ETV Bharat / state

War Effect On Construction Sector: సామాన్యుడి సొంతింటి కలపై యుద్ధ పిడుగు

author img

By

Published : Mar 17, 2022, 5:33 AM IST

War Effect On Construction Sector: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా మన వద్ద సామాన్యుడి సొంతింటి కల ఆవిరైపోతోంది. సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కల అలానే ఉండిపోతోంది. యుద్ధం కారణంగా ముడిచమురు, బొగ్గు ధరలు, సిమెంట్, స్టీలు ధరలు అమాంతం పైపైకి ఎగబాకుతున్నాయి.

Construction
Construction

War Effect On Construction Sector: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మన వద్ద సామాన్యుడి సొంతింటి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు, బొగ్గు ధరలు భగ్గుమంటుండటంతో సిమెంటు, స్టీలు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఇంటి నిర్మాణం ఆరంభించిన వారిపై తీవ్ర ప్రభావం పడుతోంది. దేశంలో చమురు ధరలు రిటైల్‌ మార్కెట్‌లో పెరగనప్పటికీ బల్క్‌గా కొనేవారికి చమురు సంస్థలు ధరలు పెంచాయి. టన్ను స్టీలు ధర దాదాపు రూ.15 వేలు, 50 కిలోల సిమెంటు బస్తా రూ.80-100 వరకు పెరిగాయి. నిర్మాణ వ్యయం అంచనాలు అమాంతంగా పెరగడంతో సామాన్యులు ఆందోళనకు లోనవుతున్నారు.

అంచనాలకు మించి పెరుగుదల..

అంతర్జాతీయ పరిణామాలతో నిర్మాణ రంగం తీవ్ర ప్రభావానికి లోనవుతోంది. సామాన్యుడిపై ధరల ప్రభావం పడుతోంది. సిమెంటు, స్టీలు మాత్రమే కాదు టైల్స్‌, పీవీసీ, ఎలక్ట్రికల్‌ పైపులు.. ఇలా అన్నింటి ధరలూ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా ప్రాజెక్టు పూర్తి నాటికి నిర్మాణ వ్యయంలో 7-8 శాతం వరకు పెరుగుదల ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పెరుగుదల 15-18 శాతం వరకు ఉంటోంది.

-ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు, జాతీయ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌

విక్రయాలు తగ్గాయి..

స్టీలు ధరలు భారీగా పెరగటంతో విక్రయాలు తగ్గాయి. నెల రోజుల వ్యవధిలో టన్నుకు రూ.15 వేల వరకు పెరిగింది. కొన్ని ప్రముఖ బ్రాండ్ల స్టీలు ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విక్రయాలు తగ్గాయి. నిర్మాణదారులు స్టీలు కొనే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. రొటేషన్‌ కోసం నామమాత్రపు లాభంతో విక్రయించాల్సి వస్తోంది.

-కోడిగండి శేఖర్‌రెడ్డి, స్టీల్‌ వ్యాపారి, హైదరాబాద్‌

ఈ ధరలతో నష్టమే..

ప్రస్తుత ధరతో స్టీలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేస్తే.. నష్టమొస్తుందని చాలా మంది నిర్మాణదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంత భారీగా ధరలు పెరగటం చాలా అరుదు. సిమెంటు ధరలు కూడా పెరిగాయి. చిన్న నిర్మాణదారులు పనులను నిలిపివేస్తామంటున్నారు.

-ప్రేమ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి, బిల్డర్స్‌ అసోసియేషన్‌ వెస్ట్‌జోన్‌

స్టీలు రూ.15 వేలకుపైగా..

మునుపెన్నడూ లేనంతగా స్టీలు ధర పెరిగింది. జనవరిలో రూ.64 వేల వరకు ఉన్న టన్ను స్టీలు ధర ప్రస్తుతం రూ.81 వేల పైమాటే. కొన్ని ప్రముఖ బ్రాండ్ల ధరలైతే ఏకంగా రూ.90 వేల వరకూ ఉన్నాయి. ఇంతలా స్టీలు ధరల పెరుగుదల మునుపెన్నడూ లేదని డీలర్లు స్పష్టం చేస్తున్నారు. రష్యా దాడులు మరికొంత కాలం సాగితే ధరలపై ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సిమెంటు బస్తాపై..

స్టీలు బాటలోనే సిమెంటు ధరలూ పరుగులు తీస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో 50 కిలోల బస్తాపై రూ.80-100 వరకు పెరుగుదల నమోదైంది. సాధారణంగా అక్టోబరు నుంచి జూన్‌ వరకు నిర్మాణాలకు అనువైన కాలం. ఈ సీజన్‌లో సిమెంటుకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం ఒక బస్తా ధర రూ.380 వరకు పలుకుతోంది. డిసెంబరులో రూ.300 పలికిన ధర జనవరి చివరి నాటికి దాదాపు రూ.280కి తగ్గింది. రష్యా దాడులు మొదలైనప్పటి నుంచి మళ్లీ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

ఇదీ చదవండి : హైవేల విస్తరణకు నిధులిచ్చి పనులు చేపట్టట్లేదు: రేవంత్‌


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.