడత గొర్రెల పంపిణీ

Sheep Distribution Second Phase in Telangana Starts Today : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ప్రారంభించిన గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ 2వ విడత కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంచిర్యాల జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ప్రారంభిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో కూడా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయనున్నారు.

KCR Starts Sheep Distribution Second Phase in Mancherial : కులవృత్తులను ప్రోత్సహించాలి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఆలోచనల నుంచి రూపొందినదే గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం. ఈ పథకానికి స్వయంగా ముఖ్యమంత్రే రూపకల్పన చేశారు. గొర్రెల పెంపకం వృత్తిగా జీవనం సాగిస్తున్న గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో సుమారు రూ.11 వేల కోట్ల వ్యయంతో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ముందుగా రాష్ట్రంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన గొల్ల, కురుమలను గుర్తించి గొర్రెల పెంపకం దారుల సొసైటీల్లో సభ్యత్వం కల్పించింది.

అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు.. కేసీఆర్ : కేటీఆర్

లబ్ధిదారులకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు కలిపి ఒక యూనిట్‌గా... ఒక్కో యూనిట్ ధర ఒక లక్షా 25 వేల రూపాయలుగా నిర్ణయించింది సర్కారు. ఇందులో ప్రభుత్వం 75 శాతం - 93,750 రూపాయలు భరిస్తుంది. లబ్ధిదారుడి వాటా ధనం 25 శాతం - 31,25౦ రూపాయలు చెల్లించాలి. మొదటి విడతలో 5 కోట్ల రూపాయల వ్యయంతో 3 లక్షల 93 వేల 552 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేసింది. ఇందులో ప్రభుత్వ వాటా నిధులు రూ.3,751 కోట్లు కాగా... లబ్ధిదారుల వాటా ధనం రూ.1250 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. గొర్రెల ధరలు పెరిగిన కారణంగా 2వ విడతలో యూనిట్ ధర ఒక రూ.1,25,000 నుంచి రూ.50,000 వేలకు పెంచి రూ.1,75,000గా ఖరారు చేసింది. ఇందులో ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వ వాటా ధనం ఒక రూ.1,31,250లు కాగా లబ్ధిదారుడి వాటా రూ.43,750 ఉంది.

ఇవాళ్టి నుంచి ప్రారంభించే రెండో విడతలో 3 లక్షల 37 వేల 816 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ఏకంగా రూ.6,085 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో ప్రభుత్వ వాటా ధనం రూ.4,563.75 కోట్లు కాగా... లబ్ధిదారుల వాటా ధనం రూ.1521.25 కోట్లుగా ఉంటుంది.

లబ్ధిదారులకు గొర్రెల యూనిట్‌తోపాటు గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించింది సర్కారు. గొర్రె చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌గా గొర్రె కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అవసరమైన ఔషధాలు, కొనుగోలు ప్రాంతం నుంచి లబ్ధిదారుల ఇంటి వరకు గొర్రెలు తీసుకునేందుకు రవాణా ఖర్చులు కూడా భరించనుండటం విశేషం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.